31, ఆగస్టు 2010, మంగళవారం

మచిలీపట్నం మాయాబజార్ - 1

నేను గత వారం ఒక పెళ్ళి నిమిత్తమై మచిలిపట్నం వెళ్ళాను. ఆ ప్రయాణపు విశేషాలు ఇలా..

ఏవో కొన్ని పుస్తకాలు కొందామని ఎప్పట్నుంచో బెజవాడ వెళ్ళాలనుకుంటున్నా కాని కుదరలేదు. ఇంతలో స్నేహితుడొకడు వచ్చి వాళ్ళ అన్నయ్య పెళ్ళి కుదిరిందని, పెళ్ళి మచిలీపట్నంలోనని, తప్పక రావలసిందని చెప్పాడు. సరే, దెబ్బకు మూడు పిట్టలు. ఈ పెళ్ళి నెపంతో బెజవాడ వెళ్ళి కావలసిన పుస్తకాలు కొనుక్కోవచ్చు, మా నాన్నగారి ఊరైన మచిలీపట్నం చూసే అవకాశం ఇంత వరకు కలగలేదు, అది చూసి రావొచ్చు, పనిలోపని పెళ్ళి పని కూడా చూసుకోవచ్చని చెప్పి నేను మా ఆయన బెజవాడ ప్రయాణమయ్యాం.

పొద్దున్న తొమ్మిదింటికి బెజవాడలో దిగి గవర్నరుపేటలో ఒక మాంచి పెసరట్టు లాగించి, మా ఆయన తాతగారి ఊరైన పామర్రుకు బయల్దేరాం. మేము ఇల్లు చేరేసరికి పన్నెండు కొట్టింది. గబ గబా స్నానాలు కానిచ్చి భోజనాల ముందు కూర్చున్నాం. అన్ని పదార్ధాలతో ఇంటి భోజనం చేసి ఎన్నాళ్ళయిందో! దోసకాయ పప్పు, కాకరకాయ పులుసు బెల్లం పెట్టి కూర, అల్లం పచ్చడి, ముక్కల పులుసు, గారెలు, గడ్డ పెరుగు. ఎప్పుడూ హడావిడిగా ఇంటికి రావడం, ఏదో ఒక కూరో, పప్పో చేసుకుని, ఇంటి నుండి తెచ్చుకున్న ఆవకాయతో భోజనం అయిందనిపించడం..ఇదేగా మనలో చాలా మంది రోజూ చేసే పని. అలాంటిది అన్ని పదార్ధాలు కొసరి కొసరి వడ్డిస్తుంటే పొట్ట చాలు ఇక మోయలేనంటున్నా, మనసు మాత్రం మరి కాస్త లాగించమంటోంది. అమ్మమ్మ చేతికి అడ్డూ, అదుపు లేక, కలిపిన ప్రతీ ముద్దపై ఆవిడ చేతుల్లోంచి నెయ్యి ధారపాతంగా పడుతూ ఉంటే ఆ కమ్మదనానికి తినగలిగిన దాని కంటే మరి కాస్త లోపలికి తోసి అలా చేయి కడుగుతూనే నిద్రా దేవి ఒళ్ళోకి మత్తుగా జారుకున్నాం.

సాయంత్రం నాలుగున్నర ప్రాంతంలో మచిలీపట్నానికి బయల్దేరాం. ఆ రోజు రాత్రే పెళ్ళి. బందరులో ఉన్న చూడదగ్గ ప్రదేశాలన్నీ తిప్పి పెళ్ళి వేదికకు చేర్చేటట్టు ఒక ఇస్పెషల్ ఆటో మాట్లాడుకున్నాం. పామర్రు నుంచీ బందరుకు వెళ్ళే దారంతా పచ్చని పంట పొలాలే! ఎటు చూసినా పచ్చదనమే! పచ్చని పొలాలు, ఆ పొలాల పక్కగా పారే కాలువలు..ఆహా! ఆ దృశ్యం ఎంత మనోహరంగా ఉందో! అందులోనూ పుట్టి బుద్దెరిగిన తర్వాత నేనెప్పుడూ పల్లెలకు వెళ్ళినదాన్ని కాను. ఆ పొలాల మీదుగా వచ్చే పైరగాలి పీలుస్తూ, ఆ పచ్చదనాన్ని కళ్ళతోనే జుర్రుకుంటూ ఉంటే ఎంతైన పల్లెవాసులు భలే అదృష్టవంతులు అనిపించక మానదు. అలా వెళ్తూ మన అన్నగారి ఊరైన నిమ్మకూరు దాటుకుని మచిలీపట్నంలో అడుగుపెట్టాం.

ముందుగా అక్కడి సాయిబాబా గుడి, మున్సిపల్ పార్కు, చిలకలపూడి పాండురంగస్వామి గుడి చూసుకుని తర్వాత పెళ్ళి మండపానికి వెళ్ళాలనేది మా ఆలోచన. అసలు ఈ ప్రయాణంలో విజయనగరం నుండీ అమ్మా నాన్నా కూడా వచ్చి కలవాలి ప్రణాళిక ప్రకారం. కాని అమ్మకు కాస్త ఒంట్లో బాగాలేకపోవడంతో వాళ్ళు విరమించుకున్నారు. లేకపోతే నాన్నా వాళ్ళు అప్పుడున్న ఇల్లు, చదువుకున్న కాలేజి అన్నీ చూద్దాం, అన్నిటికీ మించి వాళ్ళ ఊరి గురించి చెప్తూంటే నాన్న కళ్ళాల్లో మెరుపు చూద్దామని నాకెంతో ఆశ. సరే ముందుగా సాయిబాబా గుడికి వెళ్ళాం. అక్కడ ప్రపంచంలోనే అతి పెద్దదైన సాయి బాబా విగ్రహం ఉంది (54 అడుగుల ఎత్తు). ఆదిశేషుని పడగల నీడలో కాలు మీద కాలు వేసుకుని కూచున్న ఆ విగ్రహం చాలా బాగుంది.




అక్కడి నుంచీ బయలుదేరి మున్సిపల్ పార్కు చేరుకున్నాం. పార్కు చాలా పొందిగ్గా ఉంది, కృష్ణుని విగ్రహం, శివపార్వతుల విగ్రహాలు అక్కడక్కడా ఉన్నాయి. అక్కడ ఉన్న చాలా బల్లల మీద ఎక్కువగా పెద్దవాళ్ళే కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. నాకు లేని కారణం చేతో మరెందువల్లో నాకు చిన్నప్పట్నుంచీ తాతాగార్లంటే చాలా ఇష్టం, అందులోను 'ఆనందో బ్రహ్మ ' లో సోమయాజికి ఉన్న తాత లాంటి తాత నాకు కూడా కావాలని కోరిక. వాళ్ళతో కబుర్లు చెప్పాలని, వాళ్ళ మాటల్లో జ్ఞానాన్ని ఒడిసిపట్టుకోవాలని ఎంతో ఆశ. ఎటు చూసినా తాతగార్లే ఉన్న ఆ పార్కును విడిచి రాబుద్దే కాలేదు.





బయటకొచ్చేసరికి వడిసెల (catapult or sling) అమ్ముతూ ఒక చిన్న పిల్ల కనిపించింది. 'తీసుకో అక్కా, తీసుకో అక్కా' అంటూ వెంటపడింది. మామూలుగా ఐతే దాన్ని ఎలా ఉపయోగించాలో కూడా తెలియని నేను కచ్చితంగా తీసుకోకపోదును కాని 'ఆంటీ ' అని కాక 'అక్కా' అని పిలిచినందుకు మురిసిపోయి కొనేసా. ఇక్కడ బెంగుళూరులో రెలయెన్స్ ఫ్రెష్ కి వెళ్ళిన ప్రతీ సారి అక్కడ పూలు అమ్మే పిల్లలు 'పూలు తీసుకో ఆంటీ' అని అడుగుతూనే ఉంటారు. చక్కగా మాల కట్టి ఉన్న విరజాజులను చూసి మనసు ఎంత లాగినా నన్ను ఆంటీ అని పిలుస్తారు కాబట్టి నేను వాళ్ళ దగ్గర అస్సలు తీసుకోను.

అక్కడినుండి బయలుదేరి పాండురంగస్వామి గుడికెళ్ళాము. నాకు మామూలుగానే కృష్ణుడంటే ఇష్టం, అందులోనూ ఇస్కాన్ వారి పద్దతిలో ఉన్న కృష్ణుడిలా కాక పాండురంగడిలా , రంగనాథునిలా ఉన్న కృష్ణుడు మరీ ఇష్టం. అక్కడి పాండురంగడ్ని చూడ్డానికి నిజంగా రెండు కళ్ళు చాలనే లేదు. అక్కడి పూజారి, మామూలు గుడుల్లో పుజారుల్లా 'అసింట, అసింట ' అనకుండా, నేను కాస్త దూరంగా నిల్చుంటే 'దగ్గరకొచ్చి కాళ్ళకు దణ్ణం పెట్టుకోమ్మా' అని చెప్పారు. అలా దగ్గరకెళ్ళి గులాబి పూలతో అలంకరింపబడ్డ ఆ పాండురంగడి రూపాన్ని కళ్ళలోనే నిలుపుకుందామని అలాగే చూస్తూ ఉండిపోయా. గుడికి వచ్చిన మరొక ఆవిడ నా తన్మయత్వాన్ని చూసి, 'మీది ఈ ఊరు కానట్టుందే! గులాబి పూల అలంకరణతో స్వామి బాగున్నాడు కదా, నిన్న చామంతి పూలతో అలంకరించారు ' అంటూ పలకరించారు. నాకు చిన్న ఊర్లలో నచ్చేది ఇదే. ఎవరికీ మాట్లాడుకోవడానికి 'ఫార్మల్ ఇంట్రడక్షన్ ' అవసరం ఉండదు. చక్కగా నోరు విప్పి, మనసు విప్పి మాట్లాడేస్తారు. మా ఆఫీసు బస్సులో సంవత్సరం నుండీ వెళ్తున్నా నాకు ఒక్కరి పేరు తెలియదు, నేను ఎవర్నీ పలకరించిన పాపాన పోలేదు, నన్ను ఎవరూ పలకరించిన పాపాన పోలేదు.


విశాలమైన స్థలంలో కట్టబడిన ఆ ప్రాంగణంలోనే రాధా దేవి, రుక్మిణీ దేవి, సత్యభామా దేవి, దుర్గా దేవి ఇలా చాలా ఆలయాలు ఉన్నాయి, వెనక ఒక కోనేరు కూడా ఉంది. అసలక్కడ కూర్చుంటే ఎన్ని సాయంత్రాలైన ఇట్టే గడిచిపోతాయనిపించింది.

టపా అనుకున్నదాని కన్నా పెద్దదయిపోయింది. దీన్ని రెండో భాగంలో కొనసాగిస్తానేం?

24, ఆగస్టు 2010, మంగళవారం

రాఖీ పండగ జ్ఞాపకాలు

అన్నాదమ్ములున్న ప్రతి అమ్మాయికి ఇష్టమైన పండగ ఈ రాఖీ పండగ. రాఖీ సందర్భంగా పండగ జ్ఞాపకాలు కొన్ని ఇలా..

ఊహ తెలిసిన తర్వాత జరుపుకున్న మొదటి రాఖీ పండగకు ఎంత బాధపడ్డానో! అన్నయ్యకే అందరూ రాఖీలు కడుతున్నారని. పిన్ని కూతుళ్ళు వాళ్ళూ వచ్చి అన్నయ్యకే కట్టారు. పోని అమ్మ నాకొకటి కొంది అని సంతోషపడితే అదీ తీసుకెళ్ళి అన్నయ్యకే కట్టమంది. 'నాకు ఎవరూ రాఖీ కట్టట్లేదు. అందరికీ అన్నయ్యంటేనే ఇష్టం, నేనంటే ఇష్టం లేదు' అని అమ్మతో చెప్పి ఏడ్చా కూడా. పెద్దౌతున్న కొద్దీ రాఖీ కట్టించుకోవడంలో కంటే కట్టడంలోనే ఎన్నో ఉపయోగాలున్నాయని జ్ఞానోదయమయ్యింది. తర్వాతి పండగకి ఎంతో జాగ్రత్తగా దాచుకున్న రూపాయి పెట్టి రాఖీ కొని అన్నయ్యకు కడితే, అన్నయ్య అర్ధరూపాయి ఇచ్చాడు. నేను ఏడుపు మొహం పెట్టుకుని నాన్న దగ్గరకెళ్ళి 'నాన్నా చూడండి, నేను రూపాయి రాఖి కడితే అన్నయ్య అర్ధ రూపాయి ఇచ్చాడు, ఇంకో అర్ధ రూపాయైనా ఇప్పించండి ' అని నాన్నతో అన్నా. అలా డబ్బులు ఇవ్వమని అడక్కూడదు, అన్నయ్య ప్రేమతో ఎంతిస్తే అంత తీసుకోవాలి అని నాన్నంటే, నాన్నకు కూడా అన్నయ్యంటేనే ఇష్టం అనుకున్నా.

