26, జులై 2010, సోమవారం

రక్త చరిత్ర

టపా పేరు చూసి ఇదేదో రాంగోపాల్ వర్మ సినిమా గురించి అనుకునేరు. రక్తంతో రంగరించిన నా అనుభవాల కథే ఈ రక్త చరిత్ర . రక్తంతో నాకు చాలానే అనుభవాలు ఉన్నా ముఖ్యంగా రెండు సంఘటనలు మటుకు చెప్తాను

సీన్-1:
అది మా కాలేజీలో రక్తదానశిబిరం జరుగుతున్న ప్రదేశం. నా స్నేహితులంతా చిరంజీవి సినిమా మొదటి ఆట టికెట్ల కోసం ఎగబడినట్లు పోటీపడి మరీ రక్తదానం చెయ్యడానికి వెళ్తున్నారు. వారందరికీ మోటివేషన్ : రక్తం ఇచ్చే ప్రతీ వారికి ఒక ఫ్రూటి, ఒక బిస్కట్ల పాకెట్ ఇస్తున్నారనే వార్త. నేనేం తక్కువ తిన్నానా, నా యధాశక్తి నేనూ రక్తదానం చేద్దామని బయల్దేరాను. అసలు ఈ రక్తదానం చెయ్యలనే కోరిక ఈనాటిది కాదు. ఎప్పుడో స్కూల్లో చదువుతున్నప్పటినుంచి అనుకుంటున్నా, స్కూల్లో ఆడుతున్నప్పుడు పక్కవాడి రక్తం కళ్ళజూడడమే తప్ప నా రక్తం ఇచ్చే అవకాశం ఎప్పుడూ కలగలేదు.

రక్తం ఇస్తానంటే 'నీ మొహం! నీకు రక్తం చూస్తేనే కళ్ళు తిరుగుతాయి ఇవ్వడం కూడానా' అని నిరుత్సాహపరిచే అమ్మానాన్నలకు దూరంగా హాస్టల్లో ఉన్నందువల్ల, ఇక్కడ మనం విచ్చలవిడిగా రక్తం ఇచ్చేసుకోవచ్చు అని సంతోషపడుతూ శిబిరం దగ్గరకు వెళ్ళా. అక్కడి నిర్వాహకులు 'ప్రస్తుతం మేము పెట్టినది రక్తం తీసుకునే శిబిరం, ఇచ్చే శిబిరం పెట్టినప్పుడు నీకు కబురు పంపుతాము ' అని మర్యాదగా చెప్పారు, నా పర్సనాలిటీని చూసి. ఈ అవమానానికి నా రక్తం వెచ్చబడింది, కళ్ళు ఎర్రబడ్డాయి. 'రక్తం ఇవ్వడానికి కావల్సిన అర్హతలు అన్నీ నాకు ఉన్నాయి (కనీస బరువు 45 కేజీలు - మనం సరిగ్గా 45 ఉన్నామప్పుడు), నా రక్తం ఎందుకు తీసుకోరు, ఇది మానవ హక్కుల ఉల్లంఘన ' అని వారితో పెద్ద యుద్దమే చేసి వాళ్ళు లొంగకపోతే, ఆనక బ్రతిమాలి బుజ్జగించి ఎలాగైతేనేం నా రక్తం తీసుకోవడానికి ఒప్పించా.
రక్తం తీసుకునేముందు సూదిని వేలులోకి గుచ్చి ఒక చుక్క రక్తం పరీక్షకు తీసుకుని, అనీమికో కాదో చూసి, బ్లడ్ గ్రూపు నిర్ధారించుకుని తీసుకోవడం పరిపాటు. దాని కోసం ఒక వాలంటీరు పక్కనే ఉన్నాడు.

రక్తం ఇవ్వడానికి పేద్ద యుద్దమైతే చేసా కాని మనకు రక్తం చూస్తేనే బెదురు. వాలంటీరు ఆ సూదిని నా వేలులోకి పొడిచి చిత్రహింసలు పెట్టడానికి సిద్దంగా ఉన్నాడు. బలికి తనంతట తనే పోయే గొర్రెపిల్లలా నేను వెళ్ళి అక్కడ నిల్చుని నా సున్నితమైన వేలుని ఆ కర్కశమైన చేతుల్లో పెట్టా. సూది దగ్గరగా రావడం, నేను చేతిని వెనక్కు లాక్కోవడం ఇదే తంతు ఒక పది నిముషాల పాటు జరిగింది. ఇంక లాభం లేదని అక్కడ ఉన్న వాలంటీర్లు అంతా కలిసి నన్ను పట్టుకుని నా వేలును ముందుకు తోసారు. సూది నా వేలులోకి దిగడం వరకు గుర్తుంది.ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు. నాకు మెలకువ వచ్చి కళ్ళు తెరచి చూసేసరికి నేను ఒక బెడ్ మీద పడుక్కుని ఉన్నా. నా చుట్టూ నా స్నేహితులంతా ఏడుపు నవ్వు కలిపిన మొహాలతో, డబ్ చేసిన అరవ సినిమాలోని కామెడీ అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించే ప్రేక్షకుల్లా నిల్చుని ఉన్నారు. నేను కళ్ళు తెరచి చూసేసరికి ఆనందం పట్టలేక, ఇటుపక్క, అటుపక్క రక్తదానం చేసిన వాళ్ళ దగ్గర పెట్టిన బిస్కెట్లు, ఫ్రూటి స్మగుల్ చేసి నాకిచ్చారు. అవి తిని, తాగి మూడు రోజులు బెడ్ రెస్టు తీసుకుంటే కాని మామూలు మనిషిని కాలేకపోయా. ఇక ఆ దెబ్బకు మరి రక్తదానం చెయ్యాలనే పైత్యపు ఆలోచనలు దగ్గరకు రానియ్యకుండా జాగ్రత్తగా ఉంటూ వచ్చా. మరొకసారి నా రక్తం ఇవ్వాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. కాని మనం అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే అది తెలుగు సినిమా అవుతుంది కాని జీవితం ఎలా అవుతుంది?

సీన్-2
జీవితం ఎలాంటి ఒడిదుడుకులూ లేకుండా హాయిగా గడిచిపోతోంది. మా ఆఫీసులో మా టీం తరుపున విదేశంలో పనిచెయ్యడానికి నన్ను ఎంపిక చేసారు. వెళ్ళవలసినది నా కలల దేశమైన స్విట్జెర్లాండ్ కి. ఆ విషయం తెలిసినప్పటి నుండి, నేను నేల మీద నిల్చోవడం మానేసా. 'గాల్లో తేలినట్టుందే..' అని పాడుకుంటూ మబ్బుల్లో షికారు కొడుతున్నా. నా ఆనందాన్ని చూసి సహించలేని మా టీమ్మేట్ నా ఆనందంపై నీళ్ళు జల్లుతూ ఒక పిడుగులాంటి వార్త చెప్పింది. 'యెస్ మీరు సరిగ్గానే ఊహించారు' అది విదేశాలకు వెళ్ళే ప్రతీ వారు మెడికల్ టెస్ట్ చేయించుకోవాలని, మెడికల్ టెస్ట్ లో భాగంగా బ్లడ్ టెస్ట్ చేస్తారని. అప్పటి దాకా మబ్బుల్లో తేలుతూ ఉన్న నేను ఆ మాట వినగానే జెట్ స్పీడుతో వచ్చి నేలపై దబ్బని పడ్డా. లేచి విరిగిన ఎముకలు లెక్కపెట్టుకుంటూ ఉంటే మా డేమేజర్, సారీ మేనేజర్ వచ్చి నేను రక్తపరీక్షకు వెళ్ళాల్సింది ఆ మర్నాడే అని మరొక బాంబు పేల్చాడు.

