24, ఆగస్టు 2010, మంగళవారం

రాఖీ పండగ జ్ఞాపకాలు

అన్నాదమ్ములున్న ప్రతి అమ్మాయికి ఇష్టమైన పండగ ఈ రాఖీ పండగ. రాఖీ సందర్భంగా పండగ జ్ఞాపకాలు కొన్ని ఇలా..

ఊహ తెలిసిన తర్వాత జరుపుకున్న మొదటి రాఖీ పండగకు ఎంత బాధపడ్డానో! అన్నయ్యకే అందరూ రాఖీలు కడుతున్నారని. పిన్ని కూతుళ్ళు వాళ్ళూ వచ్చి అన్నయ్యకే కట్టారు. పోని అమ్మ నాకొకటి కొంది అని సంతోషపడితే అదీ తీసుకెళ్ళి అన్నయ్యకే కట్టమంది. 'నాకు ఎవరూ రాఖీ కట్టట్లేదు. అందరికీ అన్నయ్యంటేనే ఇష్టం, నేనంటే ఇష్టం లేదు' అని అమ్మతో చెప్పి ఏడ్చా కూడా. పెద్దౌతున్న కొద్దీ రాఖీ కట్టించుకోవడంలో కంటే కట్టడంలోనే ఎన్నో ఉపయోగాలున్నాయని జ్ఞానోదయమయ్యింది. తర్వాతి పండగకి ఎంతో జాగ్రత్తగా దాచుకున్న రూపాయి పెట్టి రాఖీ కొని అన్నయ్యకు కడితే, అన్నయ్య అర్ధరూపాయి ఇచ్చాడు. నేను ఏడుపు మొహం పెట్టుకుని నాన్న దగ్గరకెళ్ళి 'నాన్నా చూడండి, నేను రూపాయి రాఖి కడితే అన్నయ్య అర్ధ రూపాయి ఇచ్చాడు, ఇంకో అర్ధ రూపాయైనా ఇప్పించండి ' అని నాన్నతో అన్నా. అలా డబ్బులు ఇవ్వమని అడక్కూడదు, అన్నయ్య ప్రేమతో ఎంతిస్తే అంత తీసుకోవాలి అని నాన్నంటే, నాన్నకు కూడా అన్నయ్యంటేనే ఇష్టం అనుకున్నా.

కాలం గిర్రని తిరిగి మళ్ళీ రాఖీ పండగొచ్చింది. సరిగ్గా నాకోసమే అన్నట్టు పండగ సమయానికి మా దొడ్డమ్మ గారబ్బాయి మూర్తన్నయ్య కూడా ఇంట్లోనే ఉన్నాడు. క్రితం సారి రాఖీ కి జరిగిన నష్టం ఈ సారి పూడ్చుకోవాలని షాపుకెళ్ళి రెండు రాఖీలు తెచ్చుకుని, ఎంతైనా సొంతన్నయ్య కదా అని ముందుగా తీసుకెళ్ళి అన్నయ్యకి కట్టేసా. ప్చ్! ఏం లాభం లేదు. ఎప్పటిలాగా అర్ధ రూపాయే ఇచ్చాడు. ఛీ! అన్నయ్యకు కట్టడం వేస్ట్. కట్టకపోయినా నా రూపాయి నాకు మిగిలేది అని విచారపడుతూ మూర్తన్నయ్యకు రాఖీ కట్టడానికెళ్ళా. మూర్తన్నయ్య ఎంత మంచాడో! నేను కడుతూనే రెండు రూపాయల నోటు తీసి ఇచ్చాడు. మొహంలో ఎంత దాద్దామనుకున్నా దాగని సంతోషం. కాని ఠక్కని తీసేసుకుంటే బాగుండదని మొహమాటంగా 'వద్దన్నయ్యా, వద్దు' అని బయటకు అంటున్నానే కాని 'వద్దా సరే' అని తిరిగి జేబులో ఎక్కడ పెట్టేసుకుంటాడో అని లోపల ఒకటే భయం. కాని పాపం అన్నయ్య 'తీసుకోమ్మా తీసుకో' అని బలవంతంగా (?) నా చేతిలో పెట్టేసాడు. ఇక చూసుకోండి నా సంబరం. టట్టడాయ్ అనుకుంటూ నా రెండు రూపాయల నోటు అన్నయ్య ముందు కాసేపు ప్రదర్శనకు పెట్టి, ఆ తర్వాత ఆ నోటు ముందు పెట్టుకుని రంగుల కలలెన్నో కంటూ గడిపేసా.

మరుసటి ఏడాది నుంచీ నా రాఖీల సంఖ్య పెంచేసా. మా ఇంటి ఎదురుగా ఉండే ఇద్దరబ్బాయిలకీ కట్టేసా. అప్పటికి రూపాయి ధర బాగా పడిపోయింది. అన్నయ్య పాపం సంవత్సరం అంతా దాచి దాచి, ఐదు రూపాయలిచ్చాడు కాని ఎదురింటబ్బాయిలు ఇచ్చిన పది రూపాయల ముందు అన్నయ్య ఐదు రూపాయలు తేలిపోయాయి. అప్పటినుండి నా రాఖీల దెబ్బకు వీధిలోని అబ్బాయిలంతా బలైపోయారు. ఇలా పదవతరగతి వరకు నా రాఖీ యాత్ర అప్రతిహతంగా కొనసాగింది. జూనియర్ కాలేజీకి వచ్చాకా, పండగ రోజు రాఖీ కడదామని ఓ ఇరవై రాఖీలేసుకుని కాలేజీకి వెళ్ళానా? ఆ రోజు ఒక్క అబ్బాయి కాలేజీలో కనపడితే ఒట్టు. బొత్తిగా అబ్బాయిలకు క్రీడాస్పూర్తి లేకుండా పోయింది. ఇంజినీరింగ్లో ఉండగా మాకు ఎంతో సాయం చేసిన సీనియర్లకి వాళ్ళ హాస్టల్ కి వెళ్ళి మరీ రాఖీ కట్టాను. ఏంటో! వాళ్ళు ఆ రోజు నుండీ కనపడడం మానేసారు :-(

కొసమెరుపేంటంటే, ఉద్యోగంలో చేరిన కొత్తల్లో రాఖీ పండగ మరో నాలుగు రోజుల్లో ఉందనగా, 'ఏయ్! మంచి మంచి పాత పాటలన్నీ కాపీ చేసి ఒక ఫొల్డర్లో పెట్టి ఉంచు' అన్నాడు, తన అవసరమైనా, పక్క వారి అవసరమైనా గదమాయించడమే కానీ సౌమ్యంగా అడగడం చేతకాని మా బుజ్జన్నయ్య. ఎందుకనడిగితే 'ఎందుకైతే నీకెందుకు, చెప్పింది చెయ్యి, మంచివి ఎక్కించు, అసలే తనకి నీలాగ పాత పాటలంటే పిచ్చి' అని చెప్పి వెళ్ళిపోయాడు. నాకు ఒళ్ళు మండింది. 'నాకోసమంటే ఒక్క చిన్న పని చేసిపెట్టడు, అదే ఎవరికో ఐతే సి.డి. రాసిపెడుతున్నాడు ' అని ఆ ఉడుకుమోత్తనంతో మంచి పాటలు కాకుండా నాకంతగా నచ్చని, బాగాలేని పాటలన్నీ కాపీ చేసి పెట్టేసా. నాకేం తెలుసు ఆ పాటలన్నీ కాపి చేసిన ఎమ్పీత్రీ ప్లేయర్ నాకు రాఖీ రోజు బహుమతిగా ఇస్తాడని!! :-( :-(

8 కామెంట్‌లు:

  1. :) baagunnayi mi kaakhi kaburlu paapam estam leni paatalu enkaa vintunnaraa!Mari ee year gifts eanto???

    రిప్లయితొలగించండి
  2. మీ కబుర్లు చదివి చాల బాధపడుతున్నాను.ఇష్టం లేని పాటలను నాకు మెయిల్ చేసి మంచిపాటలను వినండి.

    రిప్లయితొలగించండి
  3. మీకూ రాఖీ శుభాకాంక్షలు .
    మీ పోస్ట్ నవ్య లో వచ్చినందుకు అభినందనలండి .

    రిప్లయితొలగించండి
  4. చెప్పాలంటే గారూ, లేదండీ, ఎప్పుడో మార్చేసి, మంచి పాటలు పెట్టేసుకున్నాగా! కాకపోతే మొదటిసారి ఆ ప్లేయర్ని అందుకోగానే అయ్యో మంచి పాటలు కాపీ చేసుంటే బాగుండేది అనిపించి బాధేసింది.
    ఈ సంవత్సరం కూడా చాలానే బహుమతులు అందుకున్నా కానీ చిన్నతనంలో బహుమతి అందుకుంటే వచ్చే ఆనందమే వేరుగా ఉండేది

    సూరి గారూ, తప్పకుండానండీ!

    రిప్లయితొలగించండి
  5. మాలా గారు, ధన్యవాదాలండీ!

    నా పోస్టు నవ్యలోనా? నిజమే? నాకు తెలియనే తెలియదండీ! ఏ రోజు వచ్చింది కాస్త చెబుతారా?

    రిప్లయితొలగించండి
  6. సుభగ గారు,
    ఇది చూడండి.

    http://saisatyapriya.blogspot.com/2010/08/blog-post_25.html

    రిప్లయితొలగించండి
  7. శివప్రసాద్ గారూ, నెనర్లండీ!

    నీహారిక గారూ, మీకు బోలెడు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి