14, సెప్టెంబర్ 2010, మంగళవారం

భలే భలే మంచి రోజులులే

మా స్కూలంటే నాకిష్టం (ఎవరి స్కూలంటే ఎవరికిష్టముండదులెండి). నేను నాలుగో తరగతికి వస్తూండగా మా ఈ స్కూల్లో చేరాను. పాత స్కూలు మానెయ్యడం వెనుక ఒక కథ ఉందండోయ్!

అవి నా మూడో తరగతి పరీక్షలు జరుగుతున్న రోజులు..నేను దించిన తల ఎత్తకుండా బర బరా రాస్తూ తెల్ల కాగితం రంగు మార్చడానికి ప్రయత్నిస్తున్నా.ఇంతలో నా వీపు మీద ఎవరో గోకినట్టయింది. వెనక్కి తిరిగి చూస్తే సుబ్బలక్ష్మి దీనాతి దీనమైన మొహమేసుకుని కాస్త కూడా రంగు మారని దాని తెల్ల కాగితాన్ని చూపించి దాని కరాబు చేయడంలో నా సహాయం కోరింది. నేను ఆలోచిస్తే ప్రతి పరీక్షకు వెళ్ళే ముందు నాన్నా గారు చెప్పే మాటలు గుర్తొచ్చాయి, "నీకు తెలిసింది నువ్వు రాయి, ఒకర్ని అడక్కు, ఒకరికి చూపకు, రెండూ తప్పే!". దానితో సహాయ నిరాకరణ ప్రకటించా. అది మా ఇన్విజిలేటర్ (మా ప్రైవేట్ టీచర్ కూడా)కు పిర్యాదు చేసింది. ఆవిడ వచ్చి 'ఒకే ప్రైవేట్లో చదువుతున్నారు, ఆ మాత్రం ఇచ్చి పుచ్చుకోకపోతే ఎలా' అని నన్నే మందలించింది. నా పేపర్ తీసుకుని సుబ్బులు చేతికిచ్చింది. అది విజయగర్వంతో నా పేపర్ ముందెట్టుకుని జెరాక్స్ కంపెనీ వాళ్ళు సిగ్గుపడేలా జెరాక్స్ దించడం మొదలుపెట్టింది. ఆ అవమానానికి నా చిన్ని హృదయం బద్దలైంది. ముక్కలు తాపీగా ఏరుకుందామని అప్పటికి అక్కడ్నుంచి నిష్క్రమించి ఆ ఆవేదనంతా మా నాన్న ముందు వెళ్ళగక్కా. ఆయన అంతకన్నా ఆవేశపడి నన్ను తక్షణం స్కూలు మానిపించారు.

సరే కొత్త స్కూళ్ళ వేటలో పడి ఒకరోజు నన్ను ఒక స్కూలుకు తీసుకువెళ్ళారు.
తొలి చూపులోనే విపరీతంగా నచ్చేసింది ఆ స్కూలు. పేద్ద ఆటస్థలం, ఆటస్థలానికి ఎడంపక్క చాలా పెద్ద తోట, కుడి పక్కన వరసగా తరగతి గదులు, వెనక మామిడి చెట్టు, దానికి వేలాడుతున్న మామిడి కాయలు, ముందు వైపు ఒక స్టేజ్, దాని వెనక ప్రార్థనా మందిరం, దాని వెనక చింత చెట్టు. ఇప్పటికీ నాకు చాలా గుర్తు, ఆ రోజు కొత్త స్కూలు చూడడానికి వెళ్ళబోతున్నానని నాకు ఎంతో ఇష్టమైన తెల్ల గౌను, దాని మీద నల్ల కోటు వేసుకున్నా. నేను వెళ్ళంగానే 'ఫలానా స్కూల్లో నీకు మూడో ర్యాంకు వచ్చేదా? అబ్బో చాలా తెలివైనదానివన్నమాట ' అని వెంటనే స్కూల్లో చేర్చుకుంటారన్న నా అంచనాలని తారుమారు చేస్తూ నాకు ప్రవేశ పరీక్ష పెడతానని చెప్పారు.
జూవాలజీ, అంత్రోపాలజీ ఇలా దేన్లో అడిగినా కొద్దో గొప్పో చెప్పగలనేమో కాని లెక్కలు అందులోనూ తీసివేతలంటే నాకు చచ్చేంత భయం. చిన్న సంఖ్య నుంచీ పెద్ద సంఖ్య తీసేసేటప్పుడు పక్క సంఖ్య నుంచీ అప్పెలా తీసుకోవాలో అర్ధమయ్యేది కాదు. అసలే నాకు మొహమాటమెక్కువ, అప్పడక్కుండానే కూర్చునేదాన్ని.అలాంటిది నాకు లెక్కల్లోనే పరీక్షపెట్టారు. గుణకారాలు, భాగహారాలు, కూడికలు అన్నీ చేసేసా కాని తీసివేతలో ఎప్పట్లా తడబడ్డా. నన్ను స్కూల్లో చేర్చుకోరేమో అని భయపడ్డా. కాని మా స్కూలు మంచి స్కూలు, ఈ బంగారు కొండను చేర్చుకోకుండా ఉంటుందా? :-P

