27, జులై 2010, మంగళవారం

వెన్నెల, వర్షం కలిసి వస్తే

నిన్నటి 'పాడుతా తీయగా' వీక్షకులకు సరిగ్గా అలాంటి అనుభూతే కలిగి ఉంటుంది.
మన గాన గంధర్వుని కార్యక్రమం లో వెన్నెల కురిసింది, కాదు కాదు సిరివెన్నెల కురిసింది.

ఆరు బయట వెన్నెల్లో కూర్చుని చందమామ కథలు వింటూ, అమ్మ చేతి గోరుముద్దలు తినడం ఎంత హాయో, మన సిరివెన్నెల గారి మాట అంత హాయి, పాట అంత హాయి..
అతిధి లా వచ్చి చిరునవ్వుల, చిరుపాటల సిరివెన్నెలలు కురిపిస్తూ మన సీతారామ శాస్త్రి గారు, ఆయన పాటలలోని ఆణిముత్యాలను పాడి, పాడించి ఆ ఆనంద ధారలలో మనను తడుపుతూ మన ఎస్.పి.బి ప్రేక్షకులను ఆనందసాగరం లో ఓలలాడించారు

"ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం" పాటతో ఎంచగ్గా కార్యక్రమం మొదలయ్యింది..
ఎంతో శ్రావ్యంగా పాడింది గుంటూరు అమ్మాయి ..

ఈ పాట గురించి వ్యాఖ్యానిస్తూ సిరివెన్నెల గారు ఇలా అన్నారు, (సరిగ్గా ఇలానే కాకపోయినా నాకు గుర్తున్నంత వరకు ఇంచుమించుగా..)

"మొన్నామధ్య నా దగ్గరకు ఒక అరడజను మంది ఆడపిల్లలు వచ్చారు, నా అభిమానులు.
మాటల సందర్భంగా ఇలా అన్నాను, 'ఎంత సేపు మీరు సమాన హక్కులు, సమాన హక్కులు అంటారే కాని, మగవాళ్ళతో సమాన స్థాయికి రావలంటే మీరు ఒక పది మెట్లు కిందకు దిగి రావాలి, మీరు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ మాకన్నా ఒక పది మెట్లు పైనే ఉన్నారు..
మగవాళ్ళు చేసిన పనులన్నీ మీరు చేయగలరు, కాని ఒక శిశువుని కని ఒక మహా మనీషి గా తయారు చేసే సామర్ధ్యం మాత్రం మీదే, మాకు లేదు
అందుకే తెలిసి అన్నాడో తెలియక అన్నాడో తెలియదు కాని ఇంగ్లీషు వాడు కూడా కంప్యూటర్ ని మదర్ బోర్ద్ అన్నాడు కాని ఫాదర్ బోర్ద్ అనలేదు.."

మరెన్నో మంచి పాటలతో, ఎస్.పి.బి. సిరివెన్నెలల మాటలతో కార్యక్రమం హుషారుగా సాగింది

కార్యక్రమంలో సిరివెన్నెల కు పది నందులను తెచ్చిన పది ఆణిముత్యాలను మనకు బిట్లుగా వినిపించారు..
అవి
"విధాత తలపున (సిరివెన్నెల)", "తెలవారదేమో స్వామి (శృతిలయలు)", "అందెల రవమిది (స్వర్ణ కమలం)", "సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని (గాయం)", "చిలక ఏ తోడు లేక (శుభలగ్నం)", "మనసు కాస్త కలత పడితే (శ్రీకారం)", "అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని (సింధూరం)", "దేవుడు కరుణిస్తాడని (ప్రేమ కథ)", "జగమంత కుటుంబం నాది (చక్రం)", "ఎంత వరకు ఇంత పరుగు (గమ్యం)"

చివర్లో సంగీత పోటీల పేరుతో పిల్లలని ఏడిపిస్తున్న కార్యక్రమాలకు, చానళ్ళ వారికి చురకలు వేసారు..
"మీ అమ్మాయి జయమాలిని లా ఉంది, సిల్కు స్మిత లా డాన్సు చేసింది" అంటే పొంగిపోతున్న ఈ కాలంలో
ఎక్కడా అసభ్యత కలిగిన పాటలకు తావు ఇవ్వకుండా, ఏడుపులు పెడబొబ్బలు లేకుండా ఎంతో సమర్ధవంతంగా ఈ కార్యక్రమాన్ని నడుపుతున్న బాలు గారిని అభినందించారు.

ఈ కార్యక్రమం ఈ శుక్రవారం సాయంత్రం తిరిగి (ఈ టీ.వీ. లో) ప్రసారమౌతుంది, వీలున్నవాళ్ళు చూడండి.
సిరివెన్నెల తో తరువాయి భాగం వచ్చే సోమవారం 9:30 గంటలకు..

26, జులై 2010, సోమవారం

రక్త చరిత్ర

టపా పేరు చూసి ఇదేదో రాంగోపాల్ వర్మ సినిమా గురించి అనుకునేరు. రక్తంతో రంగరించిన నా అనుభవాల కథే ఈ రక్త చరిత్ర . రక్తంతో నాకు చాలానే అనుభవాలు ఉన్నా ముఖ్యంగా రెండు సంఘటనలు మటుకు చెప్తాను

సీన్-1:
అది మా కాలేజీలో రక్తదానశిబిరం జరుగుతున్న ప్రదేశం. నా స్నేహితులంతా చిరంజీవి సినిమా మొదటి ఆట టికెట్ల కోసం ఎగబడినట్లు పోటీపడి మరీ రక్తదానం చెయ్యడానికి వెళ్తున్నారు. వారందరికీ మోటివేషన్ : రక్తం ఇచ్చే ప్రతీ వారికి ఒక ఫ్రూటి, ఒక బిస్కట్ల పాకెట్ ఇస్తున్నారనే వార్త. నేనేం తక్కువ తిన్నానా, నా యధాశక్తి నేనూ రక్తదానం చేద్దామని బయల్దేరాను. అసలు ఈ రక్తదానం చెయ్యలనే కోరిక ఈనాటిది కాదు. ఎప్పుడో స్కూల్లో చదువుతున్నప్పటినుంచి అనుకుంటున్నా, స్కూల్లో ఆడుతున్నప్పుడు పక్కవాడి రక్తం కళ్ళజూడడమే తప్ప నా రక్తం ఇచ్చే అవకాశం ఎప్పుడూ కలగలేదు.

రక్తం ఇస్తానంటే 'నీ మొహం! నీకు రక్తం చూస్తేనే కళ్ళు తిరుగుతాయి ఇవ్వడం కూడానా' అని నిరుత్సాహపరిచే అమ్మానాన్నలకు దూరంగా హాస్టల్లో ఉన్నందువల్ల, ఇక్కడ మనం విచ్చలవిడిగా రక్తం ఇచ్చేసుకోవచ్చు అని సంతోషపడుతూ శిబిరం దగ్గరకు వెళ్ళా. అక్కడి నిర్వాహకులు 'ప్రస్తుతం మేము పెట్టినది రక్తం తీసుకునే శిబిరం, ఇచ్చే శిబిరం పెట్టినప్పుడు నీకు కబురు పంపుతాము ' అని మర్యాదగా చెప్పారు, నా పర్సనాలిటీని చూసి. ఈ అవమానానికి నా రక్తం వెచ్చబడింది, కళ్ళు ఎర్రబడ్డాయి. 'రక్తం ఇవ్వడానికి కావల్సిన అర్హతలు అన్నీ నాకు ఉన్నాయి (కనీస బరువు 45 కేజీలు - మనం సరిగ్గా 45 ఉన్నామప్పుడు), నా రక్తం ఎందుకు తీసుకోరు, ఇది మానవ హక్కుల ఉల్లంఘన ' అని వారితో పెద్ద యుద్దమే చేసి వాళ్ళు లొంగకపోతే, ఆనక బ్రతిమాలి బుజ్జగించి ఎలాగైతేనేం నా రక్తం తీసుకోవడానికి ఒప్పించా.
రక్తం తీసుకునేముందు సూదిని వేలులోకి గుచ్చి ఒక చుక్క రక్తం పరీక్షకు తీసుకుని, అనీమికో కాదో చూసి, బ్లడ్ గ్రూపు నిర్ధారించుకుని తీసుకోవడం పరిపాటు. దాని కోసం ఒక వాలంటీరు పక్కనే ఉన్నాడు.

