22, జులై 2010, గురువారం

చిన్ననాటి కథలు-2

ఈ కథ మా అమ్మ చిన్నప్పుడు వాళ్ళ తాతగారు చెప్పినది, అడిగి అడిగి మరీ చిన్నప్పుడు ఇది చెప్పించుకునేవాళ్ళం :-)

ఒకానొక ఊరిలో ఒక పేద బ్రాహ్మడు ఉండేవాడు. అతనికి పెద్దగా పాండిత్యం అబ్బకపోయినా భార్యాబిడ్డలను పోషించడానికి పురాణ కాలక్షేపం పేరుతో తన నోటికి వచ్చింది చెప్తూ నాలుగు రాళ్ళను సంపాదించేవాడు. కొంతకాలానికి ఆ ఊర్లోవాళ్ళకు ఇతని సంగతి అర్ధమయ్యి ఇతనికి ఆదరణ కరువౌతుంది. దాంతో పొట్ట చేత పట్టుకుని కొంత దూరం ప్రయాణం చేసి వేరే ఊరు చేరుకుంటాడు. ఆ ఊరి ప్రజలు బొత్తిగా అమాయకులని, అజ్ఞానులని గ్రహించి పురాణప్రవచనాలు చేస్తానని చెప్పి ఆ ఊర్లోనే స్థిరపడిపోతాడు. ఆ ఊరి ప్రజలు పాపం ఇతను చెప్పిందే వింటూ ఈ బ్రాహ్మడిని దైవాంశ సంభూతునిగా భావించి గౌరవిస్తూ ఉంటారు.
కొంత కాలానికి ఒక నిజమైన పండితుడు ఆ ఊరి మీదుగా పోతూ చీకటి పడడంతో ఆ రాత్రికి అక్కడే బస చేయదలచి ఊరి కరణం వద్దకు పోయి తనకు ఆ రాత్రికి ఆశ్రయమిమ్మని కోరతాడు. కరణం మహదానందంగా ఒప్పుకుని కావలసిన ఏర్పాట్లు అన్నీ చూస్తాడు. పండితుడు భోజనం కానిచ్చి ఇక విశ్రమిద్దామని నడుం వాల్చబోతుంటే, ఊరి ప్రజలంతా కలిసి రామాలయం వేపుకు వెళ్తూ ఉండడం గమనించి కరణాన్ని ఆ సంగతి అడుగుతాడు. తమ ఊరిలో రోజూ ఒక మహానుభావుడు పురాణ ప్రసంగం చేస్తాడని, తాను కూడా అక్కడికే పోతున్నానని, ఆ పండితుని కూడా వచ్చి విని తరించవలసిందిగా చెప్తాడు. సరే ఎలాగో చేసేది ఏమీ లేదు కనుక కాస్త కాలక్షేపంగా ఉంటుందని తలచి పండితుడు కూడా బయలుదేరతాడు.
పురాణ శ్రవణం మొదలైన కాసేపటికి పండితుడికి ఏ పురాణం చెప్తున్నారో, దేని గురించి చెప్తున్నారో బొత్తిగా అర్ధం కాక లేచి సంస్కృతం లో 'కిం' అని ప్రశ్నిస్తాడు (అంటే ఏంటి అని అర్ధం). ఆ ఊరి ప్రజలు చెప్తే వినడమే కాని ఎన్నడూ ప్రశ్నించని వారవడం చేత ఈ పండితుని వైపు అబ్బురపడుతూ చూసి ' కొత్త పంతులుగోరు ఏదో గొప్ప ప్రశ్న వేసారురా, మన పంతులు గారు ఏం చెప్తారో విందామ'ని అనుకోసాగారు. అందరి దృష్టి తన మీదే ఉండడం గ్రహించి ఆ పండితుని నోరు ఎలా అయినా మూయించకపోతే అక్కడ తన ఉనికికే ముప్పు కలుగుతుందని భావించి,
'కిం లేదు కం లేదు
గూట్లో మంచం
విత్తుల పందెం
పంట నలుతుం
మా ఎల్లెద్దు కొం
ఎదురం లో ఢం ఢం
