4, ఆగస్టు 2010, బుధవారం

మామిడి తాండ్ర - భీషణ ప్రతిజ్ఞ

ఆ వేసవి మధ్యాహ్నం నేను, మా అన్నయ్య డాబా మెట్ల మీద కూర్చుని ఉన్నాం. మా ఎదురుంగా నోరూరించే నూజివీడు రసాలు నాలుగు. మా ఇద్దరి మొహాలు ఎర్రగా ఉన్నాయి. అవి పగతో ప్రతీకారంతో రగిలిపోతున్న మా మనస్సులను ప్రతిబింబిస్తున్నాయి. దానికి కారణం క్రితం రోజు సాయంత్రం డాబా మీద మాకు జరిగిన అవమానమే..
ఓ పద్దెనిమిది గంటలు వెనక్కి వెళ్తే..


సెలవులకని మా పక్కింటి బుజ్జి గాడింటికి వాళ్ళ బాబాయి వాళ్ళు ఏల రావలె?
వచ్చితిరిపో ఉత్త చేతులతో రాక మామిడి తాండ్రను ఏల తేవలె?
తెచ్చితిరిపో వాడు డాబా పైకి వచ్చి మేము చూస్తుండగా, మాకు పెట్టకుండా ఏల తినవలె?
తినెనుపో మమ్మల్ని చూసి ఊరూరుట్ట అని ఏల అనవలె?


అహో ఇది భరించలేని అవమానం, అది తట్టుకోలేని మా చిన్ని హృదయాలు ఏ నిముషంలో ఐనా బద్దలయ్యే అగ్ని పర్వతాల్లా కుతకుతమంటున్నాయి..అప్పుడే ప్రతిజ్ఞ చేసుకున్నాము..ఎలా ఐనా మామిడి తాండ్రను తయారు చేసి, బుజ్జి గాడి తాండ్ర అయిపోయే దాకా ఆగి, అప్పుడు మా తాండ్రను తీసి వాడ్ని ఊరిస్తూ తినాలని..

ఆ రోజు రాత్రి నూటముప్పయ్యోసారి నాన్నగారికి మరుసటిరోజు పొద్దున్న మామిడిపండ్లు తేవాలని గుర్తు చేసి పడుకున్నాం. ఆ రాత్రంతా తాండ్రను గురించిన కలలే!! మేము కష్టపడి చేసిన తాండ్రను బుజ్జిగాడు దొంగతనంగా తినేసినట్టు నాకు కల వస్తే, వాడి తాండ్రను మేము దొంగలించి తెచ్చినట్టు అన్నయ్యకు కల వచ్చింది. పొద్దున్న కోడి కూయక ముందే నిద్ర లేచి నాన్నగారిని లేపి అప్పటికి బజారు తెరవరని ఆయన చెబుతున్నా వినకుండా సంచీ చేతికిచ్చి ఆయన్ను పంపించి, నాన్నారు కోసం ఎదురు చూస్తూ వీధి గుమ్మానికి చెరో వైపు కూర్చున్నాం.

మనం ఎదురు చూస్తున్నప్పుడే కాలం పగబట్టిన దానిలా మరింత మెల్లిగా సాగుతుంది. అప్పటికీ అన్నయ్య లోపలికి వెళ్ళి మా గడియారంలో చిన్న ముల్లును రెండంకెలు ముందుకు జరిపాడు కూడా. అయిన ఫలితం లేకపోయింది. మా సుదీర్ఘ నిరీక్షణ తర్వాత నాన్న గారు రెండు సంచులతో వీధిలోకి అడుగుపెట్టారు.. మేము పరిగేట్టుకుని వెళ్ళి ఆయన్ను అక్కడే ఆపి, సంచీలు దించి, మాకు కావలసినవి అందులో ఉన్నాయని రూఢి చేసుకున్నాక ఇంటికి రానిచ్చాం. ఇంటికి రాగానే పండ్ల మీదకు పడబోయేసరికి అమ్మ ఆపి, భోజనం చేసాకే ఏదైనా అని, మా ఉత్సాహానికి బ్రేకులు వేసింది. పైకి తన్నుకొస్తున్న కోపంతో కూడిన కన్నీళ్ళను లోపలికి నెట్టి, పండ్లకేసి ఆశగా చూస్తూ, వంట ఎప్పుడౌతుందా అని చకోర పక్షుల్లా ఎదురు చూస్తూ కూర్చున్నాం. వంట అయీ అవ్వడంతోనే కంచాలు తెచ్చేసుకుని అమ్మ ఏది పెడితే అది గబగబా తినేసి ఒలంపిక్స్ లో గెలుచుకున్న బంగారు పతకం పట్టుకున్నంత అపురూపంగా మామిడి పండ్లను పట్టుకుని మెట్ల మీదకు చేరాము..

అవే ఇప్పుడు మా కళ్ళ ముందున్నాయి. ఆ రసాలను చూస్తూనే అమాంతంగా నోట్లో వేసుకుని గుటుక్కుమనిపించాలని బలంగా అనిపిస్తున్నా మా ప్రతిజ్ఞను ఒకరికి ఒకరం గుర్తు చేసుకుంటూ బలవంతం మీద నిగ్రహించుకున్నాం. మామిడి పండ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా కావలసినవి ఏంటి? అవి దొరికాక తాండ్రను ఎలా చేయాలి..అవి మా ముందున్న ప్రశ్నలు..కాని మా అన్నయ్య ఉన్నాడే!! తనకు తెలియంది లేదు (అని అనుకునేదాన్ని అప్పట్లో). ఏది చెప్పినా అది నిజం, అదే నిజం, అది మాత్రమే నిజం అనుకునేలా చెప్తాడు. అప్పట్లో వచ్చే బూస్ట్ ఏడ్ చూపించి సునీల్ గవాస్కర్ కొడుకు సచిన్ టెండుల్కర్ అని చెప్పాడు. అదే నిజమని చాలా కాలం నమ్మాను కూడా. అది పక్కన పెడితే కర్తవ్యం తెలియక కంగారు పడుతున్న నా భుజం మీద చెయ్యి వేసి, 'పిచ్చిదానా ఎంటీవోడంతటి అన్నయ్య నీకుండగా నీకేల బెంగ ' అన్నట్లు ఒక నవ్వు నవ్వి, 'నాకు తాండ్ర ఎలా చేయాలో తెల్సు. ఏముంది ముందు మామిడి పండ్ల రసం తీసి, దాన్లో ఒక కేజీ ఓ పది కేజీలో పంచదార పోసి మిక్సీలో పావుగంట తిప్పి కంచంలో ఆరబోసి ఎండలో నాలుగు రోజులు పెడితే నోట్లో వెన్నలా కరిగిపోయే తాండ్ర రెడీ' అని నాకు ధైర్యం చెప్పాడు.

మరుసటి రోజు అమ్మానాన్న ఆఫీసుకు వెళ్ళేదాక గోతి కాడ నక్కల్లా ఎదురుచూసి, వాళ్ళు వెళ్ళడమేమిటి మా ప్రయోగం మొదలుపెట్టాం. మిక్సీ చేసాక పళ్ళెంలో ఆ రసాన్ని పోసి, దాని వైపు ఆశగా చూస్తూ 'మామిడి వంటి పండుయు..' అని అశువుగా కవిత్వం చెప్పబోతూంటే 'తాండ్ర వంటి స్వీటుయు..' అని అన్నయ్య అందుకున్నాడు. ఆ పళ్ళాన్ని మేడ మీద ఎండబెట్టి దాన్నే చూస్తూ కూర్చున్నాం. మాలో ఏ ఒక్కరు మంచి నీళ్ళ కోసమో, మరో దాని కోసమో కిందకు దిగినా తక్కిన వాళ్ళు వెంట వెళ్ళాల్సిందే, ఈలోగా ఇంకొకరు ఎక్కడ దాన్ని గుటకాయం స్వాహః చేస్తారేమో అన్న భయంతో. రాత్రుళ్ళు మాకు మాత్రమే తెలిసిన రహస్య ప్రదేశాల్లో దాస్తూ, పొద్దున్న రెప్ప వేయకుండా కాపలాలు కాస్తూ నాలుగు రోజులు గడిపాం. నాలుగో రోజు 'ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి..' అని పాడుకుంటూ మా స్వహస్తాలతో చేసుకున్న ఆ అమృతాన్ని మా మధ్యలో ఉంచుకుని ఒకొక్క ముక్క నోట్లో వేసుకున్నాం. వెంటనే ఒకరి మొహంలోకి ఒకరం చూసుకున్నాం, మా మొహాల్లో రంగులు మారాయి. కాజాలో మాగాయి ముక్క పెట్టుకుని దాన్ని సాస్ లో ముంచుకుని తింటే ఎలా ఉంటుందో దాని కన్నా అధ్వానంగా ఉంది మా వంటకం. ఎంతైనా మేము చేసుకున్నది కదా, పారెయ్యడానికి చేతులు రాక మరో రెండు ముక్కలు నోట్లో వేసుకోవడానికి ప్రయత్నించాం. ఊహు! వల్ల కాలేదు. గుడ్ల నీరు కక్కుకుంటూ మా అమృతాన్ని, మా పంచదార గుళికను, మా వజ్రాల తునకను కాలువలో జారవిడిచాం. ఆ తర్వాత కరువు తీరా ఏడ్చి, అమ్మ రాకముందే మొహాలు కడుకున్ని కూర్చున్నాం. ఆ రాత్రి ఒకటే వాంతులు. 'ఏం తిన్నార్రా' అని అమ్మ అడిగితే నోరు మెదిపితేనా. ఎలా చెప్తాం! తేలు కుట్టిన దొంగలం కదా!!

6 కామెంట్‌లు:

  1. "మనం ఎదురు చూస్తున్నప్పుడే కాలం పగబట్టిన దానిలా మరింత మెల్లిగా సాగుతుంది" - ఇది నిజంగా నిజం

    "సునీల్ గవాస్కర్ కొడుకు సచిన్ టెండుల్కర్ అని చెప్పాడు. అదే నిజమని చాలా కాలం నమ్మాను కూడా"
    అప్పట్లో వెస్ట్ ఇండీస్ టీం లో రిచర్డ్స్, రిచర్డ్సన్ అని ఇద్దరు ఉండేవాళ్ళు. నేను కూడా రిచర్డ్స్ కొడుకే రిచర్డ్సన్ అని బలంగా నమ్మేవాడ్ని

    "కాజాలో మాగాయి ముక్క పెట్టుకుని దాన్ని సాస్ లో ముంచుకుని తింటే ఎలా ఉంటుందో " - ఉపమానం కేక

    మొత్తం మీద మీ "తాండ్ర" పాపారాయ ప్రహసనం భలే ఉంది

    రిప్లయితొలగించండి
  2. హ హ .. బాగుంది మీ తాండ్ర తయారీ .. కడుపుబ్బా నవ్వుకొన్నా :D
    కానీ అంత పెద్ద రహస్యం ఐన ఆ తయారీ విధానాన్ని ఇలా పబ్లిక్ గా అందరికీ చెప్పేసావేంటి ? అర్జెంటుగా దానికి ఏ పేటేంటో అప్లయి చేసెయ్యి .. లేకపోతే చదివిన వాళ్ళు అందరు కాజేసి వాళ్ళే కనిపెట్టాం అని క్రెడిట్ కొట్టేయ్యరూ ? జాగర్త అమ్మా !! :D

    ~లహరి

    రిప్లయితొలగించండి
  3. hello ... aa sadaru annayya ni nene....
    evarikaina ice cream cheyyalante chppandi.... oka 10 packets paalu, oka family pack icecream pattukuni maa intiki vaccheyyandi... nenu oka chinna cup ice cream theyaru chesi istha...

    రిప్లయితొలగించండి
  4. @Shanky
    రిచర్డ్స్ కొడుకు రిచర్డ్'సన్ ' అనుకున్నారా? భలే వారే!!
    నా బ్లాగులో మీ వ్యాఖ్యకు ధన్యవాదాలండి!

    @లహరి..
    అయ్యయ్యో! ఇప్పటికే డేమేజీ జరిగిపోయి ఉంటుంది! :-(
    ఈ సారి ఇలాంటివి చెప్పినప్పుడు ముందుగా మీ సలహా తీసుకుంటాలెండి.

    @అన్నయ్య
    నీ సంగతి ఇంత బాగా చెప్పిన తర్వాత కూడా నీ దగ్గరకు ఎవరైనా వస్తారా?

    రిప్లయితొలగించండి
  5. chaala baagundi idi kooda.......

    @kranthi gaaru
    nenu vastanu mari........nerpinchandi.....

    రిప్లయితొలగించండి
  6. నిజంగా మామిడితాండ్ర తయారీ చూస్తె మాత్రం మీరు మళ్ళీ దానిని తినలేరండీ.. టపా బాగుంది..

    రిప్లయితొలగించండి