ఏం చేయాలి! ఈ ఆపద నుండి ఎలా గట్టెక్కాలి! వెళ్ళడం మానుకుంటేనో? ఛీ అందరి ముందర చులకనైపోతాం. ఇప్పటికే అడగనివాళ్ళకు అడిగినవాళ్ళకు మన ప్రయాణం గురించి చెప్పేసాం. సరే ఆసుపత్రిలో నర్సుకు ఒక వంద ఇచ్చి, వేరే ఎవరి రక్తమైనా మన రక్తంగా ఇప్పిస్తే? ఊహుం ఈ అవిడియా వర్కౌటు అయ్యేలా లేదు. పని జరక్కపోగా అసలుకే మోసం వస్తే ప్రమాదం. సరే ఏమైతే అయ్యిందని ఆ రోజు ఇంటికి వెళ్ళి పాతాలభైరవి సినిమా పెట్టుకుని చూసి, బ్రదర్ తోట రాముడు ఇచ్చిన స్పూర్తితో 'ధైర్యే సాహసే లక్ష్మి ' అనుకుని రక్తం ఇవ్వడానికే నిశ్చయించుకున్నా.

మరునాడు వర్జ్యం అదీ లేకుండా చూసి ఇంటినుండి బయలుదేరేవేళకు హిమేష్ రేషమ్మియా పాట పాడినట్టు ఆకాశవాణి వికృతంగా నవ్వింది. ఇదేం అపశకునం రా బాబూ అనుకుంటూ, అయినా కార్య సాధకులు ఇలాంటివి లెక్క చేయకూడదని ధైర్యంగా హాస్పిటల్లోకి అడుగుపెట్టా. లేని ఉత్సాహం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ కాల్గేట్ ఏడ్ లో సచిన్ లా 1000 వాట్ స్మైల్ ఇస్తూ రెసెప్షనిస్ట్ కి నా అపాయింట్మెంట్ గురించి చెప్పా.

ఆవిడ లోపల ఎవరో వున్నారు, వారు రాగానే పంపిస్తా అందాక కూర్చోమని చెప్పింది. నా వెనకే ఒకాయన ఒక చిన్న పిల్లతో వచ్చి కూర్చున్నాడు. ఆ పాప వాళ్ళ నాన్నను రక్త పరీక్ష గురించి ప్రశ్నలు అడుగుతోంది, రక్తం ఎలా తీస్తారు, తీసినప్పుడు నొప్పెడుతుందా, తీసేసాక నొప్పెడుతుందా అంటూ. అసలే ఆందోళనగా ఉన్నా, అది కనపడనీయకుండా డాంబికంగా కూర్చున్న నాకు ఆ మాటలు వింటుంటే బి.పి పెరిగిపోతోంది. అవి వినపడకూడదని నా సెల్ ఫోన్ తీసి రేడియో ఆన్ చేసా. 'నా రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రోలు..' అంటూ ఆర్.నారాయణమూర్తి గారు గోలపెడుతున్నారు. విధి పగబట్టింది అని పుస్తకాల్లో, కథల్లో చదువుతున్నప్పుడు అర్ధం కాలేదు, ఇప్పుడు తెల్సింది అనుకుంటూ రేడియో ఆఫ్ చెయ్యంగానే నాకు పిలుపు వచ్చింది. నా వెనకే ఆ పాప కూడా ఆ గదిలోకి వచ్చి వేరే టేబుల్ దగ్గర కూర్చుంది. నా చేయి ధీమాగా నర్సు చేతికి ఇవ్వడం చూపించి వాళ్ళ నాన్నగారు, 'అక్కను చూడు ఎలా భయపడకుండా ఉందో, నువ్వూ అలాగే ఉండాలి ' అంటూ పాపకు ధైర్యం చెప్తున్నారు. నేను కళ్ళు మూసుకుని, వాళ్ళ మాటలు వింటూ నాకు రక్తం తీస్తున్నారనే సంగతి మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నా. కాని కాసేపటికి నాకు వాళ్ళ మాటలు వినపడడం మానేసాయి. కళ్ళు తెరిచి చూసేసరికి నేను టేబుల్ పై తల పెట్టుకుని పడుకుని ఉన్నా. పోనిలే ఎదైతే ఏం, మొత్తానికి ఈ ప్రహసనం ముగిసింది అని ఆనందపడుతూ లేవబోయేసరికి నర్స్ వచ్చి, 'మేడం మీకింకా రక్తం తీయడం పూర్తి కాలేదు, మా సీసా ఎర్రబడిందో లేదో మీ కళ్ళు మూతలు పడి రెండు గంటల తర్వాత ఇప్పుడే లేచారు ' అంది. నా పరిస్థితే ఇలా ఉంటే, పాపం ఆ పాప పరిస్థితి ఎలా ఉందో అని విచారపడుతూ 'పాపను పక్క గదిలో పడుకోబెట్టారా' అని అడిగాను. 'పడుకోబెట్టడం ఏంటి ఆ పాప రక్తం ఇచ్చేసి, అక్కకు లేచాక టాటా చెప్పమని చెప్పి ఆడుతూ పాడుతూ ఎప్పుడో వెళ్ళిపోయింది ' అని చెప్పింది నర్సు. ఈ సంఘటన నా రిపోర్టులోకి రానివ్వద్దని నర్సును బ్రతిమాలుకుని, రక్తం ఇవ్వడానికి మరో మంచి ముహూర్తం చూసుకుని వస్తానని చెప్పి అక్కడి నుండి బయటపడ్డా.

9 కామెంట్‌లు:

  1. సుభగ గారు, భలే నవ్వించారు...చాలా బాగుంది మీ టపా...చాలా చక్కగా రాసారు..నాకు కూడా మెడికల్ టెస్టులు అంటే భయమే...నీడిల్ చూస్తేనే భయం..కానీ విచిత్రం ఏమిటంటే, మనం భయపడ్డంత నొప్పి ఉండదు గుచ్చాక...కానీ ఏంటో అలా...

    రిప్లయితొలగించండి
  2. చాలా బాగుందమ్మా నీ రక్త చరిత్ర!

    పది కాలాలపాటు ఇలాగే...............

    రిప్లయితొలగించండి
  3. రక్త చరిత్ర చాలా బాగుంది! వర్ణించే విధానం బాగా నవ్వు తెప్పించింది!
    దీనికి ఇంకో రెండు మూడు సన్నివేశాలు జత చేసే అవకాసం మీకు త్వరలోనే రావాలని ఆసిస్తూ (కొట్టద్దు మరి :p )
    -- లహరి

    రిప్లయితొలగించండి
  4. Mee raktha charitra maaku inspiration icchindi.. Raktham leni vallu kuda ledu ani baadha padakunda ila modalupedite lokam anta enta raktham tho nindi potundo kada......

    రిప్లయితొలగించండి
  5. @ Madhu గారు థాంక్సండి!!

    @ రామకృష్ణా రెడ్డి గారు, నెనర్లు..నిజమే సూది గుచ్చాక నొప్పి ఉండదు, చిన్నప్పుడు ఇంజెక్షన్ తీసుకోవడానికి భయపడుతుంటే నాన్న గారు చీమ కుట్టినట్టు ఉంటుంది అంతే అనేవారు.. కాని భయం అంతే, దానికి లాజిక్ ఉండదు

    @కృష్ణ శ్రీ గారు, ధన్యవాదాలండీ!
    పది కాలాలపాటు ఇలాగే.. రక్త దానం చేయమంటారా? టపాలు రాయమంటారా?

    రిప్లయితొలగించండి
  6. @ లహరి, అన్యాయం!! టపా పొడుగు పెంచడం కోసం నా జీవితంతో ఆడుకోమంటారా??

    @ అజ్ఞాత గారు, ఇంకేం మొదలుపెట్టేసెయ్యండి

    రిప్లయితొలగించండి
  7. భయం అంతే, దానికి లాజిక్ ఉండదు

    ee madhya alavaatu ayipoyindi.........

    రిప్లయితొలగించండి