రక్తం ఇవ్వడానికి పేద్ద యుద్దమైతే చేసా కాని మనకు రక్తం చూస్తేనే బెదురు. వాలంటీరు ఆ సూదిని నా వేలులోకి పొడిచి చిత్రహింసలు పెట్టడానికి సిద్దంగా ఉన్నాడు. బలికి తనంతట తనే పోయే గొర్రెపిల్లలా నేను వెళ్ళి అక్కడ నిల్చుని నా సున్నితమైన వేలుని ఆ కర్కశమైన చేతుల్లో పెట్టా. సూది దగ్గరగా రావడం, నేను చేతిని వెనక్కు లాక్కోవడం ఇదే తంతు ఒక పది నిముషాల పాటు జరిగింది. ఇంక లాభం లేదని అక్కడ ఉన్న వాలంటీర్లు అంతా కలిసి నన్ను పట్టుకుని నా వేలును ముందుకు తోసారు. సూది నా వేలులోకి దిగడం వరకు గుర్తుంది.ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు. నాకు మెలకువ వచ్చి కళ్ళు తెరచి చూసేసరికి నేను ఒక బెడ్ మీద పడుక్కుని ఉన్నా. నా చుట్టూ నా స్నేహితులంతా ఏడుపు నవ్వు కలిపిన మొహాలతో, డబ్ చేసిన అరవ సినిమాలోని కామెడీ అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించే ప్రేక్షకుల్లా నిల్చుని ఉన్నారు. నేను కళ్ళు తెరచి చూసేసరికి ఆనందం పట్టలేక, ఇటుపక్క, అటుపక్క రక్తదానం చేసిన వాళ్ళ దగ్గర పెట్టిన బిస్కెట్లు, ఫ్రూటి స్మగుల్ చేసి నాకిచ్చారు. అవి తిని, తాగి మూడు రోజులు బెడ్ రెస్టు తీసుకుంటే కాని మామూలు మనిషిని కాలేకపోయా. ఇక ఆ దెబ్బకు మరి రక్తదానం చెయ్యాలనే పైత్యపు ఆలోచనలు దగ్గరకు రానియ్యకుండా జాగ్రత్తగా ఉంటూ వచ్చా. మరొకసారి నా రక్తం ఇవ్వాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. కాని మనం అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే అది తెలుగు సినిమా అవుతుంది కాని జీవితం ఎలా అవుతుంది?

సీన్-2
జీవితం ఎలాంటి ఒడిదుడుకులూ లేకుండా హాయిగా గడిచిపోతోంది. మా ఆఫీసులో మా టీం తరుపున విదేశంలో పనిచెయ్యడానికి నన్ను ఎంపిక చేసారు. వెళ్ళవలసినది నా కలల దేశమైన స్విట్జెర్లాండ్ కి. ఆ విషయం తెలిసినప్పటి నుండి, నేను నేల మీద నిల్చోవడం మానేసా. 'గాల్లో తేలినట్టుందే..' అని పాడుకుంటూ మబ్బుల్లో షికారు కొడుతున్నా. నా ఆనందాన్ని చూసి సహించలేని మా టీమ్మేట్ నా ఆనందంపై నీళ్ళు జల్లుతూ ఒక పిడుగులాంటి వార్త చెప్పింది. 'యెస్ మీరు సరిగ్గానే ఊహించారు' అది విదేశాలకు వెళ్ళే ప్రతీ వారు మెడికల్ టెస్ట్ చేయించుకోవాలని, మెడికల్ టెస్ట్ లో భాగంగా బ్లడ్ టెస్ట్ చేస్తారని. అప్పటి దాకా మబ్బుల్లో తేలుతూ ఉన్న నేను ఆ మాట వినగానే జెట్ స్పీడుతో వచ్చి నేలపై దబ్బని పడ్డా. లేచి విరిగిన ఎముకలు లెక్కపెట్టుకుంటూ ఉంటే మా డేమేజర్, సారీ మేనేజర్ వచ్చి నేను రక్తపరీక్షకు వెళ్ళాల్సింది ఆ మర్నాడే అని మరొక బాంబు పేల్చాడు.

ఏం చేయాలి! ఈ ఆపద నుండి ఎలా గట్టెక్కాలి! వెళ్ళడం మానుకుంటేనో? ఛీ అందరి ముందర చులకనైపోతాం. ఇప్పటికే అడగనివాళ్ళకు అడిగినవాళ్ళకు మన ప్రయాణం గురించి చెప్పేసాం. సరే ఆసుపత్రిలో నర్సుకు ఒక వంద ఇచ్చి, వేరే ఎవరి రక్తమైనా మన రక్తంగా ఇప్పిస్తే? ఊహుం ఈ అవిడియా వర్కౌటు అయ్యేలా లేదు. పని జరక్కపోగా అసలుకే మోసం వస్తే ప్రమాదం. సరే ఏమైతే అయ్యిందని ఆ రోజు ఇంటికి వెళ్ళి పాతాలభైరవి సినిమా పెట్టుకుని చూసి, బ్రదర్ తోట రాముడు ఇచ్చిన స్పూర్తితో 'ధైర్యే సాహసే లక్ష్మి ' అనుకుని రక్తం ఇవ్వడానికే నిశ్చయించుకున్నా.

మరునాడు వర్జ్యం అదీ లేకుండా చూసి ఇంటినుండి బయలుదేరేవేళకు హిమేష్ రేషమ్మియా పాట పాడినట్టు ఆకాశవాణి వికృతంగా నవ్వింది. ఇదేం అపశకునం రా బాబూ అనుకుంటూ, అయినా కార్య సాధకులు ఇలాంటివి లెక్క చేయకూడదని ధైర్యంగా హాస్పిటల్లోకి అడుగుపెట్టా. లేని ఉత్సాహం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ కాల్గేట్ ఏడ్ లో సచిన్ లా 1000 వాట్ స్మైల్ ఇస్తూ రెసెప్షనిస్ట్ కి నా అపాయింట్మెంట్ గురించి చెప్పా.