కాలం గిర్రని తిరిగి మళ్ళీ రాఖీ పండగొచ్చింది. సరిగ్గా నాకోసమే అన్నట్టు పండగ సమయానికి మా దొడ్డమ్మ గారబ్బాయి మూర్తన్నయ్య కూడా ఇంట్లోనే ఉన్నాడు. క్రితం సారి రాఖీ కి జరిగిన నష్టం ఈ సారి పూడ్చుకోవాలని షాపుకెళ్ళి రెండు రాఖీలు తెచ్చుకుని, ఎంతైనా సొంతన్నయ్య కదా అని ముందుగా తీసుకెళ్ళి అన్నయ్యకి కట్టేసా. ప్చ్! ఏం లాభం లేదు. ఎప్పటిలాగా అర్ధ రూపాయే ఇచ్చాడు. ఛీ! అన్నయ్యకు కట్టడం వేస్ట్. కట్టకపోయినా నా రూపాయి నాకు మిగిలేది అని విచారపడుతూ మూర్తన్నయ్యకు రాఖీ కట్టడానికెళ్ళా. మూర్తన్నయ్య ఎంత మంచాడో! నేను కడుతూనే రెండు రూపాయల నోటు తీసి ఇచ్చాడు. మొహంలో ఎంత దాద్దామనుకున్నా దాగని సంతోషం. కాని ఠక్కని తీసేసుకుంటే బాగుండదని మొహమాటంగా 'వద్దన్నయ్యా, వద్దు' అని బయటకు అంటున్నానే కాని 'వద్దా సరే' అని తిరిగి జేబులో ఎక్కడ పెట్టేసుకుంటాడో అని లోపల ఒకటే భయం. కాని పాపం అన్నయ్య 'తీసుకోమ్మా తీసుకో' అని బలవంతంగా (?) నా చేతిలో పెట్టేసాడు. ఇక చూసుకోండి నా సంబరం. టట్టడాయ్ అనుకుంటూ నా రెండు రూపాయల నోటు అన్నయ్య ముందు కాసేపు ప్రదర్శనకు పెట్టి, ఆ తర్వాత ఆ నోటు ముందు పెట్టుకుని రంగుల కలలెన్నో కంటూ గడిపేసా.

మరుసటి ఏడాది నుంచీ నా రాఖీల సంఖ్య పెంచేసా. మా ఇంటి ఎదురుగా ఉండే ఇద్దరబ్బాయిలకీ కట్టేసా. అప్పటికి రూపాయి ధర బాగా పడిపోయింది. అన్నయ్య పాపం సంవత్సరం అంతా దాచి దాచి, ఐదు రూపాయలిచ్చాడు కాని ఎదురింటబ్బాయిలు ఇచ్చిన పది రూపాయల ముందు అన్నయ్య ఐదు రూపాయలు తేలిపోయాయి. అప్పటినుండి నా రాఖీల దెబ్బకు వీధిలోని అబ్బాయిలంతా బలైపోయారు. ఇలా పదవతరగతి వరకు నా రాఖీ యాత్ర అప్రతిహతంగా కొనసాగింది. జూనియర్ కాలేజీకి వచ్చాకా, పండగ రోజు రాఖీ కడదామని ఓ ఇరవై రాఖీలేసుకుని కాలేజీకి వెళ్ళానా? ఆ రోజు ఒక్క అబ్బాయి కాలేజీలో కనపడితే ఒట్టు. బొత్తిగా అబ్బాయిలకు క్రీడాస్పూర్తి లేకుండా పోయింది. ఇంజినీరింగ్లో ఉండగా మాకు ఎంతో సాయం చేసిన సీనియర్లకి వాళ్ళ హాస్టల్ కి వెళ్ళి మరీ రాఖీ కట్టాను. ఏంటో! వాళ్ళు ఆ రోజు నుండీ కనపడడం మానేసారు :-(

కొసమెరుపేంటంటే, ఉద్యోగంలో చేరిన కొత్తల్లో రాఖీ పండగ మరో నాలుగు రోజుల్లో ఉందనగా, 'ఏయ్! మంచి మంచి పాత పాటలన్నీ కాపీ చేసి ఒక ఫొల్డర్లో పెట్టి ఉంచు' అన్నాడు, తన అవసరమైనా, పక్క వారి అవసరమైనా గదమాయించడమే కానీ సౌమ్యంగా అడగడం చేతకాని మా బుజ్జన్నయ్య. ఎందుకనడిగితే 'ఎందుకైతే నీకెందుకు, చెప్పింది చెయ్యి, మంచివి ఎక్కించు, అసలే తనకి నీలాగ పాత పాటలంటే పిచ్చి' అని చెప్పి వెళ్ళిపోయాడు. నాకు ఒళ్ళు మండింది. 'నాకోసమంటే ఒక్క చిన్న పని చేసిపెట్టడు, అదే ఎవరికో ఐతే సి.డి. రాసిపెడుతున్నాడు ' అని ఆ ఉడుకుమోత్తనంతో మంచి పాటలు కాకుండా నాకంతగా నచ్చని, బాగాలేని పాటలన్నీ కాపీ చేసి పెట్టేసా. నాకేం తెలుసు ఆ పాటలన్నీ కాపి చేసిన ఎమ్పీత్రీ ప్లేయర్ నాకు రాఖీ రోజు బహుమతిగా ఇస్తాడని!! :-( :-(

15, ఆగస్టు 2010, ఆదివారం

స్వాతంత్రదినోత్సవం - మన బాధ్యత

ఈ రోజు స్వాతంత్ర దినోత్సవానికి ఒక సెలవు దినంగా తప్ప పెద్ద ప్రాముఖ్యత లేకుండా పోయింది, ముఖ్యంగా ఈ కాలం పిల్లలకు. నిజానికి మనం జరుపుకునే పండగలన్నిటిలోనూ అగ్రస్థానం ఆక్రమించగల అర్హత ఉన్న పండగ ఇది. మన ముందు తరానికి తెలిసినంతగా స్వాతంత్రం విలువ, స్వాతంత్రదినోత్సవం గొప్పదనం ఈ తరానికి తెలియదేమో!

ఆగస్టు పదిహేను అనంగానే నాకు మా అత్తే గుర్తుకువస్తుంది. మా అత్త జీవితంలో మూడే పండగలు. అవి ప్రాధాన్యక్రమంలో
1. స్వాతంత్ర దినోత్సవం
2. గాంధీ జయంతి
3. రమణ మహర్షి పుట్టినరోజు

స్కూల్లో జండా వందనం కాగానే అత్త దగ్గరకు పరిగెత్తేవాళ్ళం, రోజు అత్త చేసే మిఠాయిలు తినడానికి. అప్పట్లోచొక్కాలకు పెట్టుకునేందుకు చిన్న పరిమాణంలో గుడ్డతో చేసిన జెండాలు అమ్మేవారు. ఇప్పుడు కూడా అలాంటివి అమ్ముతున్నారనుకుంటా. మేము అత్త దగ్గరకు వెళ్ళంగానే మా చొక్కాలకు జండాలు ఉన్నాయో లేవో చూసి లేకపోతేకొనుక్కురమ్మని డబ్బిచ్చి పంపేది. జండా పెట్టుకుని వచ్చేదాకా వేరే మాట మాట్లాడనిచ్చేది కాదు. తర్వాత స్వాతంత్రంఅంటే ఏంటో, అది సాధించడానికి మన వాళ్ళు పడ్డ కష్టలేంటో వివరించి చెప్పి, మేము శ్రద్దగా విన్నామో లేదో ప్రశ్నలేసినిర్ధారించుకుని మరీ మిఠాయి పెట్టేది. ఆవిడకు గాంధి గారంటే ఎంత అభిమానమో! 'గాంధీ గారు చనిపోయిన రోజురేడియోలో ఆయన మరణవార్త విని ఎవరో ఇంట్లో వాళ్ళు పోయినంతగా మేమంతా ఎంత బాధపడ్డామో, రోజు ఇంట్లోపొయ్యే వెలిగించలేదు, ఇంట్లో అన్నమాటేంటి, దేశంలోనే ఎవరూ వెలిగించి ఉండరు ' అని గద్గద స్వరంతో ఆవిడ చెప్తుంటేనరనరాల్లోకి దేశభక్తిని ఇంజెక్ట్ చేసినట్టే ఉండేది.

'ఏం చేసినా చెయ్యకపోయినా రోజు జండా వందనానికి హాజరయ్యి స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుని,జనగణమణ పాడుకోవడం మన కనీస విధి, అంటే నానా అడ్డమైన పనులూ చేసేసి జనగణమణ పాడెయ్యమని కాదు,మంచిగా ఉంటూ మనకు వీలైనంతలో పక్కవాడికి సాయం చేస్తూనే మనమిలా స్వతంత్రంగా ఉండడానికి అవకాశం కల్పించిన మహానుభావుల గురించి తల్చుకోవాలి ' అని చెప్పేది.

ఇప్పటి పిల్లలకు బాల గంగాధర్ తిలక్ ఎవరో తెలియదు, లాలా లజపతి రాయ్ ఎవరో తెలియదు, అదే రాం చరణ్ తేజ గురించో, అరుంధతి సినిమా గురించో అడిగితే ఠక్కున చెప్తారు. ఇది మనం నిజంగా సిగ్గుతో తలవంచుకోవాల్సిన విషయం. తల్లిదండ్రులందరూ ఈ విషయంలో బాధ్యత తీసుకుని పిల్లలకు మన స్వాతంత్ర సమరయోధుల గురించి చిన్న చిన్న ఉదాహరణలతో చెప్పి వాళ్ళ మనసుల్లో నాటుకుంటునేలా చెయ్యాలి. తద్వారా వాళ్ళను తలుచుకున్నవారౌతాము, అలాగే మన పిల్లల వ్యక్తిత్వ నిర్మాణంలో కూడా అది తోడ్పడుతుంది.

లాల్ బహుదూర్ శాస్త్రి గారు రైల్వే మంత్రి గా పని చేసే రోజుల్లో తమిళనాడు లో ఎక్కడో రైలు ప్రమాదం జరిగితే దానికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసారు. అది ఆయనకు వృత్తి పట్ల ఉన్న బాధ్యత. ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయి పటేల్ గారు కోర్టులో కేసు వాదిస్తూ ఉండగా భార్య చనిపోయిందని టెలిగ్రాం వస్తే చదువుకుని జేబులో పెట్టుకుని వాదన పూర్తి చేసారు. అది ఆయనకు వృత్తి పట్ల ఉన్న నిబద్దత, అది ఆయన గుండె నిబ్బరం. అందుకే ఆయన ఉక్కు మనిషి అయ్యారు. మన ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు ధైర్యముంటే తుపాకి పేల్చమని తెల్లవారికి గుండె చూపించారు. అది ఆయన ధైర్యం. ఇలా ఎన్నో స్పూర్తిదాయకమైన సంఘటనలున్నాయి మన దేశభక్తుల జీవితాల్లో. ఇవి మనందరికీ తెల్సిన విషయాలే. కాస్త శ్రద్ద చూపించి పిల్లలకు స్పూర్తి కలిగించేలా ఆ మహనీయుల జీవితాల్లోంచి విశెషాలు చెప్పే బాధ్యత సంతోషంగా తీసుకుందాం.

జైహింద్!

స్వాతంత్రదినోత్సవ శుభాకాంక్షలు

చిన్నప్పుడు మనమంతా పాడుకున్న ఈ పాట అంతర్జాలంలో ఎక్కడ వెతికినా దొరకలేదు. బ్లాగ్మిత్రులందరికీ స్వాతంత్రదినోత్సవ శుభాకాంక్షలు

కాకమ్మా చిలకమ్మా కథలే మాకొద్దు
మా గాంధి చెప్పిందే మాకెంతో ముద్దు

నెహ్రూజీ ఏమన్నారు?
శాంతి శాంతి అన్నారు
నేతాజీ ఏమన్నారు?
జైహింద్ జైహింద్ అన్నారు
లాల్ బహుద్దుర్ వీర బహుద్దుర్ ఏమని అన్నారు?
జై జవాన్ జై కిసాన్ అన్నారు, పదమన్నారు

లల్లలల్లలా లల్లలల్లలా లల్లలల్లలల్లలల్లలా

పిల్లలకే ఇక రాజ్యం ఇస్తే
ఎల్లలు కల్లలు చెరిపేస్తాం
అల్లరి మూకల ఆటలు కట్టి
తెల్లని పావురమెగరేస్తాం
సింహానికీ జింక పిల్లకు
స్నేహం కలిపి మెప్పిస్తాం

లల్లలల్లలా లల్లలల్లలా లల్లలల్లలల్లలల్లలా

10, ఆగస్టు 2010, మంగళవారం

కిరాణా/బడ్డీ కొట్టు - చిరుతిండి మహోత్సవం

కిరాణా కొట్టు మీద రాసేది ఏముంటుందనుకుంటున్నారా? అబ్బో! చాలానే ఉంటుందండీ! ఇప్పుడైతే సూపర్ మార్కెట్లు, హైపర్ మార్కెట్లు రాజ్యమేలుతున్నాయి కాని చిన్నతనంలో వీధిలో ఉండే బడ్డీ కొట్టే మెగా స్టోరు, సూపర్ స్టోరూను. వైశాల్యంలో కాని, ఆకర్షణలో కాని మరెందులోనూ సూపర్ మార్కెట్లతో పోటి పడలేని చిన్న కిరాణా కొట్లలో దొరకని వస్తువే ఉండదు. ఏమడిగినా ఏదో ఒక మూల నుంచి ఇట్టే తీసివ్వడం చూస్తే అది కిరాణా కొట్టా కల్పవృక్షమా అని సందేహం కలగకమానదు.

