1, సెప్టెంబర్ 2010, బుధవారం

మచిలీపట్నం మాయాబజార్ - 2

చూద్దామనుకున్నవన్నీ అయిపోయాయి, ఇక పెళ్ళి మండపానికి వెళ్ళి నా స్నేహితునికి ఒకసారి మొహం చూపించి, కుదిరితే మచిలీపట్నం పెళ్ళి విందు లాగించి, వెనక్కి పోదామనుకుని వాళ్ళు పెళ్ళి మండపానికి వచ్చేసారేమోనని ఫోన్ చేస్తే అప్పట్లో వచ్చేలా లేరని తెలిసింది (ముహూర్తం తెల్లవారుఝామున మూడింటికి లెండి). సరే వాళ్ళు రాకుండా మేమెళ్ళి మాత్రం ఏం చేస్తామని చెప్పి దగ్గర్లో పరాసుపేటలో ఉన్న ఆంజనేయస్వామి వారి గుడికి చేరుకున్నాం. అక్కడ దేవుడికి దణ్ణం పెట్టుకుంటూంటే 'ఇక్కడి ఆంజనేయస్వామి చాలా పవర్ఫుల్ అట, నీకేమైనా కోరికలుంటే కొరేస్కో' అని వెనక నుంచి మా ఆయన గుసగుసగా చెప్పారు. అసలు నాకు బాగా నవ్వొచ్చే అంశాలలో ఇదొకటి.
దేవుడు అంటేనే అత్యంత శక్తివంతుడు, సర్వాంతర్యామి, ఒకే దేవుడు వేరు వేరు స్వరూపాలు ధరించాడంతే. మరి అలాంటప్పుడు ఒక దేవుడు ఎక్కువ శక్తివంతుడు ఇంకొకరు తక్కువ ఎలా అవుతుంది? పొనీ అది కూడా ఒకే దేవుడు ఒక చోట ఎక్కువ శక్తివంతుడు ఇంకొక చోట కాస్త తక్కువ శక్తివంతుడు ఎలా? ఎంత అసంబద్దంగా ఉంది ఈ ఆలోచన! ఏంటో! పైకి అంటే ఆయనకు కోపం, నోరు మూసుకుని దణ్ణం పెట్టుకుని బయటకొచ్చేసరికి గుర్తుకువచ్చింది, పెళ్ళికి వెళ్తూ బహుమతి ఏదీ తీసుకెళ్ళట్లేదని..

ఇక చేసేదేముంది బహుమతి వేటకై బజారు మీద పడ్డాం. కనపడిన మొదటి కొట్లో దూరి, ప్రతీ వస్తువు లాగడం, దాని ధర అడగడం, బుడ్జెట్లో ఉండి, నాకు నచ్చి, మా ఆయనకు నచ్చి అంతా బాగుందనుకున్నాక దాని మీద ఏ మరకో , గీతో ఉండడం. ఇక లాభం లేదు దీని బదులు ఆ ఇచ్చేదేదో నగదు రూపంలో ఇస్తే వాళ్ళకు నచ్చేది కొనుక్కుంటారు అనుకుని తీరా కొట్టంతా లాగి, పీకి, పాకాన పెట్టాకా ఇప్పుడు ఒక గిఫ్టు కవరు కావాలంటే మామూలుగా తిట్టరని, ఆ కొట్టు యజమాని ఎవరితోనో మాట్లాడుతూ ఉండగా అదను చూసుకుని అక్కడినుండీ బయటపడి పక్కనున్న ఫ్యాన్సీ షాపులోకి దూరాం.
ఆ దుకాణదారుడు మేము వెళ్తూనే, 'ఆ! ఏం కావాలమ్మా? కవర్ కావాలా? ఇస్తాను. ఇంకేం కావాలి? ఏమీ వద్దా? ఊరికే చూడండి పోని, చూడ్డానికి ఖరీదు లేదుగా. ఆ ఇది చూడండి కాష్మీరీ స్నో, ఇది ప్రత్యేకంగా తయారు చేసిన మందార నూనె..రెండు రోజులకొకసారి రాస్తే చాలు, జుత్తు ఊడదు, తెల్లబడదు, ఒక్కసారి వాడి చూడండి.' ఈయన ఉన్నవారు ఉన్నట్టు ఉండొచ్చు కదా తెల్లగా నిగనిగలాడుతున్న ఆయన బట్టతలను చూసి, 'మరి మీరు వాడలేదా?' అని అడిగారు. ఇహ చూసుకోండీ ఆయన మొదలుపెట్టాడు, 'నా వయసెంతనుకుంటున్నారు? చిన్నగా కనిపిస్తున్నాను కాని నాకు డబ్బై ఎనిమిదేళ్ళు, నేనిప్పటికీ చెట్లెక్కుతాను, గెంతుతాను, శుబ్బరంగా తింటాను. అసలు నేను తినగలిగినంత మీరు తినగలరా? అహ తినగలరా అని..చాలెంజ్! ఇప్పటికీ మా డాక్టరు గారు ఆశ్చర్యపడుతూ ఉంటారు, బీపీ, షుగర్ ఇన్ని పెట్టుకుని ఇంత ఆరోగ్యంగా ఎలా ఉండగలుగుతున్నానని..' ఇలా ఎక్కడా ఆపకుండా ఒక పదిహేను నిముషాలు తన వాక్ప్రవాహంలో మమ్మల్ని ముంచి, తేల్చి, ఎందుకడిగాన్రా బాబు అని మా ఆయన పశ్చాత్తాప్పడేలా చేసి కాని శాంతించలేదాయన. నాకు మాత్రం భలే ఉత్సాహంగా అనిపించింది ఆ తంతు చూస్తుంటే.

ఇంతకీ నేనా మందార నూనె కొన్నానా లేదా అనే కదా మీ సందేహం? జుత్తుకు మంచిది అంటే కిరసనాయిలు కూడా రాసేసుకునే నేను కొనకుండా ఉంటానా? రెండు రూపాయిల కవర్ కొనడానికి వెళ్ళిన మాతో రెండు వందలు ఖర్చుపెట్టించి కాని వదల్లేదాయన. అసలు పొరపాటున తెలియక రాకెట్ సింగ్ కి 'బెస్ట్ సేల్స్మన్ అఫ్ ది ఇయర్' ఇచ్చేసారు కాని ఈయనకు ఇవ్వాల్సింది.

ఇక ఆ రోజు పెళ్ళికెళ్ళి కాసేపు కూర్చుని వెనక్కి వెళ్ళిపోయాం. వచ్చేస్తూంటే గుర్తొచ్చింది తాతారావు కొట్లో బందరు హల్వా తీసుకోవడం మర్చిపోయామన్న సంగతి :-( మరుసటి రోజు పుస్తకాలు కొనడానికి బెజవాడ వెళ్ళి ముందుగా తయారు చేసుకున్న లిస్టు ప్రకారం 'విశాలాంధ్ర బుక్ హౌస్ ' లో అన్నీ పుస్తకాలు కొని బయల్దేరాం. దారిలో ఉయ్యూరులో బస్ ఆగినపుడు, 'పాప్ కారం, పాప్ కారం' అంటూ పాప్ కార్న్ అమ్ముతున్న కుర్రాడిని చూస్తే భలే ముచ్చటేసింది. ఇక్కడ మనం యధాశక్తి ఇంగ్లీషుని తెలుగు మాటల్లోకి లాగడానికి ప్రయత్నిస్తూంటే అక్కడా పిల్లాడు చక్కగా పాప్ కార్న్ ని కూడా తెనుగీకరిస్తున్నాడు.


యాత్రంతా బాగానే అయ్యింది కాని వచ్చేసేముందు తాతగారు, నేనెంతో ముచ్చటపడి కొనుక్కున్న భానుమతి గారి "నాలో నేను" పుస్తకం చూపిస్తూ, 'అమ్మాయ్! ఆ పుస్తకం అలా ఉంచేసి వెళ్ళు, మరొకసారి వచ్చినప్పుడు తీసుకొస్తా లే' అనేసరికి నా మొహానికి గంటు పడిపోయింది. ఆస్తి రాసిచ్చెయ్యమన్నా (మనకేముంది కనుక) నవ్వుతూ ఇచ్చెయ్యగలను కాని , పుస్తకాలో, పాత సినిమా సీడీలో ఎవరైనా అడిగితే మాత్రం తెగ బాధేసేస్తుంది. వెనుక నుంచి 'మంచి పనయ్యింది ' అని చంకలు గుద్దుకుంటున్న మా వారిని చూస్తే ఎక్కడలేని కోపం వచ్చేసి నాలుగు మొత్తబుద్దేసింది.

నేను కొన్న పుస్తకాలు



నాగేస్రావ్ గారి కోరిక మేరకు నా దగ్గరున్న మరొక రెండు ఫోటోలు... సాయి బాబా విగ్రహం, పార్కు


6 కామెంట్‌లు:

  1. ఆ బుక్స్ అలా పేర్చి ఊరిస్తే మేము ఎలా తట్టుకోవాలి?

    రిప్లయితొలగించండి
  2. jyothi గారూ, కదా! నాలుగు స్వీట్లు పెడితే కన్నా ఇలా నాలుగు పుస్తకాలు పెడితేనే తట్టుకోవడం కష్టం. తీసెయ్యమంటారా చెప్పండి ;-)

    రిప్లయితొలగించండి
  3. ఇంకా ఫోటోలు పెట్టినందుకు నెనర్స్ సుభగ గారూ.

    రిప్లయితొలగించండి
  4. చాలాపుస్తకాలు కొనుక్కున్నారే... మా వూరెళ్ళి పరాసుపేట సెంటర్ నుంచి కోనేరు సెంటరు దాకా తిరిగేసి మా వూరి హల్వా కొనకుండా వచ్చేసారా.. అయ్యొయ్యో... మా వూరోళ్ళు అంతే అండీ బెస్ట్ సేల్స్ మెన్ లు. ప్చ్ ఎవ్వరు గుర్తించరు అంతే.. చాలా థ్యాంక్స్ అండిమా వూరి కధ వివరం గా చెప్పినందుకు.

    రిప్లయితొలగించండి
  5. ఔనండీ మా నాన్నగారు కూడా మరీ మరీ అన్నారు, 'అయ్యో అలా ఎలా వచ్చేసారమ్మా బందరు మిఠాయి కొనకుండా' అని. మరొకసారి వెళ్ళినప్పుడు నా అదృష్టాన్ని పరీక్షించుకోవాలి :-)

    రిప్లయితొలగించండి
  6. హమ్మయ్య!! అన్నీ చదివిన పుస్తకాలే.. :-)
    మీరు కొన్న పుస్తకాల ప్రత్యేకత ఏమిటంటే, ఏ పుస్తకం మొదలు పెట్టినా, పూర్తి చేసి కానీ విడిచిపెట్టలేరు..

    రిప్లయితొలగించండి