ఆవిడ లోపల ఎవరో వున్నారు, వారు రాగానే పంపిస్తా అందాక కూర్చోమని చెప్పింది. నా వెనకే ఒకాయన ఒక చిన్న పిల్లతో వచ్చి కూర్చున్నాడు. ఆ పాప వాళ్ళ నాన్నను రక్త పరీక్ష గురించి ప్రశ్నలు అడుగుతోంది, రక్తం ఎలా తీస్తారు, తీసినప్పుడు నొప్పెడుతుందా, తీసేసాక నొప్పెడుతుందా అంటూ. అసలే ఆందోళనగా ఉన్నా, అది కనపడనీయకుండా డాంబికంగా కూర్చున్న నాకు ఆ మాటలు వింటుంటే బి.పి పెరిగిపోతోంది. అవి వినపడకూడదని నా సెల్ ఫోన్ తీసి రేడియో ఆన్ చేసా. 'నా రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రోలు..' అంటూ ఆర్.నారాయణమూర్తి గారు గోలపెడుతున్నారు. విధి పగబట్టింది అని పుస్తకాల్లో, కథల్లో చదువుతున్నప్పుడు అర్ధం కాలేదు, ఇప్పుడు తెల్సింది అనుకుంటూ రేడియో ఆఫ్ చెయ్యంగానే నాకు పిలుపు వచ్చింది. నా వెనకే ఆ పాప కూడా ఆ గదిలోకి వచ్చి వేరే టేబుల్ దగ్గర కూర్చుంది. నా చేయి ధీమాగా నర్సు చేతికి ఇవ్వడం చూపించి వాళ్ళ నాన్నగారు, 'అక్కను చూడు ఎలా భయపడకుండా ఉందో, నువ్వూ అలాగే ఉండాలి ' అంటూ పాపకు ధైర్యం చెప్తున్నారు. నేను కళ్ళు మూసుకుని, వాళ్ళ మాటలు వింటూ నాకు రక్తం తీస్తున్నారనే సంగతి మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నా. కాని కాసేపటికి నాకు వాళ్ళ మాటలు వినపడడం మానేసాయి. కళ్ళు తెరిచి చూసేసరికి నేను టేబుల్ పై తల పెట్టుకుని పడుకుని ఉన్నా. పోనిలే ఎదైతే ఏం, మొత్తానికి ఈ ప్రహసనం ముగిసింది అని ఆనందపడుతూ లేవబోయేసరికి నర్స్ వచ్చి, 'మేడం మీకింకా రక్తం తీయడం పూర్తి కాలేదు, మా సీసా ఎర్రబడిందో లేదో మీ కళ్ళు మూతలు పడి రెండు గంటల తర్వాత ఇప్పుడే లేచారు ' అంది. నా పరిస్థితే ఇలా ఉంటే, పాపం ఆ పాప పరిస్థితి ఎలా ఉందో అని విచారపడుతూ 'పాపను పక్క గదిలో పడుకోబెట్టారా' అని అడిగాను. 'పడుకోబెట్టడం ఏంటి ఆ పాప రక్తం ఇచ్చేసి, అక్కకు లేచాక టాటా చెప్పమని చెప్పి ఆడుతూ పాడుతూ ఎప్పుడో వెళ్ళిపోయింది ' అని చెప్పింది నర్సు. ఈ సంఘటన నా రిపోర్టులోకి రానివ్వద్దని నర్సును బ్రతిమాలుకుని, రక్తం ఇవ్వడానికి మరో మంచి ముహూర్తం చూసుకుని వస్తానని చెప్పి అక్కడి నుండి బయటపడ్డా.

22, జులై 2010, గురువారం

చిన్ననాటి కథలు-2

ఈ కథ మా అమ్మ చిన్నప్పుడు వాళ్ళ తాతగారు చెప్పినది, అడిగి అడిగి మరీ చిన్నప్పుడు ఇది చెప్పించుకునేవాళ్ళం :-)