అలా మా స్కూల్లోకొచ్చి పడ్డా. ఆడుతూ పాడుతూ ఆరో తరగతికొచ్చా, అప్పట్లో మాకు ప్రతి శుక్రవారం సాయంత్రం అసెంబ్లీ ఉండేది అంటే స్కూలు పిల్లలంతా ఒక చోట సమావేశమయ్యేవాళ్ళం, చింత చెట్టు కింద. ఒక చింత చెట్టు కింద అంతమంది ఎలా కూర్చునే వాళ్ళు, అదేమైనా పుష్పక విమానమా అని సందేహమొచ్చిందా? వచ్చే ఉంటుందిలెండి, మా చింత చెట్టు అంత పెద్దది కాదు కాని మా స్కూలు పిల్లల సంఖ్య చాలా తక్కువ.

ఆ శుక్రవారపు సమావేశాల్లో విద్యార్థులంతా ఒక్కో విధంగా తమ తమ ప్రతిభలను పైకి తీసి తక్కిన విద్యార్థుల మీదకు వదులుతూ ఉంటారు. ఒక్కోసారి బాలమురళి, ఎం.ఎస్.సుబ్బలక్ష్మి చెట్టు మీద చేరిన పిట్టల్ని బెదరగొడుతుంటే, ఇంకోసారి మైకేల్ జాక్సన్, ఎల్.విజయలక్ష్మి అక్కడ ప్రత్యక్షమౌతూ ఉంటారు. మేము సాధారణంగా చెవులకు దూదులు, కళ్ళకు గంతలు సందర్భానుసారంగా పెట్టుకుని వెళ్ళి క్లాస్ లో టీచర్ డిస్టర్బ్ చేయగా మధ్యలో ఆగిపోయిన మా చర్చలను కొనసాగించేవాళ్ళం.

ఒకనాటి సాయంకాలం అలాగే అందరం చెట్టు కింద కూర్చుని ఎప్పటిలా మామూలుగా గడ్డి పీక్కుంటూ, దేశకాలమాన పరిస్థితులను గూర్చి చర్చిస్తూ ఉన్నాం. అప్పుడు మాకు తెలియదు ఆ రోజు మేము చూడబోతున్నది ఒక మహత్తరమైన కార్యక్రమమని. 'న భూతో న భవిష్యతి ' అన్నది ఈ మధ్య అన్నిటికీ వాడేస్తున్నారు కానీ, సరిగ్గా ఆ కార్యక్రమానికి అతికినట్టు సరిపోతుంది.
ఇలాంటి సమావేశాల్లో మా విద్యార్థులంతా తమ తమ ప్రతిభలను విచ్చలవిడిగా ప్రదర్శించుకుంటారు అని చెప్పాను కదా, ఆ సాయంకాలపు వేళ మాకు చూపబోతున్న ప్రతిభ 'వ్యాపార ప్రకటనలు నటించి చూపుట '. అవాక్కయ్యారా? సినిమా వాళ్ళలాగే మా విధానం కూడా 'కాదేదీ ప్రదర్శనకనర్హం'.

ముందుగా అశ్విని హెయిర్ ఆయిల్ ప్రకటన..

'అశ్విని అశ్విని అశ్విని ...శిరోజాల సంరక్షిణి
దివి నుంచి భువికి దిగివచ్చిన అమృతవర్షిణి అశ్విని '

ఆ ప్రకటన చిన్నప్పుడు వచ్చేది..మీలో చాలా మంది చూసే ఉంటారు..

