31, ఆగస్టు 2010, మంగళవారం

మచిలీపట్నం మాయాబజార్ - 1

నేను గత వారం ఒక పెళ్ళి నిమిత్తమై మచిలిపట్నం వెళ్ళాను. ఆ ప్రయాణపు విశేషాలు ఇలా..

ఏవో కొన్ని పుస్తకాలు కొందామని ఎప్పట్నుంచో బెజవాడ వెళ్ళాలనుకుంటున్నా కాని కుదరలేదు. ఇంతలో స్నేహితుడొకడు వచ్చి వాళ్ళ అన్నయ్య పెళ్ళి కుదిరిందని, పెళ్ళి మచిలీపట్నంలోనని, తప్పక రావలసిందని చెప్పాడు. సరే, దెబ్బకు మూడు పిట్టలు. ఈ పెళ్ళి నెపంతో బెజవాడ వెళ్ళి కావలసిన పుస్తకాలు కొనుక్కోవచ్చు, మా నాన్నగారి ఊరైన మచిలీపట్నం చూసే అవకాశం ఇంత వరకు కలగలేదు, అది చూసి రావొచ్చు, పనిలోపని పెళ్ళి పని కూడా చూసుకోవచ్చని చెప్పి నేను మా ఆయన బెజవాడ ప్రయాణమయ్యాం.

పొద్దున్న తొమ్మిదింటికి బెజవాడలో దిగి గవర్నరుపేటలో ఒక మాంచి పెసరట్టు లాగించి, మా ఆయన తాతగారి ఊరైన పామర్రుకు బయల్దేరాం. మేము ఇల్లు చేరేసరికి పన్నెండు కొట్టింది. గబ గబా స్నానాలు కానిచ్చి భోజనాల ముందు కూర్చున్నాం. అన్ని పదార్ధాలతో ఇంటి భోజనం చేసి ఎన్నాళ్ళయిందో! దోసకాయ పప్పు, కాకరకాయ పులుసు బెల్లం పెట్టి కూర, అల్లం పచ్చడి, ముక్కల పులుసు, గారెలు, గడ్డ పెరుగు. ఎప్పుడూ హడావిడిగా ఇంటికి రావడం, ఏదో ఒక కూరో, పప్పో చేసుకుని, ఇంటి నుండి తెచ్చుకున్న ఆవకాయతో భోజనం అయిందనిపించడం..ఇదేగా మనలో చాలా మంది రోజూ చేసే పని. అలాంటిది అన్ని పదార్ధాలు కొసరి కొసరి వడ్డిస్తుంటే పొట్ట చాలు ఇక మోయలేనంటున్నా, మనసు మాత్రం మరి కాస్త లాగించమంటోంది. అమ్మమ్మ చేతికి అడ్డూ, అదుపు లేక, కలిపిన ప్రతీ ముద్దపై ఆవిడ చేతుల్లోంచి నెయ్యి ధారపాతంగా పడుతూ ఉంటే ఆ కమ్మదనానికి తినగలిగిన దాని కంటే మరి కాస్త లోపలికి తోసి అలా చేయి కడుగుతూనే నిద్రా దేవి ఒళ్ళోకి మత్తుగా జారుకున్నాం.

సాయంత్రం నాలుగున్నర ప్రాంతంలో మచిలీపట్నానికి బయల్దేరాం. ఆ రోజు రాత్రే పెళ్ళి. బందరులో ఉన్న చూడదగ్గ ప్రదేశాలన్నీ తిప్పి పెళ్ళి వేదికకు చేర్చేటట్టు ఒక ఇస్పెషల్ ఆటో మాట్లాడుకున్నాం. పామర్రు నుంచీ బందరుకు వెళ్ళే దారంతా పచ్చని పంట పొలాలే! ఎటు చూసినా పచ్చదనమే! పచ్చని పొలాలు, ఆ పొలాల పక్కగా పారే కాలువలు..ఆహా! ఆ దృశ్యం ఎంత మనోహరంగా ఉందో! అందులోనూ పుట్టి బుద్దెరిగిన తర్వాత నేనెప్పుడూ పల్లెలకు వెళ్ళినదాన్ని కాను. ఆ పొలాల మీదుగా వచ్చే పైరగాలి పీలుస్తూ, ఆ పచ్చదనాన్ని కళ్ళతోనే జుర్రుకుంటూ ఉంటే ఎంతైన పల్లెవాసులు భలే అదృష్టవంతులు అనిపించక మానదు. అలా వెళ్తూ మన అన్నగారి ఊరైన నిమ్మకూరు దాటుకుని మచిలీపట్నంలో అడుగుపెట్టాం.

ముందుగా అక్కడి సాయిబాబా గుడి, మున్సిపల్ పార్కు, చిలకలపూడి పాండురంగస్వామి గుడి చూసుకుని తర్వాత పెళ్ళి మండపానికి వెళ్ళాలనేది మా ఆలోచన. అసలు ఈ ప్రయాణంలో విజయనగరం నుండీ అమ్మా నాన్నా కూడా వచ్చి కలవాలి ప్రణాళిక ప్రకారం. కాని అమ్మకు కాస్త ఒంట్లో బాగాలేకపోవడంతో వాళ్ళు విరమించుకున్నారు. లేకపోతే నాన్నా వాళ్ళు అప్పుడున్న ఇల్లు, చదువుకున్న కాలేజి అన్నీ చూద్దాం, అన్నిటికీ మించి వాళ్ళ ఊరి గురించి చెప్తూంటే నాన్న కళ్ళాల్లో మెరుపు చూద్దామని నాకెంతో ఆశ. సరే ముందుగా సాయిబాబా గుడికి వెళ్ళాం. అక్కడ ప్రపంచంలోనే అతి పెద్దదైన సాయి బాబా విగ్రహం ఉంది (54 అడుగుల ఎత్తు). ఆదిశేషుని పడగల నీడలో కాలు మీద కాలు వేసుకుని కూచున్న ఆ విగ్రహం చాలా బాగుంది.




అక్కడి నుంచీ బయలుదేరి మున్సిపల్ పార్కు చేరుకున్నాం. పార్కు చాలా పొందిగ్గా ఉంది, కృష్ణుని విగ్రహం, శివపార్వతుల విగ్రహాలు అక్కడక్కడా ఉన్నాయి. అక్కడ ఉన్న చాలా బల్లల మీద ఎక్కువగా పెద్దవాళ్ళే కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. నాకు లేని కారణం చేతో మరెందువల్లో నాకు చిన్నప్పట్నుంచీ తాతాగార్లంటే చాలా ఇష్టం, అందులోను 'ఆనందో బ్రహ్మ ' లో సోమయాజికి ఉన్న తాత లాంటి తాత నాకు కూడా కావాలని కోరిక. వాళ్ళతో కబుర్లు చెప్పాలని, వాళ్ళ మాటల్లో జ్ఞానాన్ని ఒడిసిపట్టుకోవాలని ఎంతో ఆశ. ఎటు చూసినా తాతగార్లే ఉన్న ఆ పార్కును విడిచి రాబుద్దే కాలేదు.





బయటకొచ్చేసరికి వడిసెల (catapult or sling) అమ్ముతూ ఒక చిన్న పిల్ల కనిపించింది. 'తీసుకో అక్కా, తీసుకో అక్కా' అంటూ వెంటపడింది. మామూలుగా ఐతే దాన్ని ఎలా ఉపయోగించాలో కూడా తెలియని నేను కచ్చితంగా తీసుకోకపోదును కాని 'ఆంటీ ' అని కాక 'అక్కా' అని పిలిచినందుకు మురిసిపోయి కొనేసా. ఇక్కడ బెంగుళూరులో రెలయెన్స్ ఫ్రెష్ కి వెళ్ళిన ప్రతీ సారి అక్కడ పూలు అమ్మే పిల్లలు 'పూలు తీసుకో ఆంటీ' అని అడుగుతూనే ఉంటారు. చక్కగా మాల కట్టి ఉన్న విరజాజులను చూసి మనసు ఎంత లాగినా నన్ను ఆంటీ అని పిలుస్తారు కాబట్టి నేను వాళ్ళ దగ్గర అస్సలు తీసుకోను.

అక్కడినుండి బయలుదేరి పాండురంగస్వామి గుడికెళ్ళాము. నాకు మామూలుగానే కృష్ణుడంటే ఇష్టం, అందులోనూ ఇస్కాన్ వారి పద్దతిలో ఉన్న కృష్ణుడిలా కాక పాండురంగడిలా , రంగనాథునిలా ఉన్న కృష్ణుడు మరీ ఇష్టం. అక్కడి పాండురంగడ్ని చూడ్డానికి నిజంగా రెండు కళ్ళు చాలనే లేదు. అక్కడి పూజారి, మామూలు గుడుల్లో పుజారుల్లా 'అసింట, అసింట ' అనకుండా, నేను కాస్త దూరంగా నిల్చుంటే 'దగ్గరకొచ్చి కాళ్ళకు దణ్ణం పెట్టుకోమ్మా' అని చెప్పారు. అలా దగ్గరకెళ్ళి గులాబి పూలతో అలంకరింపబడ్డ ఆ పాండురంగడి రూపాన్ని కళ్ళలోనే నిలుపుకుందామని అలాగే చూస్తూ ఉండిపోయా. గుడికి వచ్చిన మరొక ఆవిడ నా తన్మయత్వాన్ని చూసి, 'మీది ఈ ఊరు కానట్టుందే! గులాబి పూల అలంకరణతో స్వామి బాగున్నాడు కదా, నిన్న చామంతి పూలతో అలంకరించారు ' అంటూ పలకరించారు. నాకు చిన్న ఊర్లలో నచ్చేది ఇదే. ఎవరికీ మాట్లాడుకోవడానికి 'ఫార్మల్ ఇంట్రడక్షన్ ' అవసరం ఉండదు. చక్కగా నోరు విప్పి, మనసు విప్పి మాట్లాడేస్తారు. మా ఆఫీసు బస్సులో సంవత్సరం నుండీ వెళ్తున్నా నాకు ఒక్కరి పేరు తెలియదు, నేను ఎవర్నీ పలకరించిన పాపాన పోలేదు, నన్ను ఎవరూ పలకరించిన పాపాన పోలేదు.


విశాలమైన స్థలంలో కట్టబడిన ఆ ప్రాంగణంలోనే రాధా దేవి, రుక్మిణీ దేవి, సత్యభామా దేవి, దుర్గా దేవి ఇలా చాలా ఆలయాలు ఉన్నాయి, వెనక ఒక కోనేరు కూడా ఉంది. అసలక్కడ కూర్చుంటే ఎన్ని సాయంత్రాలైన ఇట్టే గడిచిపోతాయనిపించింది.

టపా అనుకున్నదాని కన్నా పెద్దదయిపోయింది. దీన్ని రెండో భాగంలో కొనసాగిస్తానేం?

9 కామెంట్‌లు:

  1. మా ఊరి గురించి చాలా బాగా చెప్పారు..

    మనసుకి చాలా ఆనందము కలిగింది.

    రిప్లయితొలగించండి
  2. నాగేస్రావ్31 ఆగస్టు, 2010 5:27 PMకి

    చాలా బాగా కళ్ళకుకట్టినట్లు రాసారండీ. ఇప్పుడే బందరు వెళ్ళాలనిపిస్తోంది నాకు. ఇంకా ఫోటోలుంటే పెట్టండి. రొండో భాగంకోసం చూస్తూ...

    రిప్లయితొలగించండి
  3. అజ్ఞాత గారూ, మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.
    Bobby గారూ, మీకు ఆనందం కలిగించినందుకు నాకానందంగా ఉంది :-)
    నాగేస్రావ్ గారూ, నెనర్లండీ..నా దగ్గరున్న ఫోటోలు పెట్టాను రెండో భాగంలో చూడండి.

    రిప్లయితొలగించండి
  4. నైస్ అండీ మా వూరు గురించి ఎంత బాగా చెప్పారో. చాలా థ్యాంక్స్.
    మా వూరి పాండురగండి గుడి తిరణాల టైమ్ లో ఇంకెంత బాగుటుందో..

    రిప్లయితొలగించండి
  5. నెనర్లు భావన గారూ, తిరణాల సమయాల్లో గుళ్ళకు వచ్చే కళే వేరులెండి

    రిప్లయితొలగించండి
  6. memu bandar vellinappudalla saibaba gudi (jilla court center saibaba gudi antaru), parasupeta anjaneyaswami gudiki thappakunda veltham. nenu last time vellinapudu saibaba gudi lo vigraham pani inka jaruguthondi. poorthayina bomma choosi chaala aanandamesindi. bandar vellina rojulu gurthochay nee blog choosi. panduranga swamy gudiki eppudo vella. gurthu kooda ledu naaku. anyways, nenarlu nenarlu :)
    inka chaala unnay bandar lo. bandar daggara srikakulam lo andhra maha vishnuvu gudi famous chaala.

    -eya

    రిప్లయితొలగించండి
  7. ఏమేమున్నాయో చెప్పు ఏయా, ఈ సారి వెళ్ళినప్పుడు చూస్తా

    రిప్లయితొలగించండి
  8. thappakunda harry... btw, inkonni pics post chesthe choostham kadaa.

    -eya

    రిప్లయితొలగించండి