ఒకానొక ఊరిలో ఒక పేద బ్రాహ్మడు ఉండేవాడు. అతనికి పెద్దగా పాండిత్యం అబ్బకపోయినా భార్యాబిడ్డలను పోషించడానికి పురాణ కాలక్షేపం పేరుతో తన నోటికి వచ్చింది చెప్తూ నాలుగు రాళ్ళను సంపాదించేవాడు. కొంతకాలానికి ఆ ఊర్లోవాళ్ళకు ఇతని సంగతి అర్ధమయ్యి ఇతనికి ఆదరణ కరువౌతుంది. దాంతో పొట్ట చేత పట్టుకుని కొంత దూరం ప్రయాణం చేసి వేరే ఊరు చేరుకుంటాడు. ఆ ఊరి ప్రజలు బొత్తిగా అమాయకులని, అజ్ఞానులని గ్రహించి పురాణప్రవచనాలు చేస్తానని చెప్పి ఆ ఊర్లోనే స్థిరపడిపోతాడు. ఆ ఊరి ప్రజలు పాపం ఇతను చెప్పిందే వింటూ ఈ బ్రాహ్మడిని దైవాంశ సంభూతునిగా భావించి గౌరవిస్తూ ఉంటారు.
కొంత కాలానికి ఒక నిజమైన పండితుడు ఆ ఊరి మీదుగా పోతూ చీకటి పడడంతో ఆ రాత్రికి అక్కడే బస చేయదలచి ఊరి కరణం వద్దకు పోయి తనకు ఆ రాత్రికి ఆశ్రయమిమ్మని కోరతాడు. కరణం మహదానందంగా ఒప్పుకుని కావలసిన ఏర్పాట్లు అన్నీ చూస్తాడు. పండితుడు భోజనం కానిచ్చి ఇక విశ్రమిద్దామని నడుం వాల్చబోతుంటే, ఊరి ప్రజలంతా కలిసి రామాలయం వేపుకు వెళ్తూ ఉండడం గమనించి కరణాన్ని ఆ సంగతి అడుగుతాడు. తమ ఊరిలో రోజూ ఒక మహానుభావుడు పురాణ ప్రసంగం చేస్తాడని, తాను కూడా అక్కడికే పోతున్నానని, ఆ పండితుని కూడా వచ్చి విని తరించవలసిందిగా చెప్తాడు. సరే ఎలాగో చేసేది ఏమీ లేదు కనుక కాస్త కాలక్షేపంగా ఉంటుందని తలచి పండితుడు కూడా బయలుదేరతాడు.
పురాణ శ్రవణం మొదలైన కాసేపటికి పండితుడికి ఏ పురాణం చెప్తున్నారో, దేని గురించి చెప్తున్నారో బొత్తిగా అర్ధం కాక లేచి సంస్కృతం లో 'కిం' అని ప్రశ్నిస్తాడు (అంటే ఏంటి అని అర్ధం). ఆ ఊరి ప్రజలు చెప్తే వినడమే కాని ఎన్నడూ ప్రశ్నించని వారవడం చేత ఈ పండితుని వైపు అబ్బురపడుతూ చూసి ' కొత్త పంతులుగోరు ఏదో గొప్ప ప్రశ్న వేసారురా, మన పంతులు గారు ఏం చెప్తారో విందామ'ని అనుకోసాగారు. అందరి దృష్టి తన మీదే ఉండడం గ్రహించి ఆ పండితుని నోరు ఎలా అయినా మూయించకపోతే అక్కడ తన ఉనికికే ముప్పు కలుగుతుందని భావించి,
'కిం లేదు కం లేదు
గూట్లో మంచం
విత్తుల పందెం
పంట నలుతుం
మా ఎల్లెద్దు కొం
ఎదురం లో ఢం ఢం
ఇక పో ఝం ఝం' అని నోటికి వచ్చింది అనేస్తాడు.