'రాలే జుట్టును అరికట్టునులే..' అన్నప్పుడు ఒకావిడ పాదాల పొడవు జుట్టేసుకుని గిర్రని బొంగరంలా తిరుగుతుంది...

ఈ ప్రకటన పూర్తయ్యేసరికి మాలో చాలా మందికి నవ్వి నవ్వి పొట్ట చెక్కలయ్యింది. ఇంతకీ సంగతేంటంటే..ఈ ప్రకటనలో నటించిన నివేదితది బాబ్ కట్. అది కనపడకుండా తనకు విగ్గు పెట్టారు. గిర్రని తిరిగినపుడు ఆ విగ్ కాస్తా కింద పడింది. తన్మయత్వంలో అది గ్రహించకుండా తను 'అశ్విని..అశ్విని...' అని పాడుతూనే పోయింది.

ఆ నవ్వుల నుండి కోలుకోకముందే ఇంకో ప్రకటన మొదలయ్యింది


అది ఫెవికాల్ యాడ్, ఒక ఫెవికాల్ డబ్బా తీసుకొచ్చి స్టేజ్ మీద మాకెదురుగా పెట్టారు, మళ్ళీ ఈ ప్రకటన మరోటి, మరోటి అనుకోకుండా. ఒక దళసరిగా ఉన్న తాడును ఇటో కొసా అటో కొసా పట్టుకున్నారు కొంతమంది. ఆ తాడు తెగి లేదు కాని తెగినది ఫెవికాల్ తో అంటించారు అని చెప్పడానికన్నట్టుగా ఒక ప్రదేశం లో ఒక చిన్న ముడి వేసి ఫెవికాల్ అని రాసి ఉన్న కాగితం అంటించారు. అంతా బాగానే ఉంది కాని తాడును ఒక వైపు లాగుతున్నవాళ్ళలో 'అభినవభీమ ' గా పేరుపొందిన శివప్రసాద్ గాడు కూడా ఉన్నాడు. చిన్న వయసులోనే ఎంతో కృషి చేసి భీముడు, బకాసురుడు, ఘటోత్కచుడు స్థాయికి చేరిన వాడి గురించి అప్పటికే టి.వీలలో, వార్తాపత్రికలలో ప్రత్యేక కథనాలు వచ్చాయి. వాడు ఒక వైపు లాగుతున్నాడనేసరికి మాకందరికీ ఆందోళన మొదలయ్యింది. అందులోనూ ఇరువైపుల సమాన బలం ఉండేలా చేయాలని నిర్వాహకులు ఒకరిద్దర్ని తప్పించి స్కూలు మొత్తాన్ని మరోవైపు నిల్చోపెట్టారు.

వాళ్ళు నటించడం మొదలుపెట్టారు..

"గట్టిగా లాగు హైస్సా
బలంగా లాగు హైస్సా
జోరుగా లాగు హైస్సా'


ఒక అరనిముషం నటించేసరికి నటన అన్న సంగతి మర్చిపోయి జీవంచడం మొదలుపెట్టాడు ప్రసాద్ గాడు. మేమేమీ తక్కువ తినలేదన్నట్టు అటు వైపు వాళ్ళు కూడా వాళ్ళ బలం కొద్దీ లాగారు. ఊహించినదే జరిగింది. తాడు సరిగ్గా కాగితం పెట్టిన చోటే తెగింది. అటు పడ్డ వాళ్ళు బాగానే ఉన్నారు, ఇటు వైపు మొదట నిల్చున్నది మన బాల బకాసుర్ కదా వాడు మీద పడేసరికి వెనక నిల్చున్న నలుగురు కోమాలోకి వెళ్ళినంత పనయ్యింది. దానితో ఆ మహత్తర కార్యక్రమానికి తెర పడింది.

7, సెప్టెంబర్ 2010, మంగళవారం

చక్రపాణి సినిమా లో ఒక చక్కని హాస్య సన్నివేశం

అసలు హాస్యం అంటే ఇలా ఉండాలి అనిపించేలా సున్నితమైన హాస్యం. నా అభిమాన నటీమణులలో ఒకరైన భానుమతి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ చక్కని హాస్య సన్నివేశం చదివి, చూసి నవ్వుకోండి.
నాగేశ్వర్రావ్ భానుమతి దంపతులు వాళ్ళింట్లో ఒక భాగం అద్దెకు ఇవ్వాలనుకుని ఇంటి బయట బోర్డు పెడతారు, అది చూసి సూర్యకాంతం లోపలికి వస్తుంది. ఇదీ నేపధ్యం.

---------------------------------------------------------------
సూర్యకాంతం: మీరేనా అండీ ఈ ఇంటి యాజమానులు?
భానుమతి: ఆ, కూర్చోండి.

సూ: పర్వాలేదు, పర్వాలేదు. ఎంత మర్యాద! ఎంత మర్యాద! అయినా అంతక్కర్లేదు, సగం చాలు. మర్యాదంటే నాకు ఇష్టమే కానీ అంత అక్కర్లే, సగం చాలు, సగం!
భా: భలే వారండీ! సగంలో సగం కూడా చెయ్యందే సగం చాలంటారేమిటి?
సూ: చెయ్యకపోవడమేమిటి? వాకిలి తలుపు తీసి ఆట్టే ఉంచారు, సోఫాలు, కుర్చీలు వేసారు, రాగానే పలకరించారు, అద్దెకివ్వబడును అనే బోర్డు కొట్టారు. ఇంకా ఏం చెయ్యాలమ్మా?
భా: అద్దె బోర్డు కొట్టడం కూడా మర్యాదేనంటారా?
సూ: అసలద్దెకెవరిస్తున్నారు ఈ రోజుల్లో? ఇస్తే మాత్రం బోర్డెవరు కొడుతున్నారు? కొడితే మాత్రం అదెంతసేపుంటుంది?
భా: అదీ నిజమే! అయితే మీరా బోర్డు చూసి వచ్చారన్నమాట!
సూ: ఆ! అసలంత బోర్డక్కర్లేదు. సగం చాలు. 'అద్దెకు' అంటే చాలు, 'ఇవ్వబడును' అక్కర్లేదు. ఆ, ఇంతకీ ఏ భాగం అద్దెకిచ్చేది?
భా: ఆ భాగం.. మీ పేరు?
సూ: నా పేరా? మనోరమ.
భా: బాగుంది.
సూ: ఏం బాగుండడం లెండి! మా వారు 'మనూ, మనూ' అని పిలిచేవారు. 'రమా రమా' అని అనటం ప్రారంభించిన తర్వాత ఆట్టే కాలం ఉండలే! అసలాయన ఆయుర్దాయమే సగం.
మీ పేరు?
భా: మాలతి. నన్ను మా వారు ముద్దుగా 'మా మా! అంటూంటారు. ఇంతకీ మీరేం చేస్తూంటారు?
సూ: ఆ మాటే అడిగారూ! అబ్బబ్బబ్బ! ఎంత కష్టం! ఎంత కష్టం! పది గంటలకల్లా వెళ్ళాలి, పాఠాలు మొదలుపెట్టాలి, పిల్లల్ని అదుపులో పెట్టాలి. అబ్బబ్బబ్బ! ఏం పాఠాలు! ఏం పిల్లలు! బుర్ర చెడిపోతుందనుకోండి!
భా: ఓ పంతులమ్మ ఉద్యోగమన్నమాట!
సూ: అదే! ఇట్టే గ్రహించేశారే! ఎంత తెలివి! ఎంత తెలివి! మర్యాద, తెలివి రెండూ ఒకే బుర్రలో ఇమడడం కష్టం. ఏమంటారు?
చూడండీ! తెగించందే పనులు కావు. తెల్లారొచ్చి ఇంట్లో చేరేస్తాను.
భా: ఇల్లు చూడరూ మీరు?
సూ: మీరింత మంచివాళ్ళు, ఇంకా ఇల్లు చూడడమెందుకమ్మా? అక్కర్లేదు! అయినా నాకు కాఫీ మీద పిచ్చి పెరిగింది, వెళ్ళిపోవాలి, లేకపోతే కళ్ళు తిరుగుతాయి.
భా: ఉండండి, మీకు కాఫీ కావాలా? నేనిస్తాను, కూర్చోండి!
సూ: ఆ! మీరిస్తారా? మర్యాద తగ్గించరూ? ఎంత మర్యాద! ఎంత మర్యాద!
భా: తగ్గిస్తాను. సగమే! కూర్చోండి.

కాఫీ తేవడానికి భానుమతి లోపలికి వెళ్తుంది. ఈ లోగా నాగేశ్వర రావు వస్తాడు. వచ్చీ రావడంతోనే కాగితం తీసి

నాగేశ్వర్రావు: మీ పేరు?

సూ: ఆ! పేరా? ఆవిడ మర్యాదగా అడిగింది కనుక మనోరమ అని చెప్పాను. నీకెందుకు చెప్పాలి?

నా: మనోరమ? Beautiful! Beautiful! ఆ మీ వృత్తి?

సూ: అసలు నువ్వెవరు? నా వృత్తితో నీకేం పని? బడి పంతుళ్ళంటే అంత లోకువా?

నా: మీ వయసు?

సూ: ఆ!

నా: వయసు?

సూ: ఏం నలభై అనుకుంటున్నావా? యాభై అనుకుంటున్నావా?

నా: అబ్బే! అలా ఎందుకనుకుంటాను? పట్టుమని పదహారు కూడా ఉండవనుకుంటున్నాను.

సూ: చాల్లే! మా అక్కయ్యకే ముప్పై ఎనిమిది. దానికన్నా నేను మూడేళ్ళు చిన్న. అయినా నా వయసుతో నీకేం పని?

నా: నేను భీమా కంపెనీ ఏజంటుని, మీ ఫారం పూర్తి చేస్తున్నాను.

సూ: ఏమిటీ? భీమా కంపెనీ ఏజంటా? ఇల్లు చూడ్డానికి నేనొస్తే ఇక్కడకు కూడా తయారయ్యావూ? నేను చేయను పో!

నా: చెయ్యాలి! అలా అనకూడదు. రాసేసా. ఒక వెయ్యికి మాత్రం చెయ్యండి.

సూ: ఆ! ఎంత అమర్యాద! ఎంత అమర్యాద! ఇంత మర్యాద గల ఇంట్లో ఇంత అమర్యాదా?పోతావా లేదా?

నా: మా! మా! మా!

భా: ఏవిటేవిటి?

సూ: చూడండి, ఈయనెలా వెంటాపడ్డాడో! ఎంత అమర్యాద! ఎంత అమర్యాద!భా: అబ్బబ్బ! ఏవిటండీ మీకీ తొందర?

నా: ఆ! తొందరపడకపోతే ఎలా? దొరికిన ఈ ఒక్క కేసు కూడా వదలనా? నువ్వన్నీ ఇలాగే పాడు చేస్తావ్.

సూ: ఎవరమ్మా ఈయన?

భా: మా వారే!

సూ: చెప్పరే? అలా చనువుగా లోపలికి వస్తూంటే ఆ మాటే అనుకున్నా. మీ వారేనా? మంచివారు.

భా: హిహి, కాఫీ తీసుకోండి.
సూ: ఇంతెందుకమ్మా? సగం చాలు.

భా: సగం లో సగం కూడా లేదండీ, తీసుకోండి... ఏవండీ వీరీ భాగానికొస్తారట

నా: భాగమేవిటి, భాగం? ఇల్లంతా తీసుకుని ఒక గది మాత్రం మనకిమ్మను

భా: ఆవిడకు సగం చాలట

సూ: ఔనండీ! ఎంత మర్యాద! ఎంత మర్యాద! ఎంత మంచి దాంపత్యం!

నా: పక్క భాగంలోనే ఉంటారుగా, చూదురు గాని.

---------------------------------------------------------------

వీడియో ఇక్కడ అప్లోడ్ చేసాను, సినిమా నుంచి తెగ్గొట్టి ఈ సన్నివేశం ఒక్కటీ ఎలా అప్లోడ్ చేయాలో తెలియక కనీసం చదివి నవ్వుకుంటారని మొత్తం టైప్ చేసా తరువాత వీడియో ఎలా విడదీయాలో తెలిసింది కాని రాసింది వృధా పోవడం ఎందుకని అది కూడా పెట్టేసా.

http://www.youtube.com/watch?v=m95c3b3ZBAg

1, సెప్టెంబర్ 2010, బుధవారం

మచిలీపట్నం మాయాబజార్ - 2

చూద్దామనుకున్నవన్నీ అయిపోయాయి, ఇక పెళ్ళి మండపానికి వెళ్ళి నా స్నేహితునికి ఒకసారి మొహం చూపించి, కుదిరితే మచిలీపట్నం పెళ్ళి విందు లాగించి, వెనక్కి పోదామనుకుని వాళ్ళు పెళ్ళి మండపానికి వచ్చేసారేమోనని ఫోన్ చేస్తే అప్పట్లో వచ్చేలా లేరని తెలిసింది (ముహూర్తం తెల్లవారుఝామున మూడింటికి లెండి). సరే వాళ్ళు రాకుండా మేమెళ్ళి మాత్రం ఏం చేస్తామని చెప్పి దగ్గర్లో పరాసుపేటలో ఉన్న ఆంజనేయస్వామి వారి గుడికి చేరుకున్నాం. అక్కడ దేవుడికి దణ్ణం పెట్టుకుంటూంటే 'ఇక్కడి ఆంజనేయస్వామి చాలా పవర్ఫుల్ అట, నీకేమైనా కోరికలుంటే కొరేస్కో' అని వెనక నుంచి మా ఆయన గుసగుసగా చెప్పారు. అసలు నాకు బాగా నవ్వొచ్చే అంశాలలో ఇదొకటి.
దేవుడు అంటేనే అత్యంత శక్తివంతుడు, సర్వాంతర్యామి, ఒకే దేవుడు వేరు వేరు స్వరూపాలు ధరించాడంతే. మరి అలాంటప్పుడు ఒక దేవుడు ఎక్కువ శక్తివంతుడు ఇంకొకరు తక్కువ ఎలా అవుతుంది? పొనీ అది కూడా ఒకే దేవుడు ఒక చోట ఎక్కువ శక్తివంతుడు ఇంకొక చోట కాస్త తక్కువ శక్తివంతుడు ఎలా? ఎంత అసంబద్దంగా ఉంది ఈ ఆలోచన! ఏంటో! పైకి అంటే ఆయనకు కోపం, నోరు మూసుకుని దణ్ణం పెట్టుకుని బయటకొచ్చేసరికి గుర్తుకువచ్చింది, పెళ్ళికి వెళ్తూ బహుమతి ఏదీ తీసుకెళ్ళట్లేదని..

ఇక చేసేదేముంది బహుమతి వేటకై బజారు మీద పడ్డాం. కనపడిన మొదటి కొట్లో దూరి, ప్రతీ వస్తువు లాగడం, దాని ధర అడగడం, బుడ్జెట్లో ఉండి, నాకు నచ్చి, మా ఆయనకు నచ్చి అంతా బాగుందనుకున్నాక దాని మీద ఏ మరకో , గీతో ఉండడం. ఇక లాభం లేదు దీని బదులు ఆ ఇచ్చేదేదో నగదు రూపంలో ఇస్తే వాళ్ళకు నచ్చేది కొనుక్కుంటారు అనుకుని తీరా కొట్టంతా లాగి, పీకి, పాకాన పెట్టాకా ఇప్పుడు ఒక గిఫ్టు కవరు కావాలంటే మామూలుగా తిట్టరని, ఆ కొట్టు యజమాని ఎవరితోనో మాట్లాడుతూ ఉండగా అదను చూసుకుని అక్కడినుండీ బయటపడి పక్కనున్న ఫ్యాన్సీ షాపులోకి దూరాం.
ఆ దుకాణదారుడు మేము వెళ్తూనే, 'ఆ! ఏం కావాలమ్మా? కవర్ కావాలా? ఇస్తాను. ఇంకేం కావాలి? ఏమీ వద్దా? ఊరికే చూడండి పోని, చూడ్డానికి ఖరీదు లేదుగా. ఆ ఇది చూడండి కాష్మీరీ స్నో, ఇది ప్రత్యేకంగా తయారు చేసిన మందార నూనె..రెండు రోజులకొకసారి రాస్తే చాలు, జుత్తు ఊడదు, తెల్లబడదు, ఒక్కసారి వాడి చూడండి.' ఈయన ఉన్నవారు ఉన్నట్టు ఉండొచ్చు కదా తెల్లగా నిగనిగలాడుతున్న ఆయన బట్టతలను చూసి, 'మరి మీరు వాడలేదా?' అని అడిగారు. ఇహ చూసుకోండీ ఆయన మొదలుపెట్టాడు, 'నా వయసెంతనుకుంటున్నారు? చిన్నగా కనిపిస్తున్నాను కాని నాకు డబ్బై ఎనిమిదేళ్ళు, నేనిప్పటికీ చెట్లెక్కుతాను, గెంతుతాను, శుబ్బరంగా తింటాను. అసలు నేను తినగలిగినంత మీరు తినగలరా? అహ తినగలరా అని..చాలెంజ్! ఇప్పటికీ మా డాక్టరు గారు ఆశ్చర్యపడుతూ ఉంటారు, బీపీ, షుగర్ ఇన్ని పెట్టుకుని ఇంత ఆరోగ్యంగా ఎలా ఉండగలుగుతున్నానని..' ఇలా ఎక్కడా ఆపకుండా ఒక పదిహేను నిముషాలు తన వాక్ప్రవాహంలో మమ్మల్ని ముంచి, తేల్చి, ఎందుకడిగాన్రా బాబు అని మా ఆయన పశ్చాత్తాప్పడేలా చేసి కాని శాంతించలేదాయన. నాకు మాత్రం భలే ఉత్సాహంగా అనిపించింది ఆ తంతు చూస్తుంటే.

