16, జులై 2010, శుక్రవారం

ఓ బాటసారి నను మరువకోయి

మొదటి టపానే విషాదభరితమైన పాటతో మొదలుపెడుతున్నా..
కాని నేను బ్లాగ్ మొదలుపెట్టడానికి కారణమైన పాట ఇదే కాబట్టి, నేను వేరే పాటతో మొదలుపెట్టి దీనికి అన్యాయం చేయదల్చుకోలేదు..

ఈ పాట బాటసారి సినిమా లోనిది. క్లాస్ సినిమా కావడం మూలాన జనాలకు సరిగా రుచించక ఆ రోజుల్లో బాగా ఆడలేదట. కాని శరత్ బెంగాలీ నవల బడాదీదీ ఆధారంగా తీసిన ఈ సినిమా ఒక అద్భుతం, ప్రతీ పాట ఒక ఆణిముత్యమే.

చిన్నతనంలోనే భర్తను కోల్పోయిన మాధవి పుట్టింట్లోనే తల్లి లేని చెల్లెలు ఆలనా పాలనా చూస్తూ, తండ్రిని, అన్నను కనిపెట్టుకుని ఉంటుంది. సురేంద్ర జమిందారు మనవడు. పుస్తకజ్ఞానమే తప్ప లోకజ్ఞానం బొత్తిగా తెలియని వాడు. లోకజ్ఞానం సంపాదించటానికి స్నేహితుల ప్రోద్బలంతో ఇల్లు విడిచి మద్రాసు చేరుకుంటాడు. అక్కడ మాధవి చెల్లెలికి చదువు చెప్పే పని మీద అతనికి ఆశ్రయం దొరుకుతుంది.
వేళకు తినాలి, నిద్రపోవాలి అని కూడా తెలుసుకోలేని అమాయకుడైన అతని అవసరాలను చూస్తూ అతనికేం కావాలో అది అమర్చుతూ ఉంటుంది మాధవి. ఒకసారి పని మీద మాధవి ఊరు వెళ్ళాల్సి రావడంతో అతని అవసరాలను చూసే దిక్కు లేక తనకక్కడ ఏమీ బాగాలేదని వెంటనే రావలసిందని ఉత్తరం రాయిస్తాడు. అప్పటికే అతని నిర్మలత్వాన్ని, అమాయకత్వాన్ని అభిమానించే మాధవి పరుగున ఇల్లు చేరుకోవడం, పని వాళ్ళ లేని పోని అపోహలకు దారి తీస్తుంది. అవి చెవిన పడడంతో ఆ కోపం సురేన్ మాధవి మీద చూపడం అతను ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి కారణమౌతుంది.

తన మాటలనే కాని మనసును అర్థం చేసుకోలేని సురేన్ వెళ్ళిపోతే మాధవి పడే తపనను సముద్రాల రాఘవాచార్యులు గారు అద్భుతంగా మాటలలో పెడితే భానుమతి గారు అత్యంత హృద్యంగా పాడి ఈ పాటకు జీవం పోసారు. ఏ.ఎం.రాజా గారు సంగీతం అందించిన ఈ సినిమాకు పి.రామకృష్ణ గారు దర్శకత్వం వహించారు.

ఓ బాటసారి నను మరువకోయి
మజిలి ఎటైనా మనుమా సుఖాన

సమాజానికీ దైవానికీ బలియైతి నేను వెలియైతినే
వగే కాని నీపై పగ లేనిదాన
కడ మాటకైనా నే నోచుకోనా

శృతి చేసినావు ఈ మూగ వీణా
సుధా మాధురీ చవి చూపినావు
సదా మాసిపోని స్మృతే నాకు వీడి
మనోవీణ నీవు కొనిపోయెదోయి



ఈ సినిమా పాటలను చిమాటా మ్యూజిక్ ద్వారా వినవచ్చు
http://www.chimatamusic.com/telugu/searchnew.php?st=batasari&sa=Go!

అవకాశం చిక్కితే ఈ సినిమా తప్పక చూడండి. సమాజ కట్టుబాట్లకు, మనసులో రేగే సంఘర్షణకు మధ్య నలిగిపోయే వ్యక్తిగా భానుమతి గారు చక్కగా నటించగా సరిగా చూడనైనా చూడకపోవడం చేత మాధవి పేరునే హృదయంలో ప్రతిష్ఠించుకుని మనసులో ప్రేమకు, కట్టుకున్న భార్యకు న్యాయం చెయ్యలేక నలిగిపోయేవాడిగా నాగేశ్వరరావు గారు జీవించారు

3 కామెంట్‌లు:

  1. Very good attempt and nice explanation.
    Wish you all the best n waiting for more Blogs from you :)

    రిప్లయితొలగించండి
  2. విజయనగరవాసులకు స్వాగతం సుస్వాగతం

    మంచిపాట, నాకు చాలా ఇష్టం. భానుమతిగారంటేనే ఎంతో ఇష్టం నాకు. ఈ పాటలో ముఖ్యంగా "సమాజానికి, దైవానికి..." చరణం గొప్ప ఆర్తిగా విరక్తితో పాడతారు. మంచి పాట గుర్తు చేసారు. thank you!

    రిప్లయితొలగించండి
  3. @Sai, థాంక్సండి

    @సౌమ్య , నెనర్లు
    నాకూ భానుమతి గారి పాటలంటే చాలా ఇష్టం. ఆవిడ ప్లేబాక్ పాడితే ఇంకెన్నో మంచి పాటలు వినే అదృష్టం దక్కేది కదా అని ఎప్పుడూ అనుకుంటూ ఉంటా. ఈ సినిమాలో 'కనేరా కామాంధులై', 'లోకమెరుగని బాలా', పాటలు కూడా బాగుంటాయి.

    రిప్లయితొలగించండి