ఆ అమాయక ప్రజలు పాపం, 'ఆ కొత్త పంతులు ఒక ముక్క అడిగాడో లేదో మన పంతులు గారు ఎంత లావాటి సమాధానం చెప్పారురా' అనుకుని ఓ తెగ మురిసిపోతారు. అక్కడి పరిస్థితిని ఆకళింపు చేసుకున్న పండితుడు 'చెప్పినాయన బాగానే ఉన్నాడు, విన్నవాళ్ళు బాగానే ఉన్నారు, మధ్యలో మనకెందుకొచ్చింది బాధ అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోవడమే ఉత్తమమని అనుకుని 'నమస్కారం' అంటాడు. దీనితో ఆ పంతులుకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది, పండితుడు తన ఓటమిని అంగీకరించి వెళ్ళిపోతున్నాడని ఇంకా తన పాండిత్యం ప్రదర్శిద్దామని,
' నమస్కారం లేదు గిమస్కారం లేదు
మా శత్రువులకు తిరస్కారం
నోరెత్తిన బహిష్కారం
ఇక మీరు లేచి పోవుట యశస్కారం ' అంటాడు.
సరే మర్యాదగా వెళ్ళిపోదామంటే ఈయన వెళ్ళనిచ్చేలా లేడు, ఇతనికి బుద్ధి చెప్పాల్సిందే అనుకుని, 'మహానుభావా మీ ముందు నేను పూర్తిగా ఓడిపోయాను, మీ పాండిత్యం ముందు నా ప్రతిభ వెల వెల పోతోంది, మీ దర్శన భాగ్యం తో నా జన్మ తరించింది, ఒకసారి దగ్గరగా వచ్చి మీ ఆశీర్వాదం తీసుకోదలిచా 'నన్నాడు. దానికా బ్రాహ్మడు ఉబ్బితబ్బిబ్బై 'ఓ దానికేముందోయ్, నా అంతటి పాండిత్యం ప్రతీవారికి అబ్బుతుందా, సాధన చేస్తే పైకి వస్తావు ' అని డాంబికాలు పోతాడు. పండితుడు బ్రాహ్మడి దగ్గరగా వెళ్ళి తల నుంచి ఒక వెంట్రుక లాగి, 'ఓ ప్రజలారా, ఈయన సామాన్య వ్యక్తి కాదు, సాక్షాత్ సరస్వతీ పుత్రుడు, ఈయన వెంట్రుక తీసుకుని నేను నా పూజ గదిలో పెట్టుకుని రోజూ పూజ చేసుకుంటాను ' అని అక్కడినుండి చక్కాపోతాడు.
ఇక అక్కడి వెర్రి బాగుల వాళ్ళు మాకంటే మాకని పంతులు దగ్గరకు వచ్చి తలా చేతికందినన్ని వెంట్రుకలు పీకడం మొదలుపెడతారు. పంతులు నొప్పి తో కేకలేస్తుంటే 'ఉండండి పంతులుగోరూ, కాసేపలా మెదలకుండా ఉండండి, కాసిన్ని రోజుల్లో మళ్ళీ మొలిచెయ్యవేంటి, అప్పుడు మళ్ళీ వచ్చి మా బంధువులుకు కొన్ని పట్టుకెళ్ళాలి ' అని తల మీద, చేతుల మీద ఎవరికి దొరికినన్ని వాళ్ళు పీక్కుని ఇళ్ళకు వెళ్ళిపోతారు. 'బాబోయ్ ఈ మూర్ఖులు అన్నంతపని చెయ్యగలరు, ఇక ఇక్కడ ఉండడం క్షేమం కాద 'ని రాత్రికి రాత్రే మూట ముల్లె సర్దుకుని అక్కడినుండి పారిపోతాడు పంతులు.

21, జులై 2010, బుధవారం

చిన్ననాటి కథలు-1

సౌమ్య గారి 'ఏడుచేపల' కథ, మధురవాణి గారి 'మిరపకాయ పొట్టోడీ' కథ నా చిన్ననాటి జ్ఞాపకాలను వెలికితీసాయి.
ఈ కథ పిల్లలకు తప్పక నచ్చుతుంది.చిన్నప్పుడు నాకెంతో నచ్చిన (ఇప్పటికీ ఇష్టం అనుకోండి) కథలలో ఇదొకటి.

అనగనగా ఒక రాజుగారుండేవారు. ఆ రాజుకు ఇద్దరు భార్యలు, పెద్ద భార్యకు ఒక్క వెంట్రుక, చిన్న భార్యకు రెండు వెంట్రుకలు. రాజుగారికి ఈ కారణం చేత చిన్నభార్యంటేనే ఇష్టం, పెద్ద భార్యను చిన్నచూపు చూసేవాడు. చిన్నరాణి ఎలాగోలా పెద్దరాణిని ఊరినుండి పంపించెయ్యాలని చూస్తూ ఉంటుంది. ఒకనాడు చిన్నరాణి అందంగా ముస్తాబయ్యి, తన రెండు వెంట్రుకలతో పేద్ద జడ అల్లుకుని రాజుగారి దగ్గరకు వెళ్ళి పెద్దరాణి మీద పితూరిలు చెప్పి పెద్దరాణిని వెళ్ళగొట్టిస్తుంది.
పాపం పెద్దరాణి ఊరు వదిలి ఏడ్చుకుంటూ వెళ్తూ ఉంటే దారిలో చెట్టుకు కట్టేసిన గుర్రం, దానికి దూరంగా గడ్డిమోపు కనిపిస్తాయి. ఆ గుర్రం 'నాకు ఆకలిగా ఉంది, గడ్డిమోపు చూస్తే నాకు అందకుండా ఉంది. కాస్త ఇటు పక్కకు జరిపితే నీ మేలు మరిచిపోనులే' అని బ్రతిమాలుతుంది. రాణి 'ఓ దానికేం భాగ్యం' అని గడ్డి గుర్రానికి వేసి ముందుకు పోతుంది. అలా వెళ్ళగా వెళ్ళగా ఒక చోట చీమలు దారికి అడ్డంగా బారులు తీరి కనిపిస్తాయి. 'మమ్మల్ని తొక్కకుండా చుట్టూ తిరిగి వెళ్ళిపో, నీకు పుణ్యం ఉంటుంది' అని దీనంగా వేడుకుంటాయి. రాణి అలానే అని చుట్టూ తిరిగి వెళ్తుంది. ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి ఒక చాకలివాడు కనిపిస్తాడు 'ఏవమ్మా కాస్త ఈ చీరలు ఆరవేయటంలో సాయం చేసావంటే నీ పుణ్యం ఊరకే పోదులే' అంటాడు. 'సరే అలాగే' అని రాణి సాయం చేసి వెళ్తుంది. మరి కాస్త దూరం వెళ్ళేసరికి ఒక చెట్టు కింద తపస్సు చేసుకుంటూ ఒక ముని కనిపిస్తాడు. ఆ ముని దగ్గరకు వెళ్ళి రాణి తన కష్టాలను చెప్పుకుని ఏడుస్తుంది. ఆ ముని అప్పుడు జాలిపడి ఒక పండును రాణికి ఇచ్చి దాన్ని తిని పక్కనున్న సరస్సులో మూడు సార్లు మనగమంటాడు. రాణి మునికి దణ్ణం పెట్టుకుని సరస్సులో మూడు మునకలు వేసేసరికి పట్టులాంటి ఒత్తైన జుత్తు వచ్చేస్తుంది. పరమానందంతో మునికి కృతజ్ఞతలు చెప్పుకుని ఊరికి బయలుదేరుతుంది. దారిలో చాకలివాడు కనిపించి రాణికి పట్టువస్త్రాలు ఇస్తాడు. అవి కట్టుకుని ముందుకు వెళ్తూ ఉంటే చీమలు తమకు చేసిన మేలుకు ప్రతిగా తమ పుట్టలో దాచిన నగలను తీసి రాణికి ఇస్తాయి. అవి అలంకరించుకుని ఇంకాస్త ముందుకెళ్ళేసరికి గుర్రం కనపడి 'నిన్ను మీ ఊళ్ళోకి తీసుకెళ్తాను ' అని చెప్పి ఎక్కించుకుంటుంది. ఆ గుర్రం ఎక్కి మంచి నగలతో పట్టు వస్త్రాలతో దేవకన్యలా వెలిగిపోతున్న రాణిని అంతఃపురంలోంచి రాజు చూసి తన తప్పును క్షమించమని చెప్పి, సాదరంగా లోపలికి తీసుకువెళ్తాడు. ఈ సంగతి తెలుసుకున్న చిన్న రాణి, పెద్ద రాణి దగ్గరకు వెళ్ళి ముని సంగతి తెలుసుకుని, తాను కూడా ముని దగ్గరకు బయలుదేరుతుంది.

దారిలో గుర్రం దాణా పెట్టమని అడిగితే 'రాణిని నాకే పని చెప్తావా' అని దాపులనున్న కర్ర పుచ్చుకుని గుర్రానికి నాలుగు వడ్డించి మరీ ముందుకెళ్తుంది. కొంత దూరం వెళ్ళాక చీమలు కనిపించి తమను తొక్కవద్దని అడిగితే 'నా దారికి అడ్డంగా ఉన్నార'ని చీమలను తొక్కుకుంటూ వెళ్ళి సాయమడిగిన చాకలి బట్టల్ని చిందరవందర చేసి మునిని కలుసుకుని దొంగ కన్నీళ్ళతో వేడుకుంటుంది. ముని ఇచ్చిన పండు తిని, మూడు సార్లు మునిగితేనే పెద్ద రాణికి అంత జుత్తు వచ్చింది, ఐదు సార్లు మునిగితే ఇంకెంత వస్తుందో అని అత్యాశతో ఐదు సార్లు మునుగి లేచేసరికి ఉన్న రెండు వెంట్రుకలు కాస్తా ఊడిపోయి బోడిగుండైపోతుంది. ఏడ్చుకుంటూ తిరిగి వస్తున్న రాణిపై కోపంతో బురద పూస్తాడు చాకలి, చీమలు కసి తీర కుట్టి వదిలిపెడతాయి, గుర్రం సుబ్బరంగా కుమ్మి కుమ్మి పంపుతుంది. ఆ అవతారంతో ఊర్లోకి అడుగుపెట్టిన రాణిని చూసి ప్రజలందరూ పిచ్చిది అనుకుని ఊర్లోనుంచి తరిమేస్తారు. కథ కంచికి మనమింటికి.

16, జులై 2010, శుక్రవారం

ఓ బాటసారి నను మరువకోయి

మొదటి టపానే విషాదభరితమైన పాటతో మొదలుపెడుతున్నా..
కాని నేను బ్లాగ్ మొదలుపెట్టడానికి కారణమైన పాట ఇదే కాబట్టి, నేను వేరే పాటతో మొదలుపెట్టి దీనికి అన్యాయం చేయదల్చుకోలేదు..

ఈ పాట బాటసారి సినిమా లోనిది. క్లాస్ సినిమా కావడం మూలాన జనాలకు సరిగా రుచించక ఆ రోజుల్లో బాగా ఆడలేదట. కాని శరత్ బెంగాలీ నవల బడాదీదీ ఆధారంగా తీసిన ఈ సినిమా ఒక అద్భుతం, ప్రతీ పాట ఒక ఆణిముత్యమే.

చిన్నతనంలోనే భర్తను కోల్పోయిన మాధవి పుట్టింట్లోనే తల్లి లేని చెల్లెలు ఆలనా పాలనా చూస్తూ, తండ్రిని, అన్నను కనిపెట్టుకుని ఉంటుంది. సురేంద్ర జమిందారు మనవడు. పుస్తకజ్ఞానమే తప్ప లోకజ్ఞానం బొత్తిగా తెలియని వాడు. లోకజ్ఞానం సంపాదించటానికి స్నేహితుల ప్రోద్బలంతో ఇల్లు విడిచి మద్రాసు చేరుకుంటాడు. అక్కడ మాధవి చెల్లెలికి చదువు చెప్పే పని మీద అతనికి ఆశ్రయం దొరుకుతుంది.
వేళకు తినాలి, నిద్రపోవాలి అని కూడా తెలుసుకోలేని అమాయకుడైన అతని అవసరాలను చూస్తూ అతనికేం కావాలో అది అమర్చుతూ ఉంటుంది మాధవి. ఒకసారి పని మీద మాధవి ఊరు వెళ్ళాల్సి రావడంతో అతని అవసరాలను చూసే దిక్కు లేక తనకక్కడ ఏమీ బాగాలేదని వెంటనే రావలసిందని ఉత్తరం రాయిస్తాడు. అప్పటికే అతని నిర్మలత్వాన్ని, అమాయకత్వాన్ని అభిమానించే మాధవి పరుగున ఇల్లు చేరుకోవడం, పని వాళ్ళ లేని పోని అపోహలకు దారి తీస్తుంది. అవి చెవిన పడడంతో ఆ కోపం సురేన్ మాధవి మీద చూపడం అతను ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి కారణమౌతుంది.

తన మాటలనే కాని మనసును అర్థం చేసుకోలేని సురేన్ వెళ్ళిపోతే మాధవి పడే తపనను సముద్రాల రాఘవాచార్యులు గారు అద్భుతంగా మాటలలో పెడితే భానుమతి గారు అత్యంత హృద్యంగా పాడి ఈ పాటకు జీవం పోసారు. ఏ.ఎం.రాజా గారు సంగీతం అందించిన ఈ సినిమాకు పి.రామకృష్ణ గారు దర్శకత్వం వహించారు.

ఓ బాటసారి నను మరువకోయి
మజిలి ఎటైనా మనుమా సుఖాన

సమాజానికీ దైవానికీ బలియైతి నేను వెలియైతినే
వగే కాని నీపై పగ లేనిదాన
కడ మాటకైనా నే నోచుకోనా

శృతి చేసినావు ఈ మూగ వీణా
సుధా మాధురీ చవి చూపినావు
సదా మాసిపోని స్మృతే నాకు వీడి
మనోవీణ నీవు కొనిపోయెదోయి



ఈ సినిమా పాటలను చిమాటా మ్యూజిక్ ద్వారా వినవచ్చు
http://www.chimatamusic.com/telugu/searchnew.php?st=batasari&sa=Go!

అవకాశం చిక్కితే ఈ సినిమా తప్పక చూడండి. సమాజ కట్టుబాట్లకు, మనసులో రేగే సంఘర్షణకు మధ్య నలిగిపోయే వ్యక్తిగా భానుమతి గారు చక్కగా నటించగా సరిగా చూడనైనా చూడకపోవడం చేత మాధవి పేరునే హృదయంలో ప్రతిష్ఠించుకుని మనసులో ప్రేమకు, కట్టుకున్న భార్యకు న్యాయం చెయ్యలేక నలిగిపోయేవాడిగా నాగేశ్వరరావు గారు జీవించారు

మొదటి టపా

ఇదే నా మొదటి టపా
ఎన్నో రోజులుగా అనుకుంటున్నఆలోచన ఈనాటికి కార్యరూపం దాల్చింది.
నాకు ఇష్టమైన పాటలను, సినిమాలను , నా భావాలను అందరితో పంచుకునే ప్రయత్నమిది.