చిన్నప్పుడు ఏ చింతపండో, బంగాళా దుంపలో తేవడానికి అమ్మ వీధి చివర కిరాణాకొట్టుకు పంపడంతో మొదలయ్యింది కిరాణాకొట్ల మీద నాకు ప్రేమ. ఎక్కడికెళ్ళినా జంటకవుల్లా అన్నయ్యా నేను కలిసే వెళ్ళే వాళ్ళం. కొట్లో సరుకులు కొన్న ప్రతీ సారీ ఏదో ఒకటి 'కొసరు ' అడిగి తీసుకోవడం మా ఆనవాయితీ. అది బెల్లం ముక్కో, పటిక బెల్లమో, బోడిశెనగ పప్పో ఏదైనా కావొచ్చు. అవి ఇంట్లో దొరకవని కాదు కొట్లో అడిగి సాధిస్తే అదో సంబరం.

ఇంకాస్త పెద్దయ్యేసరికి మేము అప్పట్లో ఉండే ఇంటికి నాలుగంగల దూరంలో రెండు బడ్డీ కొట్లు ఉండేవి. నా స్నేహితుని నాన్న గారు అక్కడుండే జంట కొట్లలో ఒకదాని యజమాని. మేము ఆ అబ్బాయిని చూసి ఎంతగా కుళ్ళుకునేవాళ్ళమో! ఎంచగ్గా తనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళ నాన్ననడిగి చాక్లేటో బిస్కట్టో గుటుక్కుమనిపించచ్చు. ఒక్కోసారి ఆయన ఆ అబ్బాయిని కొట్లో కూర్చోపెట్టి భోజనానికి వెళ్ళేవారు. ఆహా! అప్పుడైతే మాకు వాడి స్థానంలో పరకాయ ప్రవేశం చేయగలిగితే ఎంత బాగుణ్ణో అనిపించేది. పెద్దయ్యాక ఎలా అయినా ఒక బడ్డీ కొట్టుకి యజమాని కావడమే నా జీవితాశయమని అప్పుడే గట్టిగా నిర్ణయించేసుకున్నా.

ఆ జంట కొట్లలో రెండో దానిలో ఐతే మరీనూ మనకు కావలసిన, నోరూరించే సామాన్లు చాలానే ఉండేవి. నిమ్మ తొనలు,నాన్ కతాలు,కప్పు కేకులు, రెండు వైపులా జాము రాసి పెట్టి అమ్మే బన్నులు, చేగోడీలు ఇలా ఎన్నెన్నో! ఎప్పుడైనా నాన్నతో కొట్టుకు వెళ్ళినప్పుడు ఏదైనా కొనమంటే కొనేవారు కాని ఇవన్నీ మాయాబజార్ లో ఘటోత్కచుడిలా ముందేసుకుని ఒకదాని తర్వాత ఒకటి తినగలిగితే ఎంత బాగుంటుందో కదా అనిపించేది. మంచి ముహూర్తం చూసుకుని ఈ మహత్తరమైన ఆలోచనను అమలులో పెడదామని అన్నయ్యకు చెప్తే ఆ ఊహకే లాలాజలం ఊరి ఆ ప్రాజెక్టులో పాల్గొనడానికి సరేనన్నాడు.

సరే ఇద్దరే ఐతే ఈ బృహత్తర కార్యక్రమానికి నిధులు సేకరించడం కష్టం కనుక మా పక్కింటి శ్రీలతను కూడా జట్టులో కలుపుకున్నాం. ఇలాంటి చిరుతిండి మహోత్సవంలో ఇంకొకరికి భాగం పంచడం అర్ధ సింహాసనం పంచడమంతటి త్యాగమే ఐనా ఉత్సవం జరపడానికి కావలసిన ముడిసరుకు లత నుంచి వచ్చే అవకాశమే ఎక్కువ (ఎందుకంటే లతకు బామ్మ ఉంది, మాకు లేదు) కనుక తప్పలేదు. ఇహ మొదలయ్యింది మా డబ్బు సంపాదన పర్వం. లత వాళ్ళ బామ్మ దగ్గరకెళ్ళి దెబ్బ తగిలిందనో, అమ్మ కొట్టిందనో కొళాయి విప్పితే ట్రిప్పుకొక పావలా నుంచి అర్ధ వరకు రాలేవి. అమ్మ సామాన్లకని కొట్టుకు పంపితే అక్కడ కొద్దిగా చిల్లర మిగిలితే, అమ్మ మంచి మూడ్లో ఉంటే, ఆ చిల్లర మా జేబుల్లో చేరేది. ఇంక నాన్న హుషారుగా ఉన్నప్పుడు యూనిట్ టెస్టు మార్కులు చూపించి ఒక అర్ధ రూపాయి దాకా రాబట్టేవాళ్ళం. ఈ తరహా సంపాదన మటుకు నాకొక్కదానికే. అన్నయ్య మార్కులు చూపితే తన్నులే తప్ప డబ్బులు రాలే ప్రసక్తే లేదు. ఇలా ఒక రెండు నెలలు పైగా కష్టపడి పైసా పైసా దాచి ఒక పది రూపాయల దాక కూడబెట్టినట్టు గుర్తు.

ఇంక కూడపెట్టినది చాలని చిరు తిండి మహోత్సవం జరపడానికి సిద్దమయిపోయాము. ఒక ఆదివారం సాయంత్రం ముగ్గురం బయల్దేరి కొట్టుకి వెళ్ళి నాన్ కతాలు , నిమ్మ తొనలు, 15 పై చాక్లెట్లు, కేకులు, సందు చివర బండీ వాడి దగ్గర రెండు రూపాయల పకోడీలు తీసుకున్నాం. గోళీ సోడా అని ముందుగా అనుకున్నా బడ్జెట్ అనుమతించడంతో ఒక చెంబు తీసుకెళ్ళి రెండు రూపాయల ద్రాక్ష షర్బత్ తెచ్చుకున్నాం. ఇవన్నీ లత వాళ్ళ పెరట్లోకి తీసుకెళ్ళి అన్నీ ముందు పెట్టుకుని 'వివాహ భోజనంబు ఇంపైన వంటకంబు..' అని పాడుకుంటూ తింటూంటే కదా స్వర్గానికి ఒక మెట్టు దూరానికి వెళ్ళిపోయామంటే నమ్మండి.



4, ఆగస్టు 2010, బుధవారం

మామిడి తాండ్ర - భీషణ ప్రతిజ్ఞ

ఆ వేసవి మధ్యాహ్నం నేను, మా అన్నయ్య డాబా మెట్ల మీద కూర్చుని ఉన్నాం. మా ఎదురుంగా నోరూరించే నూజివీడు రసాలు నాలుగు. మా ఇద్దరి మొహాలు ఎర్రగా ఉన్నాయి. అవి పగతో ప్రతీకారంతో రగిలిపోతున్న మా మనస్సులను ప్రతిబింబిస్తున్నాయి. దానికి కారణం క్రితం రోజు సాయంత్రం డాబా మీద మాకు జరిగిన అవమానమే..
ఓ పద్దెనిమిది గంటలు వెనక్కి వెళ్తే..


సెలవులకని మా పక్కింటి బుజ్జి గాడింటికి వాళ్ళ బాబాయి వాళ్ళు ఏల రావలె?
వచ్చితిరిపో ఉత్త చేతులతో రాక మామిడి తాండ్రను ఏల తేవలె?
తెచ్చితిరిపో వాడు డాబా పైకి వచ్చి మేము చూస్తుండగా, మాకు పెట్టకుండా ఏల తినవలె?
తినెనుపో మమ్మల్ని చూసి ఊరూరుట్ట అని ఏల అనవలె?


అహో ఇది భరించలేని అవమానం, అది తట్టుకోలేని మా చిన్ని హృదయాలు ఏ నిముషంలో ఐనా బద్దలయ్యే అగ్ని పర్వతాల్లా కుతకుతమంటున్నాయి..అప్పుడే ప్రతిజ్ఞ చేసుకున్నాము..ఎలా ఐనా మామిడి తాండ్రను తయారు చేసి, బుజ్జి గాడి తాండ్ర అయిపోయే దాకా ఆగి, అప్పుడు మా తాండ్రను తీసి వాడ్ని ఊరిస్తూ తినాలని..

ఆ రోజు రాత్రి నూటముప్పయ్యోసారి నాన్నగారికి మరుసటిరోజు పొద్దున్న మామిడిపండ్లు తేవాలని గుర్తు చేసి పడుకున్నాం. ఆ రాత్రంతా తాండ్రను గురించిన కలలే!! మేము కష్టపడి చేసిన తాండ్రను బుజ్జిగాడు దొంగతనంగా తినేసినట్టు నాకు కల వస్తే, వాడి తాండ్రను మేము దొంగలించి తెచ్చినట్టు అన్నయ్యకు కల వచ్చింది. పొద్దున్న కోడి కూయక ముందే నిద్ర లేచి నాన్నగారిని లేపి అప్పటికి బజారు తెరవరని ఆయన చెబుతున్నా వినకుండా సంచీ చేతికిచ్చి ఆయన్ను పంపించి, నాన్నారు కోసం ఎదురు చూస్తూ వీధి గుమ్మానికి చెరో వైపు కూర్చున్నాం.

మనం ఎదురు చూస్తున్నప్పుడే కాలం పగబట్టిన దానిలా మరింత మెల్లిగా సాగుతుంది. అప్పటికీ అన్నయ్య లోపలికి వెళ్ళి మా గడియారంలో చిన్న ముల్లును రెండంకెలు ముందుకు జరిపాడు కూడా. అయిన ఫలితం లేకపోయింది. మా సుదీర్ఘ నిరీక్షణ తర్వాత నాన్న గారు రెండు సంచులతో వీధిలోకి అడుగుపెట్టారు.. మేము పరిగేట్టుకుని వెళ్ళి ఆయన్ను అక్కడే ఆపి, సంచీలు దించి, మాకు కావలసినవి అందులో ఉన్నాయని రూఢి చేసుకున్నాక ఇంటికి రానిచ్చాం. ఇంటికి రాగానే పండ్ల మీదకు పడబోయేసరికి అమ్మ ఆపి, భోజనం చేసాకే ఏదైనా అని, మా ఉత్సాహానికి బ్రేకులు వేసింది. పైకి తన్నుకొస్తున్న కోపంతో కూడిన కన్నీళ్ళను లోపలికి నెట్టి, పండ్లకేసి ఆశగా చూస్తూ, వంట ఎప్పుడౌతుందా అని చకోర పక్షుల్లా ఎదురు చూస్తూ కూర్చున్నాం. వంట అయీ అవ్వడంతోనే కంచాలు తెచ్చేసుకుని అమ్మ ఏది పెడితే అది గబగబా తినేసి ఒలంపిక్స్ లో గెలుచుకున్న బంగారు పతకం పట్టుకున్నంత అపురూపంగా మామిడి పండ్లను పట్టుకుని మెట్ల మీదకు చేరాము..

అవే ఇప్పుడు మా కళ్ళ ముందున్నాయి. ఆ రసాలను చూస్తూనే అమాంతంగా నోట్లో వేసుకుని గుటుక్కుమనిపించాలని బలంగా అనిపిస్తున్నా మా ప్రతిజ్ఞను ఒకరికి ఒకరం గుర్తు చేసుకుంటూ బలవంతం మీద నిగ్రహించుకున్నాం. మామిడి పండ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా కావలసినవి ఏంటి? అవి దొరికాక తాండ్రను ఎలా చేయాలి..అవి మా ముందున్న ప్రశ్నలు..కాని మా అన్నయ్య ఉన్నాడే!! తనకు తెలియంది లేదు (అని అనుకునేదాన్ని అప్పట్లో). ఏది చెప్పినా అది నిజం, అదే నిజం, అది మాత్రమే నిజం అనుకునేలా చెప్తాడు. అప్పట్లో వచ్చే బూస్ట్ ఏడ్ చూపించి సునీల్ గవాస్కర్ కొడుకు సచిన్ టెండుల్కర్ అని చెప్పాడు. అదే నిజమని చాలా కాలం నమ్మాను కూడా. అది పక్కన పెడితే కర్తవ్యం తెలియక కంగారు పడుతున్న నా భుజం మీద చెయ్యి వేసి, 'పిచ్చిదానా ఎంటీవోడంతటి అన్నయ్య నీకుండగా నీకేల బెంగ ' అన్నట్లు ఒక నవ్వు నవ్వి, 'నాకు తాండ్ర ఎలా చేయాలో తెల్సు. ఏముంది ముందు మామిడి పండ్ల రసం తీసి, దాన్లో ఒక కేజీ ఓ పది కేజీలో పంచదార పోసి మిక్సీలో పావుగంట తిప్పి కంచంలో ఆరబోసి ఎండలో నాలుగు రోజులు పెడితే నోట్లో వెన్నలా కరిగిపోయే తాండ్ర రెడీ' అని నాకు ధైర్యం చెప్పాడు.

మరుసటి రోజు అమ్మానాన్న ఆఫీసుకు వెళ్ళేదాక గోతి కాడ నక్కల్లా ఎదురుచూసి, వాళ్ళు వెళ్ళడమేమిటి మా ప్రయోగం మొదలుపెట్టాం. మిక్సీ చేసాక పళ్ళెంలో ఆ రసాన్ని పోసి, దాని వైపు ఆశగా చూస్తూ 'మామిడి వంటి పండుయు..' అని అశువుగా కవిత్వం చెప్పబోతూంటే 'తాండ్ర వంటి స్వీటుయు..' అని అన్నయ్య అందుకున్నాడు. ఆ పళ్ళాన్ని మేడ మీద ఎండబెట్టి దాన్నే చూస్తూ కూర్చున్నాం. మాలో ఏ ఒక్కరు మంచి నీళ్ళ కోసమో, మరో దాని కోసమో కిందకు దిగినా తక్కిన వాళ్ళు వెంట వెళ్ళాల్సిందే, ఈలోగా ఇంకొకరు ఎక్కడ దాన్ని గుటకాయం స్వాహః చేస్తారేమో అన్న భయంతో. రాత్రుళ్ళు మాకు మాత్రమే తెలిసిన రహస్య ప్రదేశాల్లో దాస్తూ, పొద్దున్న రెప్ప వేయకుండా కాపలాలు కాస్తూ నాలుగు రోజులు గడిపాం. నాలుగో రోజు 'ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి..' అని పాడుకుంటూ మా స్వహస్తాలతో చేసుకున్న ఆ అమృతాన్ని మా మధ్యలో ఉంచుకుని ఒకొక్క ముక్క నోట్లో వేసుకున్నాం. వెంటనే ఒకరి మొహంలోకి ఒకరం చూసుకున్నాం, మా మొహాల్లో రంగులు మారాయి. కాజాలో మాగాయి ముక్క పెట్టుకుని దాన్ని సాస్ లో ముంచుకుని తింటే ఎలా ఉంటుందో దాని కన్నా అధ్వానంగా ఉంది మా వంటకం. ఎంతైనా మేము చేసుకున్నది కదా, పారెయ్యడానికి చేతులు రాక మరో రెండు ముక్కలు నోట్లో వేసుకోవడానికి ప్రయత్నించాం. ఊహు! వల్ల కాలేదు. గుడ్ల నీరు కక్కుకుంటూ మా అమృతాన్ని, మా పంచదార గుళికను, మా వజ్రాల తునకను కాలువలో జారవిడిచాం. ఆ తర్వాత కరువు తీరా ఏడ్చి, అమ్మ రాకముందే మొహాలు కడుకున్ని కూర్చున్నాం. ఆ రాత్రి ఒకటే వాంతులు. 'ఏం తిన్నార్రా' అని అమ్మ అడిగితే నోరు మెదిపితేనా. ఎలా చెప్తాం! తేలు కుట్టిన దొంగలం కదా!!

1, ఆగస్టు 2010, ఆదివారం

స్నేహానికి చిరునామా

మొదటిసారి మేము కలిసింది మా ఇంట్లో. రాష్ట్రానికి దూరంగా ఉన్న ఒక ఇంజినీరింగ్ కాలేజిలో మా ఇద్దరికీ ప్రవేశం వచ్చిందని తెలిసి పరిచయం చేసుకుందామని తను, వాళ్ళ అమ్మగారు ఒక ఆదివారం ఉదయాన్నే మా ఇంటికి వచ్చారు. అప్పుడు మేము పెద్దగా మాట్లాడింది లేదు, ఊరకే పది నిముషాలు కూర్చుని వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత కలిసి ప్రయాణం చేసి కాలేజి ఉండే ఊరు చేరుకున్నాం. ప్రయాణంలో నేను మాట్లాడదామని ప్రయత్నించినా తను అప్పర్ బెర్త్ నుంచీ కిందకు దిగితేనా! అప్పటికీ మంచి చేసుకుందామని నా హనీఫేబ్ చాక్లేటు ఒకటి ఇచ్చా కూడా.

మా ఇద్దరితో పాటు మా తల్లిదండ్రులు కూడా మమ్మల్ని దిగపెట్టడానికి వచ్చారు. నాకు అదే మొదటిసారి అమ్మానాన్నలను విడిచి దూరప్రాంతంలో ఉండాల్సిరావడం. తనకూ దాదాపుగా అంతే. వాళ్ళు ఇంకాసేపట్లో బయల్దేరుతారనగా, లేడీస్ హాస్టల్ ముందు వేసిన కుర్చీలలో కూర్చుని వీడుకోలు చెబుతున్నాం. అంతకుముందు రోజు అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. 'ఎప్పుడూ ఏడవని నాన్న నిన్ను వదిలివెళుతున్నామని నిన్న వెక్కి వెక్కి ఏడ్చారు, నువ్వు ఏ మాత్రం బెంగ పడుతున్నావని తెలిసినా తట్టుకోలేరు, నువ్వు ధైర్యంగా మాకు వీడ్కోలు చెప్పాలి '. కాని మరో ఆరు నెలల దాకా వారిని చూసేది లేదు అని అనుకున్న ప్రతి సారి దుఃఖం తన్నుకుని కన్నీళ్ళ రూపంలో వచ్చేస్తోంది. కళ్ళల్లోకి వచ్చిన నీరు కిందకు జారకుండా ఆపడానికి నా శక్తంతా కూడదీసుకోవలసి వచ్చింది. అమ్మా వాళ్ళు బయలుదేరడంతో ఇద్దరం ధారగా కారుతున్న కన్నీటిని తుడిచే ప్రయత్నమైనా చేయకుండా హాస్టల్ లోకి పరిగెత్తాం. ఇద్దరివీ పక్క పక్క గదులే. నేను గదిలోకి వెళ్ళి కరువు తీరా ఏడ్చాను. ఎంత ఆలోచించకూడదనుకున్నా ఇక అమ్మానాన్నలను చూసేది ఆరునెలలకొకసారి మాత్రమే, చదువు అవ్వంగానే ఉద్యోగం, తర్వాత పెళ్ళి , ఇంక వాళ్ళ దగ్గరుండే అదృష్టం, అవకాశం ఉండవు అన్న సత్యం మరీ మరీ ఏడిపిస్తోంది. ఇంతలో నా గది తలుపు ఎవరో తట్టినట్టుంటే కళ్ళు తుడుచుకుని వెళ్ళి తీసా. తనే! లోపలికి వచ్చింది మాట్లాడకుండా. తన మొహం చూసా. అసలే తెల్లని మొహమేమో ఏడ్చి ఏడ్చి కళ్ళు ఉబ్బిపోయి, మొహం కందిపోయింది. నా మటుకు నేనే బాధలో ఉన్నా తనను చూసి జాలేసింది. ఏవో సామాన్లు కొనడానికి కలిసి బయటకు వెళ్ళాం.

తర్వాత ఎవరికి ఉత్తరం వచ్చినా పక్కవారికి చూపించి, ఉత్తరాల్లో ఆ అక్షరాలు తడిమి అమ్మానాన్నలను చూసినట్టు ఆనందపడేవాళ్ళం. రోజులు గడుస్తున్న కొద్దీ మాకు తెలియకుండానే మా బంధం దృఢపడింది. మాకు ఇంకొంతమంది స్నేహితులయ్యారు. మొత్తం పదిమందిమి కలిసికట్టుగా ఒకరి కష్టసుఖాలను మిగిలిన వాళ్ళు పంచుకుంటూ ఉండేవాళ్ళం. ఎంతమందిలో ఉన్నా పక్కన తనుందంటే అదో ధీమా, ధైర్యం. ఫలానా పరిస్థితిలో నేనేలా స్పందిస్తాను, ఎలా ఆలోచిస్తాను, ఏం నిర్ణయం తీసుకుంటాను అనేది తనకు, అలాగే తన విషయంలో నాకు ఇట్టే తెలిసిపోయేది. బహిఃప్రాణం అంటారు చూడండీ, అచ్చంగా నాకు తను అదే. బాధలో ఉన్నప్పుడు ఒకరినొకరం ఓదార్చుకోవడానికి మాకు మాటలక్కర్లేదు, ఒకరి సామీప్యమొకరికుంటే చాలు. దగ్గరకొచ్చి ఒక పావుగంట కూర్చుంటే చాలు ఎంతో ఉపశమనం పొందినట్టుగా ఉండేది. దయ్యం సినిమా చూసిన ప్రతీ రాత్రి నా పడక తన గదిలోనే. నిద్రపోకుండా గంటల తరబడి జీవితం గురించి, భవిష్యత్ గురించి, ఏదో ఓదాని గురించి మాట్లాడుకునేవాళ్ళం. అలా ఎన్నో మధురమైన జ్ఞాపకాలతో ఆడుతూ పాడుతూ మా చదువు పూర్తి చేసాం.

అదృష్టవశాత్తు ఇద్దరికీ ఒకే కంపెనీలో ఉద్యోగం. ఎంతో సంతోషించాం కాని తర్వాత తెలిసిందేమిటంటే వేరే వేరే ప్రదేశాలలో పోస్టింగ్. నాకు బెంగుళూరు, తనకు హైదరాబాద్. ఏముందిలే ఫోన్లు చేసుకుంటూ, ఉత్తరాలు రాసుకుంటూ ఉండలేమా అనుకున్నా..కాని కొన్ని రోజుల్లోనే నాకు తన లోటు బాగా తెలిసొచ్చింది. ఏ పుస్తకం చూసినా, ఏ సినిమా చూసినా, ఏ పని చేసినా తనతో చర్చించనిదే స్థిమితం ఉండేది కాదు, ఏ పనిలోనూ ఆనందం లేదు. నా పై అధికారులకు అర్జీలు పెట్టుకుని, దేవుడికి మొక్కులు మొక్కుకుని ఎలాగైతేనేం, హైదరాబాద్ కు బదిలీ సంపాదించా. ఇకనే ఇద్దరం మహోత్సాహం తో ఇళ్ళ వేట మొదలుపెట్టాం. మెహదీపట్నంలో ఒక మాంచి ఇల్లు దొరికింది, ఒక గది : అదే హాలు, అదే పడక గది, అదే వంట గది, అటాచ్డ్ బాత్. ఇంకేం కావాలి? మనసులు విశాలమై ఉన్నప్పుడు ఇరుకు గదులు కూడా అందంగా కనిపిస్తాయి. మళ్ళీ జీవితంలో హ్యాపీ డేస్ మొదలు. పొద్దున్న లేవడం, ఇష్టమైతే వండుకోవడం, లేదంటే ఆఫీస్ లో తినడం, సాయంత్రం వచ్చి ఇద్దరికీ నచ్చిన పాత సినిమాలను చూస్తూ కూర్చోవడం. వారాంతాల సంగతి చెప్పనే అక్కర్లేదు. మా స్నేహం మొదలైన దగ్గరనుంచీ మాకు భేదాభిప్రాయాలే రాలేదంటే నమ్మండి.

కాని సవాళ్ళు ఎదుర్కున్నప్పుడే మనిషైనా, బంధమైనా దృడమయ్యేది. మా స్నేహానికి మొదటి పరీక్ష ఎదురయ్యింది. తనకు పెళ్ళి కుదిరింది. ఇంకో సంతోషకరమైన వార్త ఏమిటంటే తను చేసుకోబోయేది స్వయానా మా చిన్నాన్నగారబ్బాయినే. నా ఆనందానికి అవధులు లేకపోయాయి. కాని ఆ సంతోషం అట్టే కాలం అలాగే నిలవలేదు. అప్పటి దాకా తన సమయమంతా నాది, నా చెవి తినే హక్కు తనది. ఇప్పుడు నాకివ్వడానికి తన దగ్గర టైమే లేకపోయింది. పొద్దున్న లేవడమే ఫోన్ కాల్ తో, అప్పుడు పట్టుకున్న ఫోన్ ఎప్పుడు వదిలేదీ నాకు తెలిసేదే కాదు. ఎందుకంటే నేను పడుకునే సమయానికి ఇంకా తను మాట్లాడుతూనే ఉండేది.

నాకు ఎక్కడ లేని కోపం వచ్చేది. అన్నయ్య మీద అసూయ, ఆగ్రహం కలిగేవి. తనతో రోజుల తరబడి మాట్లాడేదాన్ని కాదు. పాపం ఇద్దరి మధ్య తను నలిగిపోయేది. తన బాధ నాకు వివరించడానికి ప్రయత్నించేది, నేను వింటేగా! ఎందుకంత సేపు మాట్లాడాలి నాకు అర్ధమయ్యేది కాదు. నేనేక్కువా అన్నయ్యెక్కువా అని అడిగేదాన్ని. అప్పటి నా మూర్ఖత్వం తలుచుకుంటే ఇప్పుడు నవ్వొస్తోంది. అలా నేను తనను చాలా బాధపెట్టా. కాలక్రమేణా నాకు పెళ్ళయ్యింది. ఎందుకు మాట్లాడాలో అప్పుడు అర్ధమయ్యింది :-)

ఇప్పుడు తను ఒక బిడ్డకు తల్లి కూడా. నా బహిఃప్రాణం మరో చిన్ని ప్రాణానికి జన్మనిచ్చింది. మా స్నేహం బాలారిష్టాలన్నిటినీ దాటుకుని స్థిరంగా నిలుచుంది. త్వరలోనే తను అమెరికాకు ప్రయాణమౌతోంది. దూరం కాని, మరొకటి ఏదైనా కాని ఇప్పుడు మమ్మల్ని విడదీయలేదు.

ఈ స్నేహితుల దినోత్సవం సందర్భంగా నా ప్రాణ స్నేహితురాలికి శుభాకాంక్షలు. నేను చేసిన తప్పుకు బ్లాగ్ముఖంగా తనకు క్షమాపణలు.

అలాగే నా స్నేహితులందరికీ, బ్లాగ్మిత్రులందిరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.