1, ఆగస్టు 2010, ఆదివారం

స్నేహానికి చిరునామా

మొదటిసారి మేము కలిసింది మా ఇంట్లో. రాష్ట్రానికి దూరంగా ఉన్న ఒక ఇంజినీరింగ్ కాలేజిలో మా ఇద్దరికీ ప్రవేశం వచ్చిందని తెలిసి పరిచయం చేసుకుందామని తను, వాళ్ళ అమ్మగారు ఒక ఆదివారం ఉదయాన్నే మా ఇంటికి వచ్చారు. అప్పుడు మేము పెద్దగా మాట్లాడింది లేదు, ఊరకే పది నిముషాలు కూర్చుని వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత కలిసి ప్రయాణం చేసి కాలేజి ఉండే ఊరు చేరుకున్నాం. ప్రయాణంలో నేను మాట్లాడదామని ప్రయత్నించినా తను అప్పర్ బెర్త్ నుంచీ కిందకు దిగితేనా! అప్పటికీ మంచి చేసుకుందామని నా హనీఫేబ్ చాక్లేటు ఒకటి ఇచ్చా కూడా.

మా ఇద్దరితో పాటు మా తల్లిదండ్రులు కూడా మమ్మల్ని దిగపెట్టడానికి వచ్చారు. నాకు అదే మొదటిసారి అమ్మానాన్నలను విడిచి దూరప్రాంతంలో ఉండాల్సిరావడం. తనకూ దాదాపుగా అంతే. వాళ్ళు ఇంకాసేపట్లో బయల్దేరుతారనగా, లేడీస్ హాస్టల్ ముందు వేసిన కుర్చీలలో కూర్చుని వీడుకోలు చెబుతున్నాం. అంతకుముందు రోజు అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. 'ఎప్పుడూ ఏడవని నాన్న నిన్ను వదిలివెళుతున్నామని నిన్న వెక్కి వెక్కి ఏడ్చారు, నువ్వు ఏ మాత్రం బెంగ పడుతున్నావని తెలిసినా తట్టుకోలేరు, నువ్వు ధైర్యంగా మాకు వీడ్కోలు చెప్పాలి '. కాని మరో ఆరు నెలల దాకా వారిని చూసేది లేదు అని అనుకున్న ప్రతి సారి దుఃఖం తన్నుకుని కన్నీళ్ళ రూపంలో వచ్చేస్తోంది. కళ్ళల్లోకి వచ్చిన నీరు కిందకు జారకుండా ఆపడానికి నా శక్తంతా కూడదీసుకోవలసి వచ్చింది. అమ్మా వాళ్ళు బయలుదేరడంతో ఇద్దరం ధారగా కారుతున్న కన్నీటిని తుడిచే ప్రయత్నమైనా చేయకుండా హాస్టల్ లోకి పరిగెత్తాం. ఇద్దరివీ పక్క పక్క గదులే. నేను గదిలోకి వెళ్ళి కరువు తీరా ఏడ్చాను. ఎంత ఆలోచించకూడదనుకున్నా ఇక అమ్మానాన్నలను చూసేది ఆరునెలలకొకసారి మాత్రమే, చదువు అవ్వంగానే ఉద్యోగం, తర్వాత పెళ్ళి , ఇంక వాళ్ళ దగ్గరుండే అదృష్టం, అవకాశం ఉండవు అన్న సత్యం మరీ మరీ ఏడిపిస్తోంది. ఇంతలో నా గది తలుపు ఎవరో తట్టినట్టుంటే కళ్ళు తుడుచుకుని వెళ్ళి తీసా. తనే! లోపలికి వచ్చింది మాట్లాడకుండా. తన మొహం చూసా. అసలే తెల్లని మొహమేమో ఏడ్చి ఏడ్చి కళ్ళు ఉబ్బిపోయి, మొహం కందిపోయింది. నా మటుకు నేనే బాధలో ఉన్నా తనను చూసి జాలేసింది. ఏవో సామాన్లు కొనడానికి కలిసి బయటకు వెళ్ళాం.

తర్వాత ఎవరికి ఉత్తరం వచ్చినా పక్కవారికి చూపించి, ఉత్తరాల్లో ఆ అక్షరాలు తడిమి అమ్మానాన్నలను చూసినట్టు ఆనందపడేవాళ్ళం. రోజులు గడుస్తున్న కొద్దీ మాకు తెలియకుండానే మా బంధం దృఢపడింది. మాకు ఇంకొంతమంది స్నేహితులయ్యారు. మొత్తం పదిమందిమి కలిసికట్టుగా ఒకరి కష్టసుఖాలను మిగిలిన వాళ్ళు పంచుకుంటూ ఉండేవాళ్ళం. ఎంతమందిలో ఉన్నా పక్కన తనుందంటే అదో ధీమా, ధైర్యం. ఫలానా పరిస్థితిలో నేనేలా స్పందిస్తాను, ఎలా ఆలోచిస్తాను, ఏం నిర్ణయం తీసుకుంటాను అనేది తనకు, అలాగే తన విషయంలో నాకు ఇట్టే తెలిసిపోయేది. బహిఃప్రాణం అంటారు చూడండీ, అచ్చంగా నాకు తను అదే. బాధలో ఉన్నప్పుడు ఒకరినొకరం ఓదార్చుకోవడానికి మాకు మాటలక్కర్లేదు, ఒకరి సామీప్యమొకరికుంటే చాలు. దగ్గరకొచ్చి ఒక పావుగంట కూర్చుంటే చాలు ఎంతో ఉపశమనం పొందినట్టుగా ఉండేది. దయ్యం సినిమా చూసిన ప్రతీ రాత్రి నా పడక తన గదిలోనే. నిద్రపోకుండా గంటల తరబడి జీవితం గురించి, భవిష్యత్ గురించి, ఏదో ఓదాని గురించి మాట్లాడుకునేవాళ్ళం. అలా ఎన్నో మధురమైన జ్ఞాపకాలతో ఆడుతూ పాడుతూ మా చదువు పూర్తి చేసాం.

