10, ఆగస్టు 2010, మంగళవారం

కిరాణా/బడ్డీ కొట్టు - చిరుతిండి మహోత్సవం

కిరాణా కొట్టు మీద రాసేది ఏముంటుందనుకుంటున్నారా? అబ్బో! చాలానే ఉంటుందండీ! ఇప్పుడైతే సూపర్ మార్కెట్లు, హైపర్ మార్కెట్లు రాజ్యమేలుతున్నాయి కాని చిన్నతనంలో వీధిలో ఉండే బడ్డీ కొట్టే మెగా స్టోరు, సూపర్ స్టోరూను. వైశాల్యంలో కాని, ఆకర్షణలో కాని మరెందులోనూ సూపర్ మార్కెట్లతో పోటి పడలేని చిన్న కిరాణా కొట్లలో దొరకని వస్తువే ఉండదు. ఏమడిగినా ఏదో ఒక మూల నుంచి ఇట్టే తీసివ్వడం చూస్తే అది కిరాణా కొట్టా కల్పవృక్షమా అని సందేహం కలగకమానదు.

చిన్నప్పుడు ఏ చింతపండో, బంగాళా దుంపలో తేవడానికి అమ్మ వీధి చివర కిరాణాకొట్టుకు పంపడంతో మొదలయ్యింది కిరాణాకొట్ల మీద నాకు ప్రేమ. ఎక్కడికెళ్ళినా జంటకవుల్లా అన్నయ్యా నేను కలిసే వెళ్ళే వాళ్ళం. కొట్లో సరుకులు కొన్న ప్రతీ సారీ ఏదో ఒకటి 'కొసరు ' అడిగి తీసుకోవడం మా ఆనవాయితీ. అది బెల్లం ముక్కో, పటిక బెల్లమో, బోడిశెనగ పప్పో ఏదైనా కావొచ్చు. అవి ఇంట్లో దొరకవని కాదు కొట్లో అడిగి సాధిస్తే అదో సంబరం.

ఇంకాస్త పెద్దయ్యేసరికి మేము అప్పట్లో ఉండే ఇంటికి నాలుగంగల దూరంలో రెండు బడ్డీ కొట్లు ఉండేవి. నా స్నేహితుని నాన్న గారు అక్కడుండే జంట కొట్లలో ఒకదాని యజమాని. మేము ఆ అబ్బాయిని చూసి ఎంతగా కుళ్ళుకునేవాళ్ళమో! ఎంచగ్గా తనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళ నాన్ననడిగి చాక్లేటో బిస్కట్టో గుటుక్కుమనిపించచ్చు. ఒక్కోసారి ఆయన ఆ అబ్బాయిని కొట్లో కూర్చోపెట్టి భోజనానికి వెళ్ళేవారు. ఆహా! అప్పుడైతే మాకు వాడి స్థానంలో పరకాయ ప్రవేశం చేయగలిగితే ఎంత బాగుణ్ణో అనిపించేది. పెద్దయ్యాక ఎలా అయినా ఒక బడ్డీ కొట్టుకి యజమాని కావడమే నా జీవితాశయమని అప్పుడే గట్టిగా నిర్ణయించేసుకున్నా.

ఆ జంట కొట్లలో రెండో దానిలో ఐతే మరీనూ మనకు కావలసిన, నోరూరించే సామాన్లు చాలానే ఉండేవి. నిమ్మ తొనలు,నాన్ కతాలు,కప్పు కేకులు, రెండు వైపులా జాము రాసి పెట్టి అమ్మే బన్నులు, చేగోడీలు ఇలా ఎన్నెన్నో! ఎప్పుడైనా నాన్నతో కొట్టుకు వెళ్ళినప్పుడు ఏదైనా కొనమంటే కొనేవారు కాని ఇవన్నీ మాయాబజార్ లో ఘటోత్కచుడిలా ముందేసుకుని ఒకదాని తర్వాత ఒకటి తినగలిగితే ఎంత బాగుంటుందో కదా అనిపించేది. మంచి ముహూర్తం చూసుకుని ఈ మహత్తరమైన ఆలోచనను అమలులో పెడదామని అన్నయ్యకు చెప్తే ఆ ఊహకే లాలాజలం ఊరి ఆ ప్రాజెక్టులో పాల్గొనడానికి సరేనన్నాడు.

సరే ఇద్దరే ఐతే ఈ బృహత్తర కార్యక్రమానికి నిధులు సేకరించడం కష్టం కనుక మా పక్కింటి శ్రీలతను కూడా జట్టులో కలుపుకున్నాం. ఇలాంటి చిరుతిండి మహోత్సవంలో ఇంకొకరికి భాగం పంచడం అర్ధ సింహాసనం పంచడమంతటి త్యాగమే ఐనా ఉత్సవం జరపడానికి కావలసిన ముడిసరుకు లత నుంచి వచ్చే అవకాశమే ఎక్కువ (ఎందుకంటే లతకు బామ్మ ఉంది, మాకు లేదు) కనుక తప్పలేదు. ఇహ మొదలయ్యింది మా డబ్బు సంపాదన పర్వం. లత వాళ్ళ బామ్మ దగ్గరకెళ్ళి దెబ్బ తగిలిందనో, అమ్మ కొట్టిందనో కొళాయి విప్పితే ట్రిప్పుకొక పావలా నుంచి అర్ధ వరకు రాలేవి. అమ్మ సామాన్లకని కొట్టుకు పంపితే అక్కడ కొద్దిగా చిల్లర మిగిలితే, అమ్మ మంచి మూడ్లో ఉంటే, ఆ చిల్లర మా జేబుల్లో చేరేది. ఇంక నాన్న హుషారుగా ఉన్నప్పుడు యూనిట్ టెస్టు మార్కులు చూపించి ఒక అర్ధ రూపాయి దాకా రాబట్టేవాళ్ళం. ఈ తరహా సంపాదన మటుకు నాకొక్కదానికే. అన్నయ్య మార్కులు చూపితే తన్నులే తప్ప డబ్బులు రాలే ప్రసక్తే లేదు. ఇలా ఒక రెండు నెలలు పైగా కష్టపడి పైసా పైసా దాచి ఒక పది రూపాయల దాక కూడబెట్టినట్టు గుర్తు.

ఇంక కూడపెట్టినది చాలని చిరు తిండి మహోత్సవం జరపడానికి సిద్దమయిపోయాము. ఒక ఆదివారం సాయంత్రం ముగ్గురం బయల్దేరి కొట్టుకి వెళ్ళి నాన్ కతాలు , నిమ్మ తొనలు, 15 పై చాక్లెట్లు, కేకులు, సందు చివర బండీ వాడి దగ్గర రెండు రూపాయల పకోడీలు తీసుకున్నాం. గోళీ సోడా అని ముందుగా అనుకున్నా బడ్జెట్ అనుమతించడంతో ఒక చెంబు తీసుకెళ్ళి రెండు రూపాయల ద్రాక్ష షర్బత్ తెచ్చుకున్నాం. ఇవన్నీ లత వాళ్ళ పెరట్లోకి తీసుకెళ్ళి అన్నీ ముందు పెట్టుకుని 'వివాహ భోజనంబు ఇంపైన వంటకంబు..' అని పాడుకుంటూ తింటూంటే కదా స్వర్గానికి ఒక మెట్టు దూరానికి వెళ్ళిపోయామంటే నమ్మండి.



8 కామెంట్‌లు:

  1. superb post ...chinnappudu chesinivi gurthu techukonte ippudu navvu raka manadu.

    రిప్లయితొలగించండి
  2. sivaprasad nidamanuri గారు,
    ధన్యవాదాలండి! ఔను, చిన్ననాటి ముచ్చట్లు తల్చుకుంటే భలే నవ్వొస్తుంది
    :-)

    word verfication తీసేసా.

    రిప్లయితొలగించండి
  3. చాల బాగుందికదు... చిన్ననాటి సంగతులు . రాత్రి పడుకొనే ముందు తాతలు చెప్పే రాజకుమారుల కథలు... దెయ్యాల సంగతులు... సార్ కి చెప్పేచాడీలు ...నేరేదికాయలు...మామిడికాయల దొంగతనం ....వహ్ చెప్పుకుంటే ఎంతో ఉంది.పిచు మిటై కోసం ఏడుపులు... నావల్ల ఇంకకాదు.ఎంతని చెప్పాను.

    రిప్లయితొలగించండి
  4. సూరి గారూ,
    ఎంత చెప్పినా సరిపోదండీ! ఓ పని చెయ్యండి, మీరు కూడా ఒక టపా వేసెయ్యండి

    రిప్లయితొలగించండి
  5. వినయ్ గారూ, ఓపిగ్గా అన్ని టపాలు చదివి మీ అభిప్రాయం పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలండీ

    రిప్లయితొలగించండి
  6. చాలా చాలా బాగుందండీ.. చివర్లో ఏదన్నా ట్విస్ట్ ఉంటుందనుకున్నా.. (నా జాతకంలో ట్విస్ట్లు ఎక్కువ లెండి).. కానీ మీ 'చిరు' కోరిక తీర్చుకున్నందుకు ఆలస్యంగా అభినందనలు..

    రిప్లయితొలగించండి