ఇంతకీ నేనా మందార నూనె కొన్నానా లేదా అనే కదా మీ సందేహం? జుత్తుకు మంచిది అంటే కిరసనాయిలు కూడా రాసేసుకునే నేను కొనకుండా ఉంటానా? రెండు రూపాయిల కవర్ కొనడానికి వెళ్ళిన మాతో రెండు వందలు ఖర్చుపెట్టించి కాని వదల్లేదాయన. అసలు పొరపాటున తెలియక రాకెట్ సింగ్ కి 'బెస్ట్ సేల్స్మన్ అఫ్ ది ఇయర్' ఇచ్చేసారు కాని ఈయనకు ఇవ్వాల్సింది.

ఇక ఆ రోజు పెళ్ళికెళ్ళి కాసేపు కూర్చుని వెనక్కి వెళ్ళిపోయాం. వచ్చేస్తూంటే గుర్తొచ్చింది తాతారావు కొట్లో బందరు హల్వా తీసుకోవడం మర్చిపోయామన్న సంగతి :-( మరుసటి రోజు పుస్తకాలు కొనడానికి బెజవాడ వెళ్ళి ముందుగా తయారు చేసుకున్న లిస్టు ప్రకారం 'విశాలాంధ్ర బుక్ హౌస్ ' లో అన్నీ పుస్తకాలు కొని బయల్దేరాం. దారిలో ఉయ్యూరులో బస్ ఆగినపుడు, 'పాప్ కారం, పాప్ కారం' అంటూ పాప్ కార్న్ అమ్ముతున్న కుర్రాడిని చూస్తే భలే ముచ్చటేసింది. ఇక్కడ మనం యధాశక్తి ఇంగ్లీషుని తెలుగు మాటల్లోకి లాగడానికి ప్రయత్నిస్తూంటే అక్కడా పిల్లాడు చక్కగా పాప్ కార్న్ ని కూడా తెనుగీకరిస్తున్నాడు.


యాత్రంతా బాగానే అయ్యింది కాని వచ్చేసేముందు తాతగారు, నేనెంతో ముచ్చటపడి కొనుక్కున్న భానుమతి గారి "నాలో నేను" పుస్తకం చూపిస్తూ, 'అమ్మాయ్! ఆ పుస్తకం అలా ఉంచేసి వెళ్ళు, మరొకసారి వచ్చినప్పుడు తీసుకొస్తా లే' అనేసరికి నా మొహానికి గంటు పడిపోయింది. ఆస్తి రాసిచ్చెయ్యమన్నా (మనకేముంది కనుక) నవ్వుతూ ఇచ్చెయ్యగలను కాని , పుస్తకాలో, పాత సినిమా సీడీలో ఎవరైనా అడిగితే మాత్రం తెగ బాధేసేస్తుంది. వెనుక నుంచి 'మంచి పనయ్యింది ' అని చంకలు గుద్దుకుంటున్న మా వారిని చూస్తే ఎక్కడలేని కోపం వచ్చేసి నాలుగు మొత్తబుద్దేసింది.

నేను కొన్న పుస్తకాలు



నాగేస్రావ్ గారి కోరిక మేరకు నా దగ్గరున్న మరొక రెండు ఫోటోలు... సాయి బాబా విగ్రహం, పార్కు