ఇక పో ఝం ఝం' అని నోటికి వచ్చింది అనేస్తాడు.
ఆ అమాయక ప్రజలు పాపం, 'ఆ కొత్త పంతులు ఒక ముక్క అడిగాడో లేదో మన పంతులు గారు ఎంత లావాటి సమాధానం చెప్పారురా' అనుకుని ఓ తెగ మురిసిపోతారు. అక్కడి పరిస్థితిని ఆకళింపు చేసుకున్న పండితుడు 'చెప్పినాయన బాగానే ఉన్నాడు, విన్నవాళ్ళు బాగానే ఉన్నారు, మధ్యలో మనకెందుకొచ్చింది బాధ అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోవడమే ఉత్తమమని అనుకుని 'నమస్కారం' అంటాడు. దీనితో ఆ పంతులుకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది, పండితుడు తన ఓటమిని అంగీకరించి వెళ్ళిపోతున్నాడని ఇంకా తన పాండిత్యం ప్రదర్శిద్దామని,
' నమస్కారం లేదు గిమస్కారం లేదు
మా శత్రువులకు తిరస్కారం
నోరెత్తిన బహిష్కారం
ఇక మీరు లేచి పోవుట యశస్కారం ' అంటాడు.
సరే మర్యాదగా వెళ్ళిపోదామంటే ఈయన వెళ్ళనిచ్చేలా లేడు, ఇతనికి బుద్ధి చెప్పాల్సిందే అనుకుని, 'మహానుభావా మీ ముందు నేను పూర్తిగా ఓడిపోయాను, మీ పాండిత్యం ముందు నా ప్రతిభ వెల వెల పోతోంది, మీ దర్శన భాగ్యం తో నా జన్మ తరించింది, ఒకసారి దగ్గరగా వచ్చి మీ ఆశీర్వాదం తీసుకోదలిచా 'నన్నాడు. దానికా బ్రాహ్మడు ఉబ్బితబ్బిబ్బై 'ఓ దానికేముందోయ్, నా అంతటి పాండిత్యం ప్రతీవారికి అబ్బుతుందా, సాధన చేస్తే పైకి వస్తావు ' అని డాంబికాలు పోతాడు. పండితుడు బ్రాహ్మడి దగ్గరగా వెళ్ళి తల నుంచి ఒక వెంట్రుక లాగి, 'ఓ ప్రజలారా, ఈయన సామాన్య వ్యక్తి కాదు, సాక్షాత్ సరస్వతీ పుత్రుడు, ఈయన వెంట్రుక తీసుకుని నేను నా పూజ గదిలో పెట్టుకుని రోజూ పూజ చేసుకుంటాను ' అని అక్కడినుండి చక్కాపోతాడు.
ఇక అక్కడి వెర్రి బాగుల వాళ్ళు మాకంటే మాకని పంతులు దగ్గరకు వచ్చి తలా చేతికందినన్ని వెంట్రుకలు పీకడం మొదలుపెడతారు. పంతులు నొప్పి తో కేకలేస్తుంటే 'ఉండండి పంతులుగోరూ, కాసేపలా మెదలకుండా ఉండండి, కాసిన్ని రోజుల్లో మళ్ళీ మొలిచెయ్యవేంటి, అప్పుడు మళ్ళీ వచ్చి మా బంధువులుకు కొన్ని పట్టుకెళ్ళాలి ' అని తల మీద, చేతుల మీద ఎవరికి దొరికినన్ని వాళ్ళు పీక్కుని ఇళ్ళకు వెళ్ళిపోతారు. 'బాబోయ్ ఈ మూర్ఖులు అన్నంతపని చెయ్యగలరు, ఇక ఇక్కడ ఉండడం క్షేమం కాద 'ని రాత్రికి రాత్రే మూట ముల్లె సర్దుకుని అక్కడినుండి పారిపోతాడు పంతులు.

2 కామెంట్‌లు: