నిన్నటి 'పాడుతా తీయగా' వీక్షకులకు సరిగ్గా అలాంటి అనుభూతే కలిగి ఉంటుంది.
మన గాన గంధర్వుని కార్యక్రమం లో వెన్నెల కురిసింది, కాదు కాదు సిరివెన్నెల కురిసింది.
ఆరు బయట వెన్నెల్లో కూర్చుని చందమామ కథలు వింటూ, అమ్మ చేతి గోరుముద్దలు తినడం ఎంత హాయో, మన సిరివెన్నెల గారి మాట అంత హాయి, పాట అంత హాయి..
అతిధి లా వచ్చి చిరునవ్వుల, చిరుపాటల సిరివెన్నెలలు కురిపిస్తూ మన సీతారామ శాస్త్రి గారు, ఆయన పాటలలోని ఆణిముత్యాలను పాడి, పాడించి ఆ ఆనంద ధారలలో మనను తడుపుతూ మన ఎస్.పి.బి ప్రేక్షకులను ఆనందసాగరం లో ఓలలాడించారు
"ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం" పాటతో ఎంచగ్గా కార్యక్రమం మొదలయ్యింది..
ఎంతో శ్రావ్యంగా పాడింది గుంటూరు అమ్మాయి ..
ఈ పాట గురించి వ్యాఖ్యానిస్తూ సిరివెన్నెల గారు ఇలా అన్నారు, (సరిగ్గా ఇలానే కాకపోయినా నాకు గుర్తున్నంత వరకు ఇంచుమించుగా..)
"మొన్నామధ్య నా దగ్గరకు ఒక అరడజను మంది ఆడపిల్లలు వచ్చారు, నా అభిమానులు.
మాటల సందర్భంగా ఇలా అన్నాను, 'ఎంత సేపు మీరు సమాన హక్కులు, సమాన హక్కులు అంటారే కాని, మగవాళ్ళతో సమాన స్థాయికి రావలంటే మీరు ఒక పది మెట్లు కిందకు దిగి రావాలి, మీరు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ మాకన్నా ఒక పది మెట్లు పైనే ఉన్నారు..
మగవాళ్ళు చేసిన పనులన్నీ మీరు చేయగలరు, కాని ఒక శిశువుని కని ఒక మహా మనీషి గా తయారు చేసే సామర్ధ్యం మాత్రం మీదే, మాకు లేదు
అందుకే తెలిసి అన్నాడో తెలియక అన్నాడో తెలియదు కాని ఇంగ్లీషు వాడు కూడా కంప్యూటర్ ని మదర్ బోర్ద్ అన్నాడు కాని ఫాదర్ బోర్ద్ అనలేదు.."
మరెన్నో మంచి పాటలతో, ఎస్.పి.బి. సిరివెన్నెలల మాటలతో కార్యక్రమం హుషారుగా సాగింది
కార్యక్రమంలో సిరివెన్నెల కు పది నందులను తెచ్చిన పది ఆణిముత్యాలను మనకు బిట్లుగా వినిపించారు..
అవి
"విధాత తలపున (సిరివెన్నెల)", "తెలవారదేమో స్వామి (శృతిలయలు)", "అందెల రవమిది (స్వర్ణ కమలం)", "సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని (గాయం)", "చిలక ఏ తోడు లేక (శుభలగ్నం)", "మనసు కాస్త కలత పడితే (శ్రీకారం)", "అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని (సింధూరం)", "దేవుడు కరుణిస్తాడని (ప్రేమ కథ)", "జగమంత కుటుంబం నాది (చక్రం)", "ఎంత వరకు ఇంత పరుగు (గమ్యం)"
చివర్లో సంగీత పోటీల పేరుతో పిల్లలని ఏడిపిస్తున్న కార్యక్రమాలకు, చానళ్ళ వారికి చురకలు వేసారు..
"మీ అమ్మాయి జయమాలిని లా ఉంది, సిల్కు స్మిత లా డాన్సు చేసింది" అంటే పొంగిపోతున్న ఈ కాలంలో
ఎక్కడా అసభ్యత కలిగిన పాటలకు తావు ఇవ్వకుండా, ఏడుపులు పెడబొబ్బలు లేకుండా ఎంతో సమర్ధవంతంగా ఈ కార్యక్రమాన్ని నడుపుతున్న బాలు గారిని అభినందించారు.
ఈ కార్యక్రమం ఈ శుక్రవారం సాయంత్రం తిరిగి (ఈ టీ.వీ. లో) ప్రసారమౌతుంది, వీలున్నవాళ్ళు చూడండి.
సిరివెన్నెల తో తరువాయి భాగం వచ్చే సోమవారం 9:30 గంటలకు..
అవునండీ ఆ కార్యక్రమాన్ని నేనూ ఆస్వాదించాను. అశ్లీలానికి తావులేకుండా ఇన్ని సంవత్సరాలనుంచి ఆయన ఇన్ని అద్భుతమైన పాటలు రాయడం అనేది ఆయన గొప్పతనం. నమ్ముతారో లేదో కానీ కొన్ని సంవత్సరాలపాటు 'సిరివెన్నెల' పాటలను రోజూ వినేదాన్ని.
రిప్లయితొలగించండిబాగుందండీ టపా.. ఆమాటకొస్తే అన్ని టపాలూ..
రిప్లయితొలగించండి@తొలకరి గారు, నా బ్లాగును సందర్శించినందుకు నెనర్లు..
రిప్లయితొలగించండినేనూ కాలేజీ లో ఉన్నప్పుడు రోజుల తరబడి శంకరాభరణం పాటలు వినేదాన్ని.
@మురళి గారు, ధన్యవాదాలండి, ఇక్కడకు వచ్చినందుకు, నా టపాలు మీకు నచ్చినందుకు