అదృష్టవశాత్తు ఇద్దరికీ ఒకే కంపెనీలో ఉద్యోగం. ఎంతో సంతోషించాం కాని తర్వాత తెలిసిందేమిటంటే వేరే వేరే ప్రదేశాలలో పోస్టింగ్. నాకు బెంగుళూరు, తనకు హైదరాబాద్. ఏముందిలే ఫోన్లు చేసుకుంటూ, ఉత్తరాలు రాసుకుంటూ ఉండలేమా అనుకున్నా..కాని కొన్ని రోజుల్లోనే నాకు తన లోటు బాగా తెలిసొచ్చింది. ఏ పుస్తకం చూసినా, ఏ సినిమా చూసినా, ఏ పని చేసినా తనతో చర్చించనిదే స్థిమితం ఉండేది కాదు, ఏ పనిలోనూ ఆనందం లేదు. నా పై అధికారులకు అర్జీలు పెట్టుకుని, దేవుడికి మొక్కులు మొక్కుకుని ఎలాగైతేనేం, హైదరాబాద్ కు బదిలీ సంపాదించా. ఇకనే ఇద్దరం మహోత్సాహం తో ఇళ్ళ వేట మొదలుపెట్టాం. మెహదీపట్నంలో ఒక మాంచి ఇల్లు దొరికింది, ఒక గది : అదే హాలు, అదే పడక గది, అదే వంట గది, అటాచ్డ్ బాత్. ఇంకేం కావాలి? మనసులు విశాలమై ఉన్నప్పుడు ఇరుకు గదులు కూడా అందంగా కనిపిస్తాయి. మళ్ళీ జీవితంలో హ్యాపీ డేస్ మొదలు. పొద్దున్న లేవడం, ఇష్టమైతే వండుకోవడం, లేదంటే ఆఫీస్ లో తినడం, సాయంత్రం వచ్చి ఇద్దరికీ నచ్చిన పాత సినిమాలను చూస్తూ కూర్చోవడం. వారాంతాల సంగతి చెప్పనే అక్కర్లేదు. మా స్నేహం మొదలైన దగ్గరనుంచీ మాకు భేదాభిప్రాయాలే రాలేదంటే నమ్మండి.

కాని సవాళ్ళు ఎదుర్కున్నప్పుడే మనిషైనా, బంధమైనా దృడమయ్యేది. మా స్నేహానికి మొదటి పరీక్ష ఎదురయ్యింది. తనకు పెళ్ళి కుదిరింది. ఇంకో సంతోషకరమైన వార్త ఏమిటంటే తను చేసుకోబోయేది స్వయానా మా చిన్నాన్నగారబ్బాయినే. నా ఆనందానికి అవధులు లేకపోయాయి. కాని ఆ సంతోషం అట్టే కాలం అలాగే నిలవలేదు. అప్పటి దాకా తన సమయమంతా నాది, నా చెవి తినే హక్కు తనది. ఇప్పుడు నాకివ్వడానికి తన దగ్గర టైమే లేకపోయింది. పొద్దున్న లేవడమే ఫోన్ కాల్ తో, అప్పుడు పట్టుకున్న ఫోన్ ఎప్పుడు వదిలేదీ నాకు తెలిసేదే కాదు. ఎందుకంటే నేను పడుకునే సమయానికి ఇంకా తను మాట్లాడుతూనే ఉండేది.

నాకు ఎక్కడ లేని కోపం వచ్చేది. అన్నయ్య మీద అసూయ, ఆగ్రహం కలిగేవి. తనతో రోజుల తరబడి మాట్లాడేదాన్ని కాదు. పాపం ఇద్దరి మధ్య తను నలిగిపోయేది. తన బాధ నాకు వివరించడానికి ప్రయత్నించేది, నేను వింటేగా! ఎందుకంత సేపు మాట్లాడాలి నాకు అర్ధమయ్యేది కాదు. నేనేక్కువా అన్నయ్యెక్కువా అని అడిగేదాన్ని. అప్పటి నా మూర్ఖత్వం తలుచుకుంటే ఇప్పుడు నవ్వొస్తోంది. అలా నేను తనను చాలా బాధపెట్టా. కాలక్రమేణా నాకు పెళ్ళయ్యింది. ఎందుకు మాట్లాడాలో అప్పుడు అర్ధమయ్యింది :-)

ఇప్పుడు తను ఒక బిడ్డకు తల్లి కూడా. నా బహిఃప్రాణం మరో చిన్ని ప్రాణానికి జన్మనిచ్చింది. మా స్నేహం బాలారిష్టాలన్నిటినీ దాటుకుని స్థిరంగా నిలుచుంది. త్వరలోనే తను అమెరికాకు ప్రయాణమౌతోంది. దూరం కాని, మరొకటి ఏదైనా కాని ఇప్పుడు మమ్మల్ని విడదీయలేదు.

ఈ స్నేహితుల దినోత్సవం సందర్భంగా నా ప్రాణ స్నేహితురాలికి శుభాకాంక్షలు. నేను చేసిన తప్పుకు బ్లాగ్ముఖంగా తనకు క్షమాపణలు.

అలాగే నా స్నేహితులందరికీ, బ్లాగ్మిత్రులందిరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.

2 కామెంట్‌లు: