7, సెప్టెంబర్ 2010, మంగళవారం

చక్రపాణి సినిమా లో ఒక చక్కని హాస్య సన్నివేశం

అసలు హాస్యం అంటే ఇలా ఉండాలి అనిపించేలా సున్నితమైన హాస్యం. నా అభిమాన నటీమణులలో ఒకరైన భానుమతి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ చక్కని హాస్య సన్నివేశం చదివి, చూసి నవ్వుకోండి.
నాగేశ్వర్రావ్ భానుమతి దంపతులు వాళ్ళింట్లో ఒక భాగం అద్దెకు ఇవ్వాలనుకుని ఇంటి బయట బోర్డు పెడతారు, అది చూసి సూర్యకాంతం లోపలికి వస్తుంది. ఇదీ నేపధ్యం.

---------------------------------------------------------------
సూర్యకాంతం: మీరేనా అండీ ఈ ఇంటి యాజమానులు?
భానుమతి: ఆ, కూర్చోండి.

సూ: పర్వాలేదు, పర్వాలేదు. ఎంత మర్యాద! ఎంత మర్యాద! అయినా అంతక్కర్లేదు, సగం చాలు. మర్యాదంటే నాకు ఇష్టమే కానీ అంత అక్కర్లే, సగం చాలు, సగం!
భా: భలే వారండీ! సగంలో సగం కూడా చెయ్యందే సగం చాలంటారేమిటి?
సూ: చెయ్యకపోవడమేమిటి? వాకిలి తలుపు తీసి ఆట్టే ఉంచారు, సోఫాలు, కుర్చీలు వేసారు, రాగానే పలకరించారు, అద్దెకివ్వబడును అనే బోర్డు కొట్టారు. ఇంకా ఏం చెయ్యాలమ్మా?
భా: అద్దె బోర్డు కొట్టడం కూడా మర్యాదేనంటారా?
సూ: అసలద్దెకెవరిస్తున్నారు ఈ రోజుల్లో? ఇస్తే మాత్రం బోర్డెవరు కొడుతున్నారు? కొడితే మాత్రం అదెంతసేపుంటుంది?
భా: అదీ నిజమే! అయితే మీరా బోర్డు చూసి వచ్చారన్నమాట!
సూ: ఆ! అసలంత బోర్డక్కర్లేదు. సగం చాలు. 'అద్దెకు' అంటే చాలు, 'ఇవ్వబడును' అక్కర్లేదు. ఆ, ఇంతకీ ఏ భాగం అద్దెకిచ్చేది?
భా: ఆ భాగం.. మీ పేరు?
సూ: నా పేరా? మనోరమ.
భా: బాగుంది.
సూ: ఏం బాగుండడం లెండి! మా వారు 'మనూ, మనూ' అని పిలిచేవారు. 'రమా రమా' అని అనటం ప్రారంభించిన తర్వాత ఆట్టే కాలం ఉండలే! అసలాయన ఆయుర్దాయమే సగం.
మీ పేరు?
భా: మాలతి. నన్ను మా వారు ముద్దుగా 'మా మా! అంటూంటారు. ఇంతకీ మీరేం చేస్తూంటారు?
సూ: ఆ మాటే అడిగారూ! అబ్బబ్బబ్బ! ఎంత కష్టం! ఎంత కష్టం! పది గంటలకల్లా వెళ్ళాలి, పాఠాలు మొదలుపెట్టాలి, పిల్లల్ని అదుపులో పెట్టాలి. అబ్బబ్బబ్బ! ఏం పాఠాలు! ఏం పిల్లలు! బుర్ర చెడిపోతుందనుకోండి!
భా: ఓ పంతులమ్మ ఉద్యోగమన్నమాట!
సూ: అదే! ఇట్టే గ్రహించేశారే! ఎంత తెలివి! ఎంత తెలివి! మర్యాద, తెలివి రెండూ ఒకే బుర్రలో ఇమడడం కష్టం. ఏమంటారు?
చూడండీ! తెగించందే పనులు కావు. తెల్లారొచ్చి ఇంట్లో చేరేస్తాను.
భా: ఇల్లు చూడరూ మీరు?
సూ: మీరింత మంచివాళ్ళు, ఇంకా ఇల్లు చూడడమెందుకమ్మా? అక్కర్లేదు! అయినా నాకు కాఫీ మీద పిచ్చి పెరిగింది, వెళ్ళిపోవాలి, లేకపోతే కళ్ళు తిరుగుతాయి.
భా: ఉండండి, మీకు కాఫీ కావాలా? నేనిస్తాను, కూర్చోండి!
సూ: ఆ! మీరిస్తారా? మర్యాద తగ్గించరూ? ఎంత మర్యాద! ఎంత మర్యాద!
భా: తగ్గిస్తాను. సగమే! కూర్చోండి.

కాఫీ తేవడానికి భానుమతి లోపలికి వెళ్తుంది. ఈ లోగా నాగేశ్వర రావు వస్తాడు. వచ్చీ రావడంతోనే కాగితం తీసి

నాగేశ్వర్రావు: మీ పేరు?

సూ: ఆ! పేరా? ఆవిడ మర్యాదగా అడిగింది కనుక మనోరమ అని చెప్పాను. నీకెందుకు చెప్పాలి?

నా: మనోరమ? Beautiful! Beautiful! ఆ మీ వృత్తి?

సూ: అసలు నువ్వెవరు? నా వృత్తితో నీకేం పని? బడి పంతుళ్ళంటే అంత లోకువా?

నా: మీ వయసు?

సూ: ఆ!

నా: వయసు?

సూ: ఏం నలభై అనుకుంటున్నావా? యాభై అనుకుంటున్నావా?

నా: అబ్బే! అలా ఎందుకనుకుంటాను? పట్టుమని పదహారు కూడా ఉండవనుకుంటున్నాను.

సూ: చాల్లే! మా అక్కయ్యకే ముప్పై ఎనిమిది. దానికన్నా నేను మూడేళ్ళు చిన్న. అయినా నా వయసుతో నీకేం పని?

నా: నేను భీమా కంపెనీ ఏజంటుని, మీ ఫారం పూర్తి చేస్తున్నాను.

సూ: ఏమిటీ? భీమా కంపెనీ ఏజంటా? ఇల్లు చూడ్డానికి నేనొస్తే ఇక్కడకు కూడా తయారయ్యావూ? నేను చేయను పో!

నా: చెయ్యాలి! అలా అనకూడదు. రాసేసా. ఒక వెయ్యికి మాత్రం చెయ్యండి.

సూ: ఆ! ఎంత అమర్యాద! ఎంత అమర్యాద! ఇంత మర్యాద గల ఇంట్లో ఇంత అమర్యాదా?పోతావా లేదా?

నా: మా! మా! మా!

భా: ఏవిటేవిటి?

సూ: చూడండి, ఈయనెలా వెంటాపడ్డాడో! ఎంత అమర్యాద! ఎంత అమర్యాద!భా: అబ్బబ్బ! ఏవిటండీ మీకీ తొందర?

నా: ఆ! తొందరపడకపోతే ఎలా? దొరికిన ఈ ఒక్క కేసు కూడా వదలనా? నువ్వన్నీ ఇలాగే పాడు చేస్తావ్.

సూ: ఎవరమ్మా ఈయన?

భా: మా వారే!

సూ: చెప్పరే? అలా చనువుగా లోపలికి వస్తూంటే ఆ మాటే అనుకున్నా. మీ వారేనా? మంచివారు.

భా: హిహి, కాఫీ తీసుకోండి.
సూ: ఇంతెందుకమ్మా? సగం చాలు.

భా: సగం లో సగం కూడా లేదండీ, తీసుకోండి... ఏవండీ వీరీ భాగానికొస్తారట

నా: భాగమేవిటి, భాగం? ఇల్లంతా తీసుకుని ఒక గది మాత్రం మనకిమ్మను

భా: ఆవిడకు సగం చాలట

సూ: ఔనండీ! ఎంత మర్యాద! ఎంత మర్యాద! ఎంత మంచి దాంపత్యం!

నా: పక్క భాగంలోనే ఉంటారుగా, చూదురు గాని.

---------------------------------------------------------------

వీడియో ఇక్కడ అప్లోడ్ చేసాను, సినిమా నుంచి తెగ్గొట్టి ఈ సన్నివేశం ఒక్కటీ ఎలా అప్లోడ్ చేయాలో తెలియక కనీసం చదివి నవ్వుకుంటారని మొత్తం టైప్ చేసా తరువాత వీడియో ఎలా విడదీయాలో తెలిసింది కాని రాసింది వృధా పోవడం ఎందుకని అది కూడా పెట్టేసా.

http://www.youtube.com/watch?v=m95c3b3ZBAg

15 కామెంట్‌లు:

  1. హ హ హ.. బాగుందండి వీడియో చూడకుండానే ముగ్గురిని వూహించుకుని ఆ సన్నివేశం లో నవ్వుకున్నాను, :-)

    రిప్లయితొలగించండి
  2. చాలా బాగుందండీ. ధన్యవాదాలండి మంచి టపా అందించినందుకు. చాలా మంచి హాస్యము. ఇప్పుడొస్తున్న హాస్యం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.భానుమతిగారు ఈ చిత్రాన్ని నిర్మాత నాగిరెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని వ్యంగముగా నిర్మించారని చెప్పుకొంటారండీ.

    రిప్లయితొలగించండి
  3. Intakee e cinema andi baabu idi. brahmaandam gaa undi! cinema peremto kaasta chebduroo?

    cheers
    zilebi
    http://www.varuhini.tk

    రిప్లయితొలగించండి
  4. chakkati sannivesaanni andinchinanduku santosham.
    eesinimaa rachayita maa naanna gaare!gadi tappani haasyam,mdhuramaina paatalu chakrapani sinimaa cheppukodaggadi.
    gnana prasuna

    రిప్లయితొలగించండి
  5. చాలా బాగా వ్రాసారు. ఇ౦తా హస్యసన్నివేశము గుర్తుపేట్టుకుని మా అ౦దరిగురి౦చి రాయడ౦ చాలాచాలాచాలా స౦తోష౦గా వు౦ది. ఇ౦కా వీడియో కూడ చాలాకష్టపడి అప్లోడ్ చేసారు.అసలు వీడియో అప్లోడ్ చేయక పోయిన క౦టి ము౦దు జరుజుతున్నట్టు రాశారు.

    ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  6. అసలు చక్రపాణి సినిమాయే ఎంత బాగుంటుందో..
    ఆ డైలాగులు, దర్శకత్వం, నటన ఇప్పుడు చూసినా అంత హాయిగానూ నవ్వుకుంటాం. వీటినే కాబోలు నాలుగుకాలాలపాటు నిలిచేవి అంటారు. మంచి సన్నివేశం చూపించారు.

    రిప్లయితొలగించండి
  7. భావన గారూ, నెనర్లు..
    అసలు ముగ్గురూ ముగ్గురే గా! సూర్యకాంతం గారు, 'చాల్లే ఊరుకో' అన్నా, నాగేశ్వర్రావు గారు, 'చెయ్యాలి, అలా అనకూడదు ' అన్నా , భానుమతి గారు, 'తగ్గిస్తాను, సగమే' అన్నా వారి ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది ఆ మాటల్లో..

    సురేష్ గారు..
    >>ఇప్పుడొస్తున్న హాస్యం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది
    సరిగ్గా చెప్పారు..

    చక్రపాణి గారు తనను మిస్సమ్మనుంచి తొలగించడంతో దానికి ధీటైన హాస్యరస సినిమా తీయాలని ఈ సినిమా తీసారని, ఆయన్ను దృష్టిలో పెట్టుకునే ఈ సినిమాకు ఆ పేరు పెట్టారని నేను విన్నానండీ

    రిప్లయితొలగించండి
  8. అజ్ఞాత గారు, అన్యాయమండీ, సినిమా పేరు అంతలేసి అక్షరాలతో శీర్షికలోనే ఇచ్చాను కదండీ..చక్రపాణి అని

    జ్ఞాన ప్రసూన గారు మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. రావూరి వెంకట సత్యనారాయణరావు గారు మీ నాన్నగారా? చాలా సంతోషమండీ. మీరన్నట్టు ఈ సినిమాలో సంభాషణలతో పాటుగా పాటలు కూడా చాలా బాగుంటాయి..ముఖ్యంగా "ఓ ప్రియురాల ఓ జవరాల", "ప్రక్కల నిలబడి", "ఉయ్యాల జంపాలలూగరావయా" పాటలు మరీనూ

    రిప్లయితొలగించండి
  9. శేషు గారూ, ధన్యవాదాలండీ.. మనకు నచ్చినది పది మందితో పంచుకుంటేనే కదండీ మనకు ఆనందం..
    అయినా గుర్తుపెట్టుకుని రాసేంత జ్ఞాపకశక్తి లేదండీ, ఇదే సన్నివేశం మళ్ళీ మళ్ళీ చూస్తూ రాసుకున్నా.

    శ్రీ లలిత గారు, నిజమేనండీ, పాత సినిమాలలో చాలా వరకు నాలుగుకాలాలపాటు నిలిచేవే ఉండడం మన అదృష్టం. అసలు ఇలాంటి సినిమాలు ఎన్ని సార్లు చూసినా విసుగు పుట్టదు

    రిప్లయితొలగించండి
  10. oho- cinema pere chakrapani anna maata! Nenu chakrapaani gaari cinemaa anukunnaanandoy! dhanvyaadaalu!

    cheers
    zilebi
    http://www.varudhini.tk

    రిప్లయితొలగించండి
  11. thanks sagam chakrapani gaariki..
    sagam meeku..total ga full comedy scene choopinchaaru..enta haayigaa undi..raasina vaariki, vesina vaariki, full thanks..

    రిప్లయితొలగించండి
  12. అక్షర మోహనం గారూ, నెనర్లు..
    చక్రపాణి గారి సినిమా కాదండీ ఇది, చక్రపాణి అనే సినిమా.

    రిప్లయితొలగించండి
  13. చాలా బాగా రాసారండీ . సన్నివేశం చదువుతూ ఉంటే ఆ ముగ్గురు కళ్ళ ముందు కదులుతున్నట్టే ఉంది .. అసలు ముగ్గురూ ముగ్గురే .. అంత మంచి సన్నివేశం చక్కగా రాసినందుకు మీకు ధన్యవాదాలు... ఉండండి, అర్జెంటుగా ఆ సినిమా DVD పెట్టుకొని ఇంకొకసారి చూసేయ్యాలి!! :-)

    రిప్లయితొలగించండి
  14. నిజం చెప్పాలంటే మీర్రాసింది చదువుతూ సన్నివేశం ఊహించుకోవడం భలేగా ఉందండీ..

    రిప్